Share News

గంగవరం వంతెన నిర్మించాలంటూ గిరిజనుల ఆందోళన

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:37 PM

జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీలో గంగవరం వంతెన నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ ఆదివారం ధారకొండ, గుప్పులవాడ పంచాయతీల గిరిజనులు ఆందోళన నిర్వహించారు.

గంగవరం వంతెన నిర్మించాలంటూ గిరిజనుల ఆందోళన
గంగవరం వంతెన నిర్మించాలంటూ ఆందోళన చేస్తున్న పలు గ్రామాల గిరిజనులు

సెప్టెంబరులో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన

డైవర్షన్‌ రోడ్డు వేసి మిన్నకున్న అధికారులు

ఆరు నెలలైనా ప్రతిపాదనలు సిద్ధం చేయని వైనం

రానున్న వర్షాకాలంలో పరిస్థితిపై భీతిల్లుతున్న గిరిజనం

సీలేరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీలో గంగవరం వంతెన నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ ఆదివారం ధారకొండ, గుప్పులవాడ పంచాయతీల గిరిజనులు ఆందోళన నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీన కురిసిన భారీ వర్షానికి గంగవరం వంతెన కొట్టుకుపోయింది. దీంతో వంతెన అవతల ఉన్న చిన్నగంగవరం, పెద్దగంగవరం, నరమామిడిగొంది, గుర్రాలమామిడి, గొంది, పేట్రాయి, రేఖపాడు, పలాసపొదరు, కమ్మరిగూడ, బంధమామిడి, సరియాపల్లి గ్రామాలకు రవాణా సౌకర్యాలు తెగిపోయాయి. వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలికంగా డైవర్షన్‌ రోడ్డు వేసి ద్విచక్ర వాహనాలు, ఆటోలు తిరగడానికి చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. వంతెన కొట్టుకుపోయి ఆరు నెలలు గడుస్తున్నా శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టలేదు. మరో రెండు నెలల్లో మన్యంలో వర్షాల సీజన్‌ మొదలైపోతుందని, వర్షాలు కురిస్తే ఈ ప్రాంతీయుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని 20 గ్రామాల గిరిజనులు ఆందోళన నిర్వహించారు. ఈ ప్రాంతంలో గర్భిణులు అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా.. ఇతర రోగులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలన్నా తమకు వేరే మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి గంగవరం వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 30 , 2025 | 10:37 PM