రోడ్డెక్కిన రొయ్య రైతులు
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:41 PM
అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి రొయ్య రైతులను కాపాడాలని రొయ్య రైతుల సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి రుద్రరాజు యువరాజు డిమాండ్ చేశారు.

గణపవరం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి రొయ్య రైతులను కాపాడాలని రొయ్య రైతుల సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి రుద్రరాజు యువరాజు డిమాండ్ చేశారు. గణపవరం, నిడమర్రు, ఉండి మండలాల ఆక్వా రైతులు ఆదివా రం గణపవరంలో ఆందోళన చేపట్టారు. అమెరికా సుంకాల సాకుతో వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని యువరాజు ఆరోపించారు. మూడు రోజులుగా రొయ్యల వ్యాపారులు సిండికేట్‌ను నియంత్రించాలని, దిగుబడి సమయం లో ధర దోపిడీ నుంచి రైతులను కాపాడాలని రొయ్యల రైతులు డిమాండ్ ఛేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సాగు ప్రశ్నార్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 9న ఉండిలో జరిగే సమావేశంలో ఆక్వా రైతులంతా పాల్గొనాలని కోరారు. గణపవరం సెంటర్‌లో ధర్నా, మానవహారంగా ఏర్పడి సమస్యలు పరిష్కరించాలని ఆక్వా రైతులు నినాదాలు చేశారు. ఎస్సై మణికుమార్, పోలీసుల బందోబస్తు నడుమ నిరసన కార్యక్రమం కొనసాగింది. ఆక్వా రైతులు అడబాల పాండురంగ, కాకర్ల వినాయక్, సమయం వీరరాఘవులు, కూనసాని నాగేశ్వరరావు, సత్తినీడి నాని, కొనిశెట్టి రమేశ్, గొళ్లేపల్లి మాధవ్, చేగొండి మధు, తన్నీడి విజయ్‌కుమార్, బొబ్బిలి బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.