Share News

దళారులుగా మార్కెటింగ్‌ శాఖాధికారులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:57 AM

విశాఖపట్నంలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు కొందరు కమీషన్లకు ఆశపడి దళారులుగా మారుతున్నారు.

దళారులుగా మార్కెటింగ్‌ శాఖాధికారులు

  • అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టమాటా కొని విశాఖ రైతుబజార్లలో విక్రయం

  • మూడు నెలలుగా ఇదే తంతు

  • ప్రస్తుతం వీధుల్లో కిలో రూ.14కు విక్రయం

  • రైతుబజార్లలో రూ.16!

  • అన్ని రకాల కూరగాయలను అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి

  • ఇక్కడ అమ్మించేందుకు ప్లాన్‌

  • నష్టపోతున్నామని రైతులు చెబుతున్నా పట్టించుకోని వైనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు కొందరు కమీషన్లకు ఆశపడి దళారులుగా మారుతున్నారు. రైతుబజార్ల లక్ష్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. టమాటా విస్తృతంగా పండడంతో మూడు నెలల క్రితం రైతుకు గిట్టుబాటు ధర లభించలేదు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రైతులు టమాటాను పారబోస్తున్నారని వార్తలు రావడంతో ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకువచ్చింది. వారి దగ్గర టమాటా కొని ఎక్కువ వినియోగం ఉన్న జిల్లాల్లో విక్రయించేలా చర్యలు చేపట్టంది. ఆ క్రమంలోనే విశాఖపట్నంలో రైతుబజార్ల ద్వారా ఆ టమాటా విక్రయానికి శ్రీకారం చుట్టారు. విశాఖ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి, రవాణా చార్జీలు కలుపుకొని ఇక్కడ రైతుబజార్లలో రైతుల ద్వారా అమ్మించసాగారు.

విశాఖ రైతుబజార్లకు రోజుకు 30 టన్నుల టమాటా అవసరం. రైతుల పంట కాకుండా అదనంగా అవసరమైన టమాటాను డ్వాక్రా సంఘాలు జ్ఞానాపురం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కొని రెండు రూపాయల లాభం వేసుకుని రైతుబజార్లలో విక్రయిస్తుంటాయి. ఈ విధానం కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. అయితే మార్కెటింగ్‌ అధికారులు టమాటా బయట నుంచి తెప్పించడం వల్ల డ్వాక్రా గ్రూపులు హోల్‌సేల్‌లో కొనకూడదని ఆంక్షలు పెట్టారు. తాము తెప్పించిన సరుకే విక్రయించాలని నిబంధన పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది. గత నెల రోజులుగా ఆయా జిల్లాల్లోనే టమాటా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. అయినా అధికారులు అక్కడ కొని, ఇక్కడ అమ్మడం ఆపలేదు. ఈ వ్యవహారంలో వారికి కిలోకు రెండు నుంచి మూడు రూపాయల వరకు గిట్టుబాటు అవుతోందని సమాచారం. రోజుకు 30 టన్నులు కొంటున్నారు. అక్కడ రైతులకు ఎంత ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇక్కడ మాత్రం రేటు రూ.15కి తక్కువ లేకుండా అమ్ముతున్నారు. ఈ విధానం లాభదాయకంగా ఉండడంతో ఇకపై మిగిలిన కూరగాయలు కూడా అదే విధానంలో తెప్పించి రైతులకు సరఫరా చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. శుక్రవారం నగరంలో ఆటోల్లో టమాటా తీసుకువచ్చి వీధుల్లో వంద రూపాయలకు ఏడు కిలోలు చొప్పున విక్రయించారు. అంటే కిలో రూ.14 పడింది. రైతుబజార్లలో మాత్రం కిలో రూ.16 చొప్పున విక్రయించారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళితే...ఈ మూడు నెలలూ టమాటా రేటు పెరగకుండా స్థిరంగా ఉండేలా చూశామని, ఆ విషయం గుర్తించాలని చెబుతున్నారు.

రైతులకు నష్టాలు

రైతులు, డ్వాక్రా సంఘాలు హోల్‌సేల్‌లో టమాటా కొంటే వారికి క్రేటుకు రెండు కిలోలు తరుగు కింద ఇస్తారు. అధికారులు మాత్రం క్రేటు మొత్తానికి లెక్క కట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రైతు రోజుకు ఐదు క్రేట్ల టమాటా అమ్మితే పది కిలోల దగ్గర తరుగు కోల్పోతున్నాడు. అది కాకుండా రవాణా చార్జీలు అధికంగా ఉంటున్నాయి. అధికారులు ఇచ్చిన టమాటా అమ్మడం వల్ల రైతుల్లో దాదాపుగా 50 శాతం మందికి లాభం రాకపోగా చేతి డబ్బులు పడుతున్నాయి. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. టమాటా వద్దని చెప్పినా బలవంతంగా అమ్మిస్తున్నారు. ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో ఏడాది మొత్తం కొనసాగించడానికి ఇప్పుడున్న అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. బజార్లకు వచ్చే రైతుల వద్ద ఇంకా ఎన్ని రోజులు సొంత టమాటా (పండించినది) వస్తుందో ముందే అడిగి తెలుసుకొని లెక్కలేసుకుంటున్నారు. పైగా విశాఖపట్నంలో రైతులు దళారుల్లా మారిపోయారని, పంటలు పండించకుండా హోల్‌సేల్‌లో కొని ఎక్కువకు అమ్మి లాభపడుతున్నారని మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ రైతుబజార్లను సందర్శించి తమ కష్టాలు తెలుసుకుంటే ఈ బాధలు ఉండవని, ఎవరు చెబుతున్నది నిజమో తెలుస్తుందని రైతులు అంటున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:57 AM