Government Colleges ప్రభుత్వ కళాశాలలు .. ఫస్ట్
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:53 AM
Government Colleges First ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. మంచి మార్కులతో అదరగొట్టారు.

ఉత్తమ మార్కులతో సత్తాచాటిన విద్యార్థులు
పార్వతీపురం/బెలగాం,ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. మంచి మార్కులతో అదరగొట్టారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 1937 మంది పరీక్షలు రాయగా 1,349 మంది (70 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సం వత్సరం 1605 మంది పరీక్షలకు హాజరవగా.. 1294 మంది (81 శాతం) పాసయ్యారు. మొత్తంగా జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయి.
- ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను కలిపి చూసుకుంటే ఇంటర్ మొదటి సంవత్సరం 5,867 పరీక్షలు రాయగా 4,519 మందికి ఉత్తీర్ణులయ్యారు. 77 శాతంతో రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం 5,335 మంది పరీక్షలు రాయగా 4,609 మంది ఉత్తీర్ణత సాధించి 86శాతంతో జిల్లా ఏడో స్థానాన్ని దక్కించుకుంది.
- జనరల్, ఒకేషనల్ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి మొత్తం 8,315 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 6,582 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 8,318 మంది విద్యార్థులకు గాను 7,065 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం 79 శాతం, ద్వితీయ సంవత్సరం 84 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కళాశాలలు, స్కూళ్ల వారీగా..
- మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,937 మంది విద్యార్థులు గాను 1,349 మంది, హైస్కూల్ ప్లస్‌లో 70 విద్యార్థులు గాను 54 మంది, కేజీబీవీల్లో 295 మందికి 276 మంది, మోడల్ స్కూళ్లలో 345 మందికి 284 మంది, సోషల్ వెల్ఫేర్ కళాశాలలో 286 మందికి 264 మంది, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో 947 మందికి 920 మంది, ప్రైవేట్ కళాశాలల్లో 1987 మందికి 1372 మంది ఉత్తీర్ణత సాధించారు.
- ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ప్రభుత్వ కళాశాలలో 1605 మంది విద్యార్థుల గాను 1294 మంది, కేజీబీవీల్లో 244 మందికి 237 మంది, మోడల్ స్కూళ్లలో 227 మందికి 209 మంది, సోషల్ వెల్ఫేర్ కళాశాలలో 220 మందికి 212 మంది, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో 941 మందికి 930 మంది, ప్రైవేట్ కళాశాలల్లో 2,098 మందికి 1727 మంది ఉత్తీర్ణత సాధించారు.
డీఐఈవోకు కలెక్టర్ అభినందనలు
జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇంటర్ ఫలితాలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో డీఐఈవో (జిల్లా ఇంటర్ అధికారి) మంజుల వీణను సత్కరించారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. అధ్యాపకులు, సిబ్బంది కృషి కారణంగానే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని డీఐఈవో మంజుల వీణ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో వచ్చే విద్యాసంవత్సరంలోనూ మరింత కష్టపడి మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆమె వెల్లడించారు.
ఆనందంగా ఉంది...
ఇంటర్‌లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాఽధించడం ఆనందంగా ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో కంటే మెరుగైన పలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులు, గురుకుల ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలను కొనసాగిస్తూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
బెలగాం: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా ఇంటర్ అధికారి మంజుల వీణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం వారికి ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. మే 28 నుంచి జూన్ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ప్రథమ సంవత్సరం వారికి ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు.