స్నేహం చెడిందని..
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:50 AM
స్నేహం చెడిపోయిందని ఓ యువతిపై యువకుడు కత్తితో దాడిచేసిన ఘటన గరివిడి మండలం శివరాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

- యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
- తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
- శివరాంలో ఘటన
- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
గరివిడి/విజయనగరంక్రైం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): స్నేహం చెడిపోయిందని ఓ యువతిపై యువకుడు కత్తితో దాడిచేసిన ఘటన గరివిడి మండలం శివరాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోండ్రు అఖిల (18) అనే యువతి శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటిలో ఉన్న గిన్నెలు కడుగుదామని పెరట్లోకి వెళ్లింది. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న అదే గ్రామానికి చెందిన బూర్లె ఆదినారాయణ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అఖిల కడుపుపై రెండుచోట్ల పొడిచి పరారయ్యాడు. తనను ఎవరూ పోల్చకుండా ఆదినారాయణ ముఖానికి మంకీ క్యాపు ధరించాడు. తీవ్రంగా గాయపడిన అఖిల పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకొని వచ్చి ఆమెను 108 వాహనంలో చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో అఖిల అమ్మా, అమ్మా అంటూ రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. చీపురుపల్లిలో ప్రాథమిక వైద్యం అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ వకుల్ జిందాల్, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, గరివిడి ఎస్‌ఐ లోకేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల అదుపులో నిందితుడు?
అఖిల చీపురుపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదివి మధ్యలో ఆపేసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటోంది. తండ్రి తోటనాయుడు, తల్లి సత్యవమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బూర్లె ఆదినారాయణ, అఖిల స్నేహంగా ఉండేవారు. కొన్నిరోజుల కిందట వీరి స్నేహం చెడిపోయింది. దీంతో అఖిలపై ఆదినారాయణ కోపం పెంచుకున్నాడు. దీంతో శనివారం ఉదయం పెరట్లో అఖిల ఇంటిపనులు చేస్తున్నట్లు ఆదినారాయణ గమనించాడు. మంకీ క్యాపు ధరించి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో వారిమధ్య జరిగిన పెనుగులాటలో మంకీ క్యాపు ఊడిపోవడంతో ఆదినారాయణ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చినప్పటికీ కూడా తనకు ఏమీ తెలియనట్లుగా ఆదినారాయణ జనసందోహంలో కలిసిపోయాడు. పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నది గ్రహించాడు. అయితే, ఆస్పత్రిలో అఖిల చెప్పిన వివరాల మేరకు ఆదినారాయణతో పాటు మరో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలో నిందితులను అరెస్టు చేసి వారికి శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ, డీఎస్పీ తదితరులు