Share News

ఉక్కు ఉద్యోగుల మెడపై కత్తి

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:19 AM

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి పని చేయించే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తోంది.

ఉక్కు ఉద్యోగుల మెడపై కత్తి

  • రోజుకు 12 గంటలు పని

  • 16 నుంచి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో ఉద్యోగులకు స్టీల్‌ప్లాంటు యాజమాన్యం నోటీస్‌

  • వరుసపెట్టి హెచ్‌ఆర్‌ నుంచి ఉత్తర్వులు

  • నెలాఖరు వరకూ సెలవులు రద్దు

  • విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

విశాఖపట్నం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి పని చేయించే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిన తరువాత ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, రెండు బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా పూర్తి ఉత్పత్తి చేస్తున్నామని ఒక వైపు ప్రకటిస్తూనే ఉద్యోగులు ఇంకా పనిచేయాల్సి ఉందని చెబుతోంది. మరో వైపు కాంట్రాక్టు కార్మికుల సంఖ్య భారీగా తగ్గిస్తోంది. ఇటీవల 1,500 మందిని వివిధ కారణాలతో తొలగించింది. మరో రెండు వేల మందిని ఆపేయాలని జాబితా రూపొందించింది. ఈ చర్యలను నిరసిస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి 13,000 మంది కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. యాజమాన్యానికి నోటీసు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులు పది వేల మందితో పూర్తి ఉత్పత్తి చేయించాలని యాజమాన్యం నిర్ణయించింది.

సాధారణంగా వేలాది మంది సమ్మె చేసినప్పుడు ఉత్పత్తిపై ప్రభావం ఉంటుంది. కొన్ని విభాగాలు మూతపడతాయి. వాటిని కనీస స్థాయిలో నడిపే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే యాజమాన్యం 13 వేల మంది విధులకు రాకపోయినా సరే ఉత్పత్తిలో ఎటువంటి తేడా ఉండకూడదని, వారి పనిని మిగిలిన ఉద్యోగులు చేయాలని ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎవరూ సెలవులు పెట్టకూడదని మూడు రోజుల క్రితం మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌) ఉత్తర్వులు జారీచేసింది. రెండు రోజుల క్రితం మరో ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం ప్లాంటులో రోజుకు ఎనిమిది గంటల పని విధానం నడుస్తోందని, సమ్మె నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోజుకు 12 గంటలు పనిచేయాలని, పూర్తి ఉత్పత్తికి సహకరించాలని పేర్కొంది. ఇవి చాలవన్నట్టు సోమవారం ఇంకో ఉత్తర్వు జారీ చేసింది. విధులకు హాజరయ్యే ఉద్యోగులు వారి షిఫ్ట్‌ పూర్తయ్యేంత వరకు ఆ విభాగంలోనే ఉండాలని, పని ప్రాంతం వదిలి ఇతర విభాగాలకు గాని, బయటకు గాని వెళ్లకూడదని స్పష్టంచేసింది. కొంతమంది విధులకు వచ్చినట్టు హాజరు వేసుకొని మెయిన్‌ గేట్‌ నుంచి వెళ్లిపోతున్నారని ఆరోపించింది. పని చేసే ప్రాంతంలో ఉద్యోగులు లేనట్టయితే దానిని సీరియస్‌గా పరిగణించి సర్వీసు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఆర్‌ఎస్‌ జాబితా పెంచడానికే...

స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా అనుకున్న స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపడం వీలు కానుందన, ఇప్పుడు క్రమ శిక్షణ చర్యల ద్వారా ‘తప్పనిసరి పదవీ విరమణ’ (సీఆర్‌ఎస్‌) చేయించడానికి ఈ నిబంధనలన్నీ కొత్తగా అమలులోకి తెస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమను ఎంత వేధించాలని చూసినా కాంట్రాక్టు కార్మికుల తొలగింపును అంగీకరించబోమని, వారికి నిరవధిక సమ్మెకు అండగా ఉంటామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రతి ఉద్యోగి రోజుకు 12 గంటలు పనిచేయాలని చెబుతున్నారని, ప్లాంటు లోపల ఉత్పత్తి సమయంలో వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని...అటువంటిచోట్ల 12 గంటలు ఎలా పనిచేయగలుగుతామని ఆయా విభాగాల ఉద్యోగులు వాపోతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:19 AM