గాడి తప్పుతున్న గ్రేటర్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:41 AM
రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపుపొందిన జీవీఎంసీని ముందుండి నడిపించాల్సిన కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది.

రెండు నెలల నుంచి ఖాళీగా కమిషనర్ కుర్చీ
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన నేపథ్యంలో క్యాంపు రాజకీయాల్లో మేయర్ బిజీ
నిలిచిపోయిన క్షేత్రస్థాయి తనిఖీలు
జీవీఎంసీలో అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ
అధికారులు, సిబ్బందిలో అలసత్వం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపుపొందిన జీవీఎంసీని ముందుండి నడిపించాల్సిన కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. గత కమిషనర్ పి.సంపత్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసి రెండు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకూ కొత్తవారిని నియమించలేదు. మరోవైపు కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో మేయర్ కూడా నగర పాలక సంస్థ కార్యాలయానికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రశ్నించేవారు లేక జీవీఎంసీలో అలసత్వం పెరిగిపోయింది.
దాదాపు 681 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 22 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీకి గుర్తింపు ఉంది. స్మార్ట్ సిటీగా జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించింది. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డు దక్కించుకుంటోంది. అంతటి కీలకమైన జీవీఎంసీకి కమిషనర్‌ను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం నగరాభివృద్ధికి అవరోధంగా మారడంతోపాటు పారిశుధ్యం దిగజారేలా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాడితప్పిన పాలన
జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసిన పి.సంపత్‌కుమార్‌ను ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 21న అకస్మాత్తుగా బదిలీ చేసింది. అయితే ఆయన స్థానంలో ఎవరినీ నియమించకుండా, కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. కమిషనర్‌ను బదిలీ చేసిన వారం రోజుల్లోపే కొత్త కమిషనర్‌ను నియమిస్తారని భావించారు. దీంతో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినా కలెక్టర్ కూడా జీవీఎంసీపై శ్రద్ధ చూపలేదు. అయితే నెలలు గడుస్తున్నా కమిషనర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో జీవీఎంసీ బడె ్జట్ సమావేశం కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. చివరకు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా బడ్జెట్‌ను ఆమోదించకపోతే జీవీఎంసీ సాధారణ కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరించడంతో నాలుగు రోజుల క్రితం ఆదరాబాదరాగా బడ్జెట్ సమావేశం ఏర్పాటుచేశారు.
దృష్టి సారించని కలెక్టర్
కాగా కమిషనర్ పోస్టు రెండు నెలలకు పైగా ఖాళీగా ఉండిపోవడంతో నగరంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిలిచిపోయాయి. ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ తన విధుల్లో బిజీగా ఉండడంతో జీవీఎంసీ కార్యకలాపాలపై దృష్టిపెట్టేందుకు అవకాశం ఉండడం లేదు. మరోవైపు ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు నిలిచిపోవడంతో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. కమిషనర్ లేకపోవడంతో ప్రజారోగ్య విభాగంలోని అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మొక్కుబడిగా విధులకు హాజరై వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండడం దీనికి బలాన్ని చేకూర్చుతోంది.
కమిషనర్ లేకపోతే అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా యంత్రాంగాన్ని నడిపించాల్సిన మేయర్ గొలగాని వెంకటకుమారి కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ నేపథ్యంలో అసలేమీ పట్టించుకోవడం లేదు. తమ పార్టీ కార్పొరేటర్లను తీసుకుని బెంగళూరు వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశానికి తప్పనిసరి పరిస్థితిలో వచ్చినప్పటికీ రెండు రోజులకే తిరిగి బెంగళూరు వెళ్లారు. దీనివల్ల అధికారులను ప్రశ్నించేనాథుడే లేకుండాపోయారు. ప్రస్తుతం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైళ్లపై సంతకాలు చేసేవారుకానీ, విధానపరమైన నిర్ణయాలను తీసుకునేవారు కానీ లేకపోవడంతో అధికారుల్లో నిస్తేజం అలముకుంది.