Share News

ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:44 AM

ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమాపై మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన నోటీసును బుధవారం మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజుకు అందజేశారు.

ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
మునిసిపల్‌ కమిషనర్‌కు నోటీసు అందజేస్తున్న వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు

19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కమిషనర్‌కు నోటీసు

రమాకుమారి వైసీపీని వీడడంతో పదవి నుంచి దించేయాలని అధిష్ఠానం ఆదేశాలు

ఎలమంచిలి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమాపై మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన నోటీసును బుధవారం మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజుకు అందజేశారు.

ఎలమంచిలి మునిసిపల్‌ పాలకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 25 వార్డులకుగాను 23 వార్డులో వైసీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఒక వార్డులో టీడీపీ, మరో వార్డులో ఇండింపెండెంట్‌ గెలిచారు. 5వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన పిల్లా రమాకుమారి చైర్మన్‌గా ఎన్నుకున్నారు. కాగా రమాకుమారి ఇటీవల వైసీపీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. చైర్మన్‌ ఎన్నిక జరిగి నాలుగేళ్లు పూర్తికావడం, రమాకుమారి వైసీపీని వీడడంతో ఆమెపై ఆవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించేయాలని వైసీపీ పెద్దలు భావించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించారు. వైసీపీకి చెందిన మునిసిపల్‌ వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీ బోదెపు గోవింద్‌, తదితరులు హాజరయ్యారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పార్టీ మారిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించి, అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆమెను పదవి నుంచి దించేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. అనంతరం వైస్‌ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆర్రెపు నాగ త్రినాథ గుప్తాలతో కలిసిన మొత్తం 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన పత్రంపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు, మునిసిపల్‌ కమిషనర్‌కు నోటీసులు అందించారు.

Updated Date - Mar 27 , 2025 | 01:44 AM