Share News

fake cop పోలీసునంటూ బురిడీ

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:33 PM

Duped by a fake cop తాను పోలీస్‌నంటూ ఓ వ్యక్తి పలువురిని బురిడీ కొట్టించాడు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అని చెప్పి డబ్బులు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడకు చేరుకుని నకిలీ పోలీస్‌ను అరెస్ట్‌ చేశారు.

  fake cop పోలీసునంటూ బురిడీ
నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలు చెబుతున్న డీఎస్పీ రాంబాబు

  • ఎస్‌ఐ, ఏఎస్‌ఐగా వచ్చినట్లు పరిచయం

  • ఫోన్‌లో మాట్లాడుతూ డబ్బులు వసూలు

  • పోలీసులను ఆశ్రయించిన పోలీసులు

  • విజయవాడలో నిందితుడి అరెస్ట్‌

పాలకొండ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తాను పోలీస్‌నంటూ ఓ వ్యక్తి పలువురిని బురిడీ కొట్టించాడు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అని చెప్పి డబ్బులు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడకు చేరుకుని నకిలీ పోలీస్‌ను అరెస్ట్‌ చేశారు. సోమవారం పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా మున్నవారిపాలెం గ్రామానికి చెందిన మన్న వెంకట నవీన్‌ గూగుల్‌ మ్యాప్‌లో వర్తక, వ్యాపారుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు, అడ్రస్‌ తెలుసుకునేవాడు. ఆ తర్వాత వారికి ఫోన్‌ చేసి ఎస్‌ఐగా ఇటీవల విధుల్లో చేరానని, తన కుమారుడికి బాగోలేదని చెప్పేవాడు. అర్జెంట్‌గా డబ్బులు ఇవ్వాలని, ఫోన్‌పే అయినా చేయాలని చెప్పడంతో పలువురు నవీన్‌కు నగదు అందించారు. ఇదేవిధంగా గతనెల 31న వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యాపారికి ఫోన్‌ చేశాడు. తాను స్టేషన్‌కు కొత్తగా వచ్చిన ఏఎస్‌ఐని అంటూ పరిచయం చేసుకున్నాడు. వీరఘట్టం ఎస్‌ఐ కుమారుడికి ఆరోగ్యం బాగోలేదని, డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో ఆ వ్యాపారస్థుడు రూ.28 వేలు ఫోన్‌పే చేశాడు. ఆ తర్వాత సదరు వ్యాపారస్థుడు నిందితుడికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ అని వచ్చింది. వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తెలుసుకొనగా మోసపోయామని గ్రహించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. గతనెల 29న సంతకవిటి మండల పరిధిలో సిమెంట్‌ వ్యాపారికి కూడా నవీన్‌పై విధంగా ఫోన్‌ చేశాడు. అయితే ఆ వ్యాపారి వద్ద డబ్బులు లేకపోవడంతో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.70 వేలు చొప్పున నిందితుడికి ఫోన్‌ పో చేశారు. అయితే ఆ తర్వాత వారు కూడా మోస పోయినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. వీరఘట్టం ఎస్‌ఐ కళాధర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ వి.చంద్రశేఖర్‌, కానిస్టేబుల్‌ నవీన్‌ బృందంగా ఏర్పడి సాంకేతికత సాయంతో నిందితుడి లోకేషన్‌ తెలుసుకున్నారు. వెంటనే విజయవాడ వెళ్లి వెంకట నవీన్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.55 వేలు నగదును రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 07 , 2025 | 11:33 PM