Share News

The worry never ends! ‘చింత’ తీరట్లే..!

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:38 PM

The worry never ends! ఏటా గిరిజనులకు ఆదాయాన్ని చేకూర్చే పంటల్లో చింతపండు ఒకటి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు.

The worry never ends! ‘చింత’ తీరట్లే..!
కుసిమి వారపుసంతకు బుట్టలతో గిరిజనులు తీసుకొచ్చిన చింతపండు

మార్కెట్‌ కంటే తక్కువగానే జీసీసీ ధర

దళారుల దోపిడీ

ఆవేదనలో గిరిజన రైతులు

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఏటా గిరిజనులకు ఆదాయాన్ని చేకూర్చే పంటల్లో చింతపండు ఒకటి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఎంతో శ్రమించి చింతపండును వారపు సంతల్లోకి తెచ్చి.. విక్రయిస్తుంటే గిట్టుబాటు కావడం లేదని గిరిజన రైతులు వాపోతున్నారు. వాస్తవంగా ఈ ఏడాది పంట తక్కువగా ఉన్నప్పటికీ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అయితే దానికి తగ్గట్టుగా మార్కెట్‌లో ధర మాత్రం లేదని గిరిజనులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

సీతంపేట ఐటీడీఏ పరిధిలో కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, భామిని మండలాల్లో ఈ చింతపండు పంట ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులు సేకరించే చింతపండు నాణ్యతగా ఉండడంతో మైదాన ప్రాంత వ్యాపారులు పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో ఇక్కడి పంటకు ఏటా డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా దిగుబడి రాకపోవడం, ఉన్న పంటకు ఆశించిన స్థాయిలో ధర పలకకపోవడంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట వారపుసంతలో సీజన్‌ ప్రారంభం లో 10కేజీల చింతపండు ట్రే ధర రూ.400 పలికింది. రానురాను చింతపండులో నాణ్యత పెరగడంతో ప్రస్తుతం ఆ ధర కాస్త రూ.500 వరకు పలుకుతోంది. అయినప్పటికీ గిరిజనులకు గిట్టుబాటు కావడం లేదు. ట్రే ధరను రూ.600గా నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు.

తగ్గిన దిగుబడి..

మన్యంలో ఏటా పొల్ల, టిటుకుపాయి, మానాపురం, చింతాడ, మర్రిపాడు, పూతికవలస, చినబగ్గ, దోనుబాయి వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా చింతపండు వారపు సంతలకు వస్తోంది. గతంలో ఒక్క సీతంపేట మండలంలో 70టన్నుల వరకు దిగుమతి అయ్యేది. ఆ తర్వాత కాలంలో గిరిజనులు పోడు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో చింత చెట్ల సంఖ్య తగ్గింది. మరోవైపు హుద్‌హుద్‌, తితలీ తుపాన్ల సమయంలో చాలా వరకు చెట్లు నేలకూలాయి. వాటి స్థానంలో గిరిజన రైతులు, అటవీశాఖ అధికారులు ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటక పోవడంతో చింతపండు పంట తక్కువగా దిగుమతి అవుతోంది. ఈ ఏడాది ఇంత వరకు సుమారు 30టన్నుల పంట మాత్రమే దిగుబడి వచ్చింది.

చేతులెత్తేసిన జీసీసీ

వారపుసంతలకు గిరిజనులు తీసుకొచ్చే చింతపండును మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో జీసీసీ విఫలమవుతోంది. గతంలో కేజీ చింతపండును రూ.32.40లకు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో మార్కెట్‌ ధర రూ.36గా ప్రకటించింది. సీతంపేట, పాత పట్నం డివిజన్‌ పరిధిలో 55టన్నులను కొనుగోలు చేసింది. అయితే జీసీసీకి ఈ ఏడాది 110టన్నుల చింతపండు కొనుగోలు లక్ష్యంగా ఉంది. కానీ సీతంపేట, కుసిమి, మర్రిపాడు, దోనుబాయి, పొల్ల వారపుసంతలకు గిరిజన రైతులు తెచ్చే చింతపండు ధర కేజీకి రూ.50 పలుకుతోది. డ్రై క్వాలిటీ చింతపండును అంత ధరకు జీసీసీ కొనుగోలు చేయలేక ముఖం చాటేస్తోంది. దీంతో దళారులే గిరిజన రైతుల నుంచి అతితక్కువ ధరకు చింతపండును కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

విక్రయానికి ఇబ్బందులు

చింతపండుకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేదు. మార్కెట్‌లో అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆశించిన ధర కోసం వారపు సంతల్లో వేచి ఉండాల్సిన వస్తోంది. ఎంత నాణ్యమైన చింతపండు(కంకణాలు)అయినా కేజీ రూ.50కి మించి ధర రావడం లేదు.

- సవర నాగేశ్వరరావు, బొంగుడుగూడ

==================================

ఏటా ఇదే పరిస్థితి..

ఏటా చింతపండు సీజన్‌లో జీసీసీ ఈవిధంగానే వ్యవహరిస్తోంది. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. దీంతో దళారులను నమ్మి గిరిజనులు మోసపోతున్నారు. వారపుసంతల్లో మైదాన ప్రాంత వ్యాపారులు నాణ్యమైన చింతపండును కేజీ రూ.45 నుంచి రూ.50కు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.60కి పైగా విక్రయిస్తున్నారు.

- పత్తిక కుమార్‌, గిరిజన సంఘం నాయకుడు, పూతికవలస

==================================

ఎక్కువకు కొనుగోలు చేయలేం

ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్‌పీ(మినిమమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌)రూ.36కి మించి చింతపండును కొనుగోలు చేసే అధికారం మాకు లేదు. సీతంపేట డివిజన్‌ పరిధిలో ఇప్పటికే 55టన్నులను కొనుగోలు చేశాం.

- డి.కృష్ణారావు, జీసీసీ మేనేజర్‌, సీతంపేట

Updated Date - Apr 13 , 2025 | 11:38 PM