Share News

టీచర్ల బదిలీలపై కసరత్తు

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:45 PM

కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ హయాంలో విద్యారంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యారంగం బలోపేతానికి అనేక సంస్కరణలు చేపడుతున్నారు.

టీచర్ల బదిలీలపై కసరత్తు
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం

బదిలీలపై కొత్త చట్టం చేసిన కూటమి ప్రభుత్వం

ఈ విద్యా సంవత్సరం నుంచి పారదర్శకంగా అమలు

టీచర్ల సీనియారిటీ జాబితా సేకరణ

స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ హయాంలో విద్యారంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యారంగం బలోపేతానికి అనేక సంస్కరణలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం రూపొందించిన బదిలీల నియంత్రణ చట్టం-2025 మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో టీచర్ల బదిలీలకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

జిల్లాలో వివిధ హోదాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 6,800 మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం ఈ ఏడాది బదిలీలు చేపట్టేందుకు ఇప్పటికే సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. సీనియారిటీ జాబితా రూపొందించేందుకు వివిధ కేడర్‌ ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముందుగా జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను రూపొందించి లోపాలను సరిదిద్దనున్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బదిలీల ప్రక్రియను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నోడల్‌ విద్యాశాఖాధికారి నిర్వహించనున్నారు.

చట్టం అమలుకు ఆమోద ముద్ర

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం- 2025 ముసాయిదా సిద్ధం చేసి ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఇటీవల శాసన సభలో చట్టం అమలుకు ఆమోద ముద్ర వేసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యాశాఖ నిర్వీర్యం అయిందని, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా చేసిందని ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ పేరుతో ఉపాధ్యాయుల బదిలీలు చేసేవారు. సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌ పద్ధతి ప్రకారం కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల ఆధారంగా బదిలీలు జరిగేవి. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులకు కూటమి ప్రభుత్వం చెక్‌ పెడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం -2025 రూపొందించి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల బదిలీల్లో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఏడాది మే నెల 31 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేసి, పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టేలా చట్టాన్ని రూపొందించారు. కొత్త చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Mar 30 , 2025 | 10:45 PM