Share News

NTR Medical Service: ఉడకని అన్నం.. పాచిపోయిన కూర

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:33 AM

NTR Medical Service: ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకంలో భాగంగా రోగులకు అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

NTR Medical Service: ఉడకని అన్నం.. పాచిపోయిన కూర
గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో ఉప్మాను చెత్తబుట్టలో వేసిన దృశ్యం

- నచ్చితే తిను.. లేదంటే మానేయ్‌

- రోగులకు అందని నాణ్యమైన ఆహారం

- బయట హోటళ్లలో కొనుగోలు చేస్తున్న వైనం

- ఇదీ జిల్లాలోని ఆస్పత్రుల్లో అందిస్తున్న భోజనాల పరిస్థితి

విజయనగరం/మెంటాడ/శృంగవరపుకోట రూరల్‌/బొబ్బిలి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకంలో భాగంగా రోగులకు అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మాకు నచ్చింది పెడతాం. నచ్చితే తిను..లేదంటే నోరుమూసుకొని ఉండు’ అన్నట్టుగా జిల్లాలో పరిస్థితి ఉంది. ఆకలిని తాళలేక, బయట హోటళ్లలో కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక, గత్యంతరంలేని స్థితిలో చాలామంది రోగులు తింటున్నారు. కచ్చితంగా మెనూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా చాలా ఆస్పత్రుల్లో అమలు కావడం లేదు. జిల్లాలోని పలు ఆస్పత్రులను శనివారం, ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో..

రోగులకు ఆదివారం ఉడికీ ఉడకని అన్నం పెట్టారు. పాచిపోయిన కూర (మితంగా), మంచినీళ్లను తలపించే సాంబారు, చిన్నపాటి గుడ్లు వడ్డించారు. నీళ్లలాంటి పాలు, నాసిరకం రొట్టెముక్కలు అందించారు. వడ్డించిన వారుకూడా రోగుల సహాయకులతో అమర్యాదకరంగా ప్రవర్తించడం కనిపించింది. చాలామంది ఆకలిని తట్టుకోలేక, చేతిలో డబ్బులు లేక తప్పనిసరి పరిస్థితుల్లో నాసిరకం భోజనం చేశారు. కొందరు తినలేక మధ్యలోనే పారబోశారు.


బొబ్బిలి సీహెచ్‌సీలో..

బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో మెనూకు సంబంధించిన బోర్డు ఏదీ కనిపించలేదు. ప్రత్యేకమైన రూము లాంటిది కూడా లేదు. ఆసుపత్రి వార్డుల ఎంట్రన్స్‌లో చెట్టుకింద నిలబడి భోజనాలను వడ్డిస్తున్నారు. నిర్ణీత సమయానికి మునుపే రోగులకు భోజనాలను వడ్డించారు. రోగులు తమకు కేటాయించిన మంచాలపైనే భోజనాలు చేశారు. అన్నం, రసం, క్యాబేజీ కూర, అరటిపండు, గుడ్లు పంపిణీ చేశారు. శనివారం గుడ్లు ఇవ్వడంతో చాలామంది తీసుకోలేదు.

ఎస్‌.కోట ఆస్పత్రిలో..

ఎస్‌.కోట సామాజిక ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనాన్ని సమయానికి రోగులకు అందించడం లేదు. శనివారం మధ్యాహ్నం 12గంటలకు పెట్టాల్సిన భోజనం ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్న వారికి ఒంటి గంటకు, సాధారణ వార్డుల్లో ఉన్న వారికి 1.30 గంటకు అందించారు. అరటిపండ్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. శనగ ఉండ గోలికాయలా ఉంది. ఇదేనా వీరికి ఇచ్చేది అని భోజనం వడ్డించిన వారిని అడిగితే కాంట్రాక్టర్లు ఏవి పంపితే అవే వడ్డిస్తామని సమాధానం ఇచ్చారు. ఆసుపత్రి వర్గాలు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా వారి జాడ అసలు లేదు. మెనూ ప్రకారం రోజూ ఇడ్లీ పెట్టాల్సి ఉండగా గత వారంరోజులుగా ఉదయం సేమియా ఉప్మా, గోధుమనూక ఉప్మా పెడుతున్నారని రోగులు తెలిపారు. ఆరోగ్యశ్రీ రోగులకు మజ్జిగ ఇస్తున్నారు. జనరల్‌ వార్డుల్లో ఉన్నవారికి ఇవ్వడం లేదు.

5kota2rr.gif

ఎస్‌.కోట ఆసుపత్రిలో రోగులకు అందించిన గోలి కాయంత శనగ పప్పుండ, చిన్న అరటిపండు


భోజనం రుచిగా లేదు

నాలుగు రోజుల నుంచి గజపతిగరం ఏరియా ఆస్పత్రిలో ఉన్నాం. రుచీపచీ లేని భోజనం పెడుతున్నారు. నోట్లో పెట్టలేకపోతున్నాం. గత్యంతరం లేక బయట హోటళ్ల నుంచి తెచ్చుకొని తింటున్నాం.రోజుకి సుమారు రూ.300 ఖర్చు అవుతోంది.

-తవటాన రామలక్ష్మి, రోగి సహాయకురాలు, దత్తి గ్రామం, దత్తిరాజేరు మండలం.

దారుణంగా ఉంది

నాలుగు రోజులుగా గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో ఉంటున్నాను. ఇక్కడ పెడుతున్న భోజనం, టిఫిన్‌ చాలా దారుణంగా ఉంది. చెత్తబుట్టలో వేసేస్తున్నాను. ఉడికీ ఉడకని అన్నం, నీళ్లలాంటి సాంబారు అందిస్తున్నారు. గుడ్డు ఇవ్వడంలేదు. టీ గ్లాస్‌తో నీళ్ల లాంటి పాలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు హోటల్‌ నుంచి తెచ్చుకొంటున్నాం. రోజుకి రూ.300 వరకు ఖర్చు అవుతోంది.

-అమ్మన్న, రొంపిల్లి(గ్రామం), అనంతగిరి మండలం, అల్లూరి జిల్లా

Updated Date - Apr 07 , 2025 | 12:33 AM