చందనోత్సవంపై నేడు మంత్రుల సమావేశం
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:03 AM
నగరంలో బుధవారం మంత్రుల సమావేశం జరగనుంది.

చందనోత్సవంపై నేడు మంత్రుల సమావేశం
విశాఖపట్నం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలో బుధవారం మంత్రుల సమావేశం జరగనుంది. ఈ నెల 30న సింహాచలంలో వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ఉత్సవాన్ని ఎలా నిర్వహించాలి? ఏర్పాట్లు ఏమిటనే అంశాలపై చర్చించడానికి దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నగరానికి వచ్చారు. ఈ సమావేశం కోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వస్తున్నారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుంది.
రైళ్లు రద్దు, రీ షెడ్యూల్
విశాఖపట్నం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
వాల్తేరు డివిజన్ పరిధిలో నిర్మాణ పనుల రీత్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. అలాగే కొన్నింటి గమ్యాలను కుదించామని, మరికొన్నింటిని రీ షెడ్యూల్ చేశామని పేర్కొన్నారు.
రద్దైన రైళ్లు: ఈ నెల 22, 29, మే 4న విశాఖ-కొరాపుట్ పాసింజర్ (58538), కొరాపుట్-విశాఖ పాసింజర్ (58537), విశాఖ-రాయపూర్ పాసింజర్ (58528), 23, 29, మే 5 తేదీల్లో రాయపూర్-విశాఖ పాసింజర్ (585227), 28న విశాఖ-కొరాపుట్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18512), 29న కొరాపుట్-విశాఖ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18511)
రీ షెడ్యూల్: ఈ నెల 22న విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (12807), 21న నాందేడు-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20810), మే 3న ఎర్నాకులం-టాటా ఎక్స్‌ప్రెస్ (18190) రైళ్లు ఒరిజినేటింగ్ స్టేషన్లలో గంటన్నర ఆలస్యంగా, 28న బనారస్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (18524) గంట ఆలస్యంగా బయలుదేరనున్నాయి.
గమ్యం కుదింపు: ఈ నెల 21, 28, మే 3 తేదీల్లో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243) గుంటూరు నుంచి విజయనగరం వరకూ, తిరుగు ప్రయాణంలో రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) ఈ నెల 22, 29, మే 4న విజయనగరం నుంచి గుంటూరు వరకూ నడుస్తాయి.
జిల్లా పర్యాటక శాఖ అధికారిణిగా మాధవి
విశాఖపట్నం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్న జె.మాధవిని జిల్లా పర్యాటక శాఖ అధికారిణిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు డీటీఓగా వ్యవహరిస్తున్న సుధా సాగర్ హెచ్‌పీసీఎల్ భూసేకరణ విభాగం అధికారిగా వెనక్కి వెళతారు. గతంలో డీటీఓగా వ్యవహరిస్తూ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జ్ఞానవేణిని ఎన్‌హెచ్-16 భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
మహారాణిపేట, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ జి.సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశానికి అన్నిశాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని సూచించారు.