Share News

Vijayasai Reddy: నందమూరి కుటుంబాన్ని కలిసిన విజయసాయిరెడ్డి.. షాక్‌లో వైసీపీ..

ABN , Publish Date - Feb 02 , 2025 | 08:09 PM

వైసీపీ పార్టీలో నెం.2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పాక ఇటీవల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి వైసీపీకి షాకిచ్చాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నందమూరి కుటుంబాన్ని కలిసి వైసీపీ పార్టీ అభిమానుల్లో కలవరం రేపాడు..

Vijayasai Reddy: నందమూరి కుటుంబాన్ని కలిసిన విజయసాయిరెడ్డి.. షాక్‌లో వైసీపీ..
Vijayasai Reddy With Nandamuri Family

వైసీపీ పార్టీలో జగన్ తర్వాత అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి.. ఇటీవల సడెన్‌గా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా అని ప్రకటించి వైసీపీ అధినేత జగన్‌కు, పార్టీ అభిమానులకు షాకిచ్చాడు. ఆ వెంటనే షర్మిలతో భేటీ అయ్యి వైసీపీలో కలకలం రేపిన విజయ సాయిరెడ్డి.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఏ రాజకీయ పార్టీలో చేరను అని చెప్పి తమ అభిమాన నేత ఇప్పుడిలా చేస్తున్నాడేంటని వైసీపీ అభిమానులు కలవరపడుతున్నారు.


వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు నుంచి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వస్తున్న విజయసాయిరెడ్డి.. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏ2గా జగన్ కేసుల భారాన్ని, వైసీపీ పార్టీ బాధ్యతలను సమంగా పంచుకున్న వ్యక్తి హఠాత్తుగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి వైసీపీ శ్రేణులను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ ఎంపీ పదవికి ఇప్పటికే రాజీనామా చేసిన సాయిరెడ్డి.. వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నాడు. వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రాజీనామా సమర్పించేందుకు ఎదురుచూస్తున్నారు.


ఎంపీ పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ఏ2 విజయసాయిరెడ్డి చెప్పిన మాటలను రాజకీయ విశ్లేషకులు అంతగా నమ్మడం లేదు. కూటమి పార్టీకి అనుకూలంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడం.. పవన్, చంద్రబాబులతో నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదని ప్రకటించడం వంటివి అనేక అనుమానాలకు తావిస్తోందని భావిస్తున్నారు. కేసుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు కచ్చితంగా బీజేపీ పార్టీలో చేరవచ్చని విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం కూడా చేరే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లే రాజీనామా ప్రకటన తర్వాత విజయసాయిరెడ్డి వేస్తున్న ప్రతి అడుగూ సంచలనం రేపుతోంది.


లండన్ నుంచి వైసీపీ అధినేత తిరిగి రాకముందే విజయసాయిరెడ్డి చేస్తున్న చర్యలు వైసీపీ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇక ఏ రాజకీయ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన వ్యక్తి నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి వైసీపీ శ్రేణుల్లో కలవరం పుట్టించాడు. తాజాగా నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ కనిపించడమే కాదు.. ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.


నందమూరి కుటుంబంతో సరదాగా గడిపిన విజయసాయిరెడ్డి..

నందమూరి కుటుంబసభ్యుడు, టీడీపీ పార్టీ దివంగత నేత తారకరాత్న భార్య అలేఖ్య గురించి తెలిసే ఉంటుంది. విజయ సాయిరెడ్డి ఈమెకు బాబాయి వరుస అవుతారు. తారకరత్న, అలేఖ్యల ప్రేమ వివాహానికి ఇరువురి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో.. సాయిరెడ్డే మద్ధతు ఇచ్చినట్లు ఓ సందర్భంలో అలేఖ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న సాయిరెడ్డి ఇటీవల అలేఖ్య కుటుంబంతో కలిసి కాసేపు గడిపారు. ఆ ఫోటోను 'వీకెండ్ విత్ విఎస్ఆర్' అని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది అసలు విషయం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పిన విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనే సంగతి కచ్చితంగా తెలియకపోయినా.. ఆయన కుమార్తె మాత్రం బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Updated Date - Feb 02 , 2025 | 08:09 PM