Anitha Criticizes Jagan: అంతా వైసీపీ ప్లానే.. హెలికాఫ్టర్ వివాదంపై అనిత ఫైర్
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:43 AM
Anitha Criticizes Jagan: జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. జగన్‌కు ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువే ఇస్తున్నామని.. జగన్ మాట్లాడే పద్దతి సరైనదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 9: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలైందన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు. 250 మంది పోలీసులు హెలిపాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. వీఐపీని తీసుకువెళ్లడానికి వీలుకాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తోందని... వీటన్నింటి పైన విచారణ కొనసాగుతుందని తెలిపారు.
మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నారని.. గతంలో చంద్రబాబు బయటికి రాకుండా అడ్డుకున్నారని.. ఎయిర్‌పోర్టుల్లో గుండాలను పెట్టి, అడ్డుకున్నారని గుర్తుచేశారు. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారని.. ఇలాంటివన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కస్టోడియల్ టార్చర్ అనేది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అని.. తమది కాదని స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినందుకు తమ మీద అనేక మంది మీద కేసులుపెట్టారన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాలని.. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు. ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ భద్రత ఇస్తున్నామని వెల్లడించారు.
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ మాట్లాడే పద్ధతి సరియైనదేనా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 2526 హత్యలు జరిగాయని.. అక్కడికి వెళ్తామన్నా కూడా.. తాము ప్రొటెక్షన్ ఇస్తామని తెలిపారు. ఎవరైనా పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా తగిన విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భద్రతా వైఫల్యం ఆరోపణలపై హోం మంత్రిగా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్వయంగా మీటింగ్ పెట్టి.. పార్టీ నిర్ణయాన్ని, ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవించాలని.. ఎవరు బయటకు రావద్దని పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత వెల్లడించారు.
ఏం జరిగిందంటే
కాగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో నిన్నటి జగన్ పర్యటనలో హైడ్రామా నెలకొంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ జిల్లాకు వచ్చారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కూడా. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేశారు. దీంతో జగన్ హెలికాఫ్టర్ దిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున వీరంగం సృష్టించారు. హెలికాఫ్టర్ వద్ద నానా హంగామా చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇంత జరిగినా పోలీసులు తగిన భద్రత కల్పించలేదని.. హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంతో రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చిందంటూ డ్రామాకు తెరతీశారు వైసీపీ నేతలు. హెలిప్యాడ్ చుట్టూ బ్యారికేడ్లు పెట్టి 250 మంది పోలీసులను మోహరించినప్పటికీ వైసీపీ కార్యకర్తలు అరాచకంగా ప్రవర్తించారు. చాలా సేపటి తర్వాత అతికష్టం మీద కార్యకర్తలను అడ్డుతొలగించి జగన్ బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత జగన్ పాపిరెడ్డిపల్లికి వెళ్లిపోయారు. అయితే హెలికాఫ్టర్ విండ్‌షీట్ దెబ్బతిన్నదంటూ వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలెట్ వెళ్లిపోయారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే హెలికాఫ్టర్ విండ్ షీట్ దెబ్బతింటే పైలెట్ ఎలా ప్రయాణిస్తారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇందంతా వైసీపీ ముందస్తు ప్లానే అనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి
Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..
Karumuri: మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం
Read Latest AP News And Telugu News