జిల్లాలో మలేరియా కేసులు అధికం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:39 AM
జిల్లాలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు అధికంగా నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

డెంగ్యూ, చికున్‌గున్యా కూడా...
మధుమేహం, బీపీ, గుండె, కేన్సర్, కిడ్నీ వ్యాధులు తక్కువ
వ్యాధుల స్ర్కీనింగ్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
చింతపల్లి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు అధికంగా నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. మధుమేహం, బీపీ, గుండె, కేన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఇతర జిల్లాలతో పోల్చుకుంటే జిల్లాలో తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధులపై వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రోగుల గణాంకాల ఆధారంగా వ్యాధులకు గల కారణాలను అన్వేషించి, వ్యాధులు నియంత్రించేందుకు, ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
జిల్లాలోని 22 మండలాల పరిధిలో 9,53,960 మంది జనాభా ఉండగా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉద్యోగులు ప్రతి గృహాన్ని సందర్శించి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ స్ర్కీనింగ్ పరీక్షల ఆధారంగా జిల్లాలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు అధికంగా నమోదైనట్టు గుర్తించారు. గిరిజన ప్రాంతంలో ఈ కేసులు ఎందుకు అధికంగా నమోదవుతున్నాయి?, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య, కుటుంబ నియంత్రణశాఖ కార్యాచరణ ప్రారంభించింది.
దీర్ఘకాల వ్యాధులు తక్కువే..
జిల్లాలో దీర్ఘకాల వ్యాధులు తక్కువగా నమోదైనట్టు వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాలు చెబుతున్నాయి. పది రకాల వ్యాధులపై గ్రామాల్లో వైద్య సిబ్బంది స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రక్తపోటు(బీపీ)తో 28,674 మంది, మధుమేహం(షుగర్) వ్యాధితో 4,706 మంది, రక్తపోటు, మధుమేహం రెండు వ్యాధులతో 8,956, గుండె సంబంధిత వ్యాధులతో 1,296, నోరు, రొమ్ము, గర్భాశయం, ఇతర కేన్సర్ వ్యాధులతో 1,045, లివర్ 1,045, పల్మనరీ 463, నరాల సంబంధిత వ్యాధులతో 1,025, కిడ్నీ సంబంధిత వ్యాధులతో 1,067 మంది బాధపడుతున్నారని నిర్ధారించారు. రోగులకు మెరుగైన చికిత్స
ఆరోగ్య ఆంధ్ర సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి స్ర్కీనింగ్ పరీక్షల్లో గుర్తించిన రోగులకు మెరుగైన చికిత్స, ఉచితంగా మందులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రజల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది రోగులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య తనిఖీలు నిర్వహించనున్నారు.