వేగం మిగిల్చిన విషాదం..!
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:29 AM
ఆమె ది ఆంధ్రప్రదేశ్.. ఆయనది తమిళనాడు.. వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

-భార్య అక్కడికక్కడే మృతి.. భర్తకు తీవ్రగాయాలు
-భార్యభర్తలిద్దరూ ఇషా ఫౌండేషన్ వలంటీర్లు
- హైవేపై ఫ్లైఓవర్ రెయిలింగ్‌ని బలంగా ఢీకొని బోల్తా
కోయంబత్తూర్ నుంచి సిక్కిం వెళ్తుండగా ప్రమాదం
-విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఘటన
-మృతురాలిది తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు
రాజమహేంద్రవరం, పూసపాటిరేగ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఆమె ది ఆంధ్రప్రదేశ్.. ఆయనది తమిళనాడు.. వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కోయంబత్తూరులో స్థిరపడ్డారు. బైక్‌పై దేశ మంతా తిరగడం వారి హాబీ..! ఉద్యోగాలు చేసుకుంటూనే వీలు దొరికి నప్పుడల్లా బైక్‌పై లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బైక్‌పై కోయంబత్తూరు నుంచి సిక్కిం వెళ్లేందుకు బయల్దేరారు. కానీ.. ఓవర్ స్పీడ్ వారి జీవితాల్లో తీరని విషాదం నింపింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం జాతీయరహదారిపై శుక్ర వారం ఉదయం వారు ప్రయాణిస్తున్న బైక్ అతివేగం కారణంగా అదు పుతప్పి ఫ్లైఓవర్ రెయిలింగ్‌ని బలంగా ఢీకొని బోల్తాకొట్టింది. ఈ ప్రమా దంలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యా యి. మృతురాలు నంబూరి నాగసత్యవతి (33) స్వస్థలం తూర్పుగోదా వరి జిల్లా దివాన్ చెరువు. దంపతులిద్దరూ ఇషా వలంటీర్లు.
జర్మనీలో కలిసిన మనసులు..
రాజమహేంద్రవరం రూరల్ దివాన్‌చెరువుకు చెందిన హరినాథ బాబుకు ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. కుమార్తె నంబూరి నాగసత్యవతి జర్మనీలో ఎంఎస్ పూర్తి చేశారు. తమిళనాడుకు చెందిన భార్గవ్ రాజన్‌తో కూడా ఆమెతోపాటు అక్కడే చదువుకున్నారు. అక్కడ వారిద్దరి మనసులు కలవడంతో పెద్దల అంగీకారంతో 2017లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఉద్యోగాల నిమిత్తం జర్మనీ వెళ్లిపోయారు. కొన్నాళ్లకు కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ గురించి తెలుసుకుని.. దైవ మార్గంలో నడవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో కోయంబత్తూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని 2018 నుంచీ ఇషాలోనే ఉంటున్నారు. భార్యభర్తలిద్దరికీ దూర ప్రాంతాలకు ప్రయా ణించడమంటే ఇష్టం కావడంతో ఏడాదికి ఓసారి లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తుంటారు. రెండేళ్ల క్రితం డెహ్రాడూన్ ట్రెక్కింగ్‌కి వెళ్లారు. ఈ ఏడాది సిక్కిం చుట్టి రావాలని అనుకున్నారు. కొయంబత్తూరు నుంచి రెండు రోజుల క్రితం దివాన్‌చెరువు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై సిక్కిం బయలుదేరారు. ఉదయం 10.30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ విజయనగరం జిల్లా చోడమ్మ అగ్రహారం సమీపంలో ఫ్లైఓవర్ రెయిలింగ్‌ను వేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి బైక్ రహదారి డివైడర్‌కు తగిలి అవతలివైపు పడింది. ఈ ప్రమాదంలో నాగసత్యవతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలగా.. భార్గవ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆయన ఎడమ చేయి తొలగించినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.