చిత్ర పరిశ్రమ విశాఖ వచ్చేలా కృషి
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:29 AM
హైదరాబాద్‌లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖపట్నం తరలి వచ్చేలా ప్రయత్నిస్తున్నామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

అల్లు అరవింద్ వంటి నిర్మాతలు స్టూడియోల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు
మధ్య తరగతికి సైతం వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ అందుబాటులో ఉండేలా చూస్తాం
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి):
హైదరాబాద్‌లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖపట్నం తరలి వచ్చేలా ప్రయత్నిస్తున్నామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. భీమిలి బీచ్‌రోడ్డులోని తిమ్మాపురంలో గల వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌ను ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుతో కలిసి శనివారం ఆయన సందర్శించారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ, విశాఖలో చిత్ర పరిశ్రమకు సంబంధించి వివిధ వర్గాలకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో పదకొండేళ్ల క్రితం తిమ్మాపురంలో ఈ క్లబ్ (కల్చరల్ సెంటర్) ఏర్పాటు చేశామన్నారు. అయితే వైసీపీ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రంగా క్లబ్ మారిపోయిందని, కమిటీ సభ్యులు, వారి వారసులు కూడా అదే పదవుల్లో కొనసాగేలా నిబంధనలు మార్చేశారని ఆరోపించారు. వాటన్నింటినీ సవరించి మధ్య తరగతికి సైతం క్లబ్ అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం గతంలో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందన్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ వంటి నిర్మాతలు ఇక్కడ స్టూడియోల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, ఈ క్లబ్‌ను ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చామన్నారు. రాజకీయాలు, గ్రూపులకు తావు లేకుండా చేస్తామని చెప్పారు.
ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలు
జిల్లాకు 406 యూనిట్లు మంజూరు
రూ.16.88 కోట్లు కేటాయింపు
రూ.6.68 కోట్లు సబ్సిడీ
14 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
విశాఖపట్నం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025-25 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 నుంచి మే పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 50 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. జిల్లాలో 406 యూనిట్లకు రూ.16.88 కోట్లు మంజూరయ్యాయని, అందులో రూ.6.68 కోట్లు సబ్సిడీగా, రూ.9.35 కోట్లు బ్యాంకు రుణంగా, రూ.0.84 కోట్లు లబ్ధిదారుల వాటాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. కనిష్ఠంగా రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.4 లక్షల వరకూ సబ్సిడీ (ఐఎస్‌బీ సెక్టార్, ట్రాన్స్‌పోర్ట్, అగ్రి కల్చర్ సెక్టార్) ఉంటుందన్నారు.
ఇవీ యూనిట్లు..
ఫ్లవర్ బొకే మేకింగ్ అండ్ డెకరేషన్, వర్మీ కంపోస్ట్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్, ఎల్‌ఈడీ బల్బులు అండ్ ఎనర్జీ సేవింగ్ డివైజ్ అసెంబ్లింగ్, ప్లంబింగ్ అండ్ ఎలక్ర్టీషియన్ సర్వీసెస్, వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ఫ్యూరిఫికేషన్ కియోస్క్, వాటర్ రీసైక్లింగ్ అండ్ అప్ సైక్లింగ్ బిజినెస్, మొబైల్ రిపేరింగ్ అండ్ ఎలక్ర్టానిక్ సర్వీసెస్, సోప్, డిటర్జెంట్ మేకింగ్స్, ఫిష్ ఫార్మింగ్ (అగ్రి కల్చర్), అడ్వంచర్ టూరిజం (ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్), మొబైల్ కార్ వాష్ అండ్ సర్వీస్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ యూనిట్, ఫ్లైయాష్ బ్రిక్ ప్రొడక్షన్, స్కిల్ ప్రొడక్షన్, వాటర్ ఫ్యూరిఫికేషన్, వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్, జూట్ బ్యాగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ మేకింగ్, సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ అండ్ ఇన్‌స్టాలేషన్, సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్, కాయిర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, ఆయుర్వేదిక్ క్లినిక్, జనరిక్ మెడికల్ షాప్, బ్యూటీ పార్లర్, మెడికల్ ల్యాబ్, ఈవీ బ్యాటరీ చార్జింగ్ యూనిట్, పాసింజర్ ఆటో (3 వీలర్-ఈ ఆటో), పాసింజర్ ఆటో (4 వీలర్), పాసింజర్ కార్స్ (4 వీలర్), గూడ్స్ ట్రక్, డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ (గ్రూప్ యాక్టివిటీ) వంటి వాటికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.