దూర విద్యలో ఇష్టారాజ్యం
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:54 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఇష్టానుసారం పరీక్షల నిర్వహణ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏయూ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు 35 కేంద్రాలు
పరీక్షలు రాస్తున్న 9 వేల మంది విద్యార్థులు
అనేక చోట్ల యథేచ్ఛగా మాస్ కాపీయింగ్
భారీగా వసూలు చేశారనే ఆరోపణలు
కాలేజీల మధ్య వివాదాలు.. ఫిర్యాదులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఇష్టానుసారం పరీక్షల నిర్వహణ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఫిర్యాదులందినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దూర విద్య కేంద్రం ఆధ్వర్వంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఏటా రెండు రకాలుగా ప్రవేశాలు చేపడుతున్నారు. ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థులకు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అనేకచోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల నిర్వాహకులు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సబ్జెక్టు వారీగా ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని కాలేజీలపై ఫిర్యాదులున్నాయి.
కేలండర్ ఇయర్ అడ్మిషన్స్‌లో భాగంగా వివిధ కోర్సుల్లో చేరిన 9వేల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి 40 నుంచి 80 మంది విద్యార్థులను కేటాయించారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు ఒక్కో కేంద్రానికి అబ్జర్వర్‌తోపాటు స్పెషల్ స్క్వాడ్‌ను నియమించారు. అబ్జర్వర్లను కేంద్రాల నిర్వాహకులు మేనేజ్ చేస్తుండడంతో తాజాగా వర్సిటీ అధికారులు స్పెషల్ స్క్వాడ్‌ను నియమించారు. అయితే, ఈ స్వ్కాడ్ కళ్లను కప్పి కొన్నిచోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందనే విమర్శలున్నాయి.
సమయం మించినా..
పరీక్షలు ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలి. కొన్ని చోట్ల ఆరుదాటిన తరువాత కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలోని ఒక కేంద్రంలో సాయంత్రం పరీక్షలు నిర్వహించినట్టు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీటిపై దూర విద్యా కేంద్రం అధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేస్తున్నారు.
ఈ కేంద్రాలపై ఆరోపణలు..
దూర విద్యా కేంద్రాలకు సంబంధించి గజపతినగరంలోని ఒక కాలేజీ, కొత్తవలసలోని రెండు కాలేజీలు, ఎస్.కోటలోని ఒక కాలేజీ, సబ్బవరం, తాడేపల్లి గూడెం, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లోని కొన్ని పరీక్ష కేంద్రాలపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. ఏయూ దూర విద్యా కేంద్రం కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల విద్యార్థులు భిన్నమైన కోర్సులు పూర్తిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పరీక్షల నిర్వహణలో లోపాలపై ఏయూ దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ మోహన్‌ను వివరణ కోరగా పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి కేంద్రంలో అబ్జర్వర్ తోపాటు స్పెషల్ స్క్వాడ్‌ను నియమించామన్నారు. ఆరోపణలు వచ్చిన కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు.