Share News

నర్సీపట్నంలో ఆయుష్మాన్‌ ఆస్పత్రి

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:18 AM

స్థానిక ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆస్పత్రిని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నర్సీపట్నంలో ఆయుష్మాన్‌ ఆస్పత్రి
ఏరియా ఆస్పత్రి ఆవరణలో ప్రారంభానికి సిద్ధంగా వున్న ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరం

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా రేపు ప్రారంభం

గత టీడీపీ హయాంలోనే రూ.20 లక్షలతో భవన నిర్మాణం

ప్రారంభించే సమయానికి మారిన ప్రభుత్వం

ఐదేళ్లపాటు అందుబాటులోకి తీసుకురాని వైసీపీ పాలకులు

కూటమి అధికారంలోకి రావడంతో కదలిక

మరమ్మతులకు రూ.12 లక్షలు మంజూరు చేయించిన స్పీకర్‌

నర్సీపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆస్పత్రిని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఆయుష్‌ విభాగం నేచురోపతి ఆస్పత్రి కోసం స్థలం కేటాయించారు. కొంత భాగంలో యోగా సెంటర్‌, ఖాళీ స్థలంలో వాకింగ్‌ ట్రాక్‌, రోగులు సేద తీరడానికి బెంచీలు వేసి చిన్నపార్కుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక చేశారు. 2017వో శంకుస్థాపన చేసి రూ.20 లక్షలతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. 2019లో సాధారణ ఎన్నికలనాటికి భవన నిర్మాణం పూర్తి చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఐదేళ్లపాటు భవనాన్ని నిరుపయోగంగా వుంచేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఆయుష్‌ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. భవనం మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, జిల్లా కలెక్టర్‌ రూ.9 లక్షలు మంజూరు చేశారు. భవనానికి రంగులు వేసి, విద్యుత్తు, ఫ్లోరింగ్‌ టైల్స్‌ వేసి, గేటు, తలుపులు అమర్చారు. ఆ ఆస్పత్రికి మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు సైతం మంజూరైంది. ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యశోద రెండు నెలల నుంచి ఏరియా ఆస్పత్రి ఓపీ విభాగం కొత్త భవనంలోని ఒక గదిలో వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ (ఆయుర్వేద ఆస్పత్రి)ను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:18 AM