బల్లుగూడలో ముగ్గురు చిన్నారుల మృతి
ABN , Publish Date - Mar 14 , 2025 | 10:33 PM
మండలంలోని అత్యంత మారుమూల బాబుసాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో పది రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

పది రోజుల వ్యవధిలో జ్వరంతో మృత్యువాత
భయాందోళన చెందుతున్న గ్రామస్థులు
నేడు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం : డాక్టర్ కిశోర్
ముంచంగిపుట్టు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అత్యంత మారుమూల బాబుసాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో పది రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. జ్వరం వచ్చిన ఒకటి, రెండు రోజుల వ్యవధిలో చిన్నారులు మృత్యువాత పట్టడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బల్లుగూడ గ్రామానికి చెందిన కిల్లో మణి (10 నెలలు), పాంగి హర్షన్ (11 నెలలు) వారం రోజుల వ్యవధిలో మృతి చెందారు. ఆ సంఘటన మరవకముందే గురువారం రాత్రి వంతాల సౌజన్య (11 నెలలు) మృతి చెందింది. చిన్నారులకు జ్వరం వచ్చిన రెండు రోజుల్లోనే చనిపోతున్నారని గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం ఆ గ్రామానికి చెందిన గణేశ్వరరావు, రాధమ్మ, లచ్చన్న, రాంబాబు, కౌసల్య మాట్లాడుతూ పది రోజుల వ్యవధిలో ముగ్గురు ఏడాదిలోపు చిన్నారులు మృతి చెందారని తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం మరో 15 మంది చిన్నారులుండగా.. వారిలో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై భయపడుతున్నామన్నారు. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని రూడకోట పీహెచ్‌సీ వైద్యాధికారి కిశోర్ దృష్టికి స్థానిక విలేకర్లు తీసుకువెళ్లగా. చిన్నారుల మృతి చెందిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు. శనివారం బల్లుగూడలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే చిన్నారుల మృతికి గల కారణాలను తెలుసుకోవడంతోపాటు ఆ పరిస్థితి ఇంకెవరికీ రాకుండా చూస్తామని చెప్పారు.