Share News

ఎవరా ఉన్నతాధికారి?

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:03 AM

పూర్ణామార్కెట్‌లో ప్రైవేటు వ్యక్తి ఆశీలు వసూలు చేసుకునేందుకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారంటూ జోన్‌-4 కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు ఇచ్చిన వివరణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరా ఉన్నతాధికారి?

  • పూర్ణామార్కెట్‌లో ప్రైవేటు వ్యక్తి ఆశీలు వసూలు చేసుకునేందుకు ఆదేశాలు ఎవరిచ్చారు!

  • ఆశీలును గెజిట్‌కి మించి వసూలు చేయడం లేదంటూ కాంట్రాక్టర్‌కు జోన్‌-4 కమిషనర్‌ వత్తాసు

  • జడ్సీ మల్లయ్యనాయుడు వివరణపై సర్వత్రా విమర్శలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

పూర్ణామార్కెట్‌లో ప్రైవేటు వ్యక్తి ఆశీలు వసూలు చేసుకునేందుకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారంటూ జోన్‌-4 కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు ఇచ్చిన వివరణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టరును వెనకేసుకొచ్చేందుకే ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెప్పి, ఆ అధికారి పేరు చెప్పకపోవడం వెనక కాంట్రాక్టర్‌ను వెనుకేసుకురావడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. పూర్ణామార్కెట్‌లో ఆశీలు వసూలుకు జీవీఎంసీ అధికారులు కొన్నాళ్ల కిందట వేలం నిర్వహించగా కూటమి చోటా నేత ఒకరు రూ.81 లక్షలకు పాడుకున్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆశీలు వసూలు చేసుకునేలా టెండరులో పేర్కొన్నప్పటికీ, సదరు వ్యక్తికి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందిన తర్వాత కమిషనర్‌ గెజిట్‌ విడుదల చేసి కాంట్రాక్టరుకు వర్క్‌ ఆర్డర్‌ జారీ చేస్తారు. అప్పటినుంచి మాత్రమే కాంట్రాక్టర్‌ ఆశీలు వసూలు చేసుకునేందుకు వీలుంటుంది. అయితే జీవీఎంసీలో మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసానికి కూటమి కార్పొరేటర్లు కలెక్టర్‌కు నోటీసులు జారీ చేయడంతో స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహణకు అవకాశం లేకుండాపోయింది. అందువల్ల అప్పటివరకు జీవీఎంసీ జోన్‌-4 రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలోనే ఆశీలు, పార్కింగ్‌ ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆశీలు వసూలు కాంట్రాక్టు దక్కించుకున్న కూటమి చోటా నేత తనకు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయని రుబాబు చేయడంతో పాటు జీవీఎంసీ అధికారులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఏప్రిల్‌ ఒకటి నుంచి నిబంధనలకు విరుద్ధంగా సొంత మనుషులతో ఆశీలు, పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడం ప్రారంభించారు. రోడ్డుపై జంగిడీలు పెట్టించి అధిక ఆశీలు వసూలు చేసుకుని జేబులు నింపుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమవ్వడంతో సీపీ శంఖబ్రత బాగ్చి స్వయంగా రంగంలోకి దిగి మార్కెట్‌ పరిసరాల్లో రోడ్ల ఆక్రమణలను పూర్తిగా తొలగించేశారు.

ఇదిలావుండగా పూర్ణామార్కెట్‌ ఆశీలు వసూలు దక్కించుకున్న కాంట్రాక్టరుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం లేదని చెబుతూనే ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలతో ఆశీలు, పార్కింగ్‌ ఫీజును కాంట్రాక్టర్‌ వసూలు చేసుకుంటారంటూ జోనల్‌ కమిషనర్‌ మల్లయ్యనాయుడు ఒక ప్రకటన జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే మౌఖిక ఆదేశాలిచ్చిన ఆ ఉన్నతాధికారి ఎవరనేది మాత్రం జడ్సీ చెప్పకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. పైగా రెవెన్యూ సిబ్బంది ద్వారా డిపార్టుమెంటల్‌ కలెక్షన్‌ చేయించాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తి వసూలు చేసుకుంటున్నారని చెప్పడం జడ్సీ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పార్కింగ్‌ ఫీజును కాంట్రాక్టర్‌ రెండింతలు అధికంగా వసూలు చేస్తున్నాడని, జీవీఎంసీ లోగో, కమిషనర్‌ పేరుతో టోకెన్లు ప్రింటింగ్‌ చేయించి, కారు పార్కింగ్‌కు రూ.పదికి బదులుగా రూ.20, బైక్‌ పార్కింగ్‌కు రూ.ఐదుకి బదులుగా రూ.పది వసూలు చేస్తున్నట్టు ఆధారాలతో సహా పత్రికల్లో కథనాలు వచ్చినా, జడ్సీ మాత్రం గెజిట్‌ ప్రకారమే పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారని, అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వాస్తవం కాదంటూ కాంట్రాక్టరుకు వత్తాసు పలకడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని జీవీఎంసీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:03 AM