నరక దారి
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:29 AM
అధ్వాన రహదారి ఏదంటే కచ్చితంగా తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిని చూపించవచ్చు.

తాడేపల్లిగూడెం ప్రధాన రహదారి అధ్వానం
అడుగడుగునా గోతులు
ప్రత్తిపాడు జంక్షన్ నుంచి బాదంపూడి జంక్షన్ వరకు ప్రమాదాలే..!
గత ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యం
ప్రస్తుతం కొంత మేర మరమ్మతులు
గత ఏడాది రాజమండ్రికి చెందిన భార్యాభర్తలు పిల్లలతో తాడేపల్లిగూడెం బైక్‌పై వస్తున్నారు. ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి నుంచి తాడేపల్లిగూడెం పట్టణంలోకి వెళ్లే రహదారిపైకి రాగానే పెద్ద గోతిలో మోటర్‌సైకిల్ పడిపోయింది. వెనుక కూర్చున్న భార్య రోడ్డుపై పడిపోవడంతో వెనుక వస్తున్న బస్సు ఆమె తలపై నుంచి వెళ్లిపోయింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
తాడేపల్లిగూడెం పట్టణం నుంచి బైక్‌పై ప్రత్తిపాడు వైపు వెళుతున్న వ్యక్తి గోతుల్లో అదుపుతప్పి పడిపోయాడు. పక్కనే డివైడర్‌కు అతడి తల బలంగా తాకింది. తీవ్ర గాయమైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పెంటపాడు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అధ్వాన రహదారి ఏదంటే కచ్చితంగా తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిని చూపించవచ్చు. జాతీయ రహదారిపై ప్రత్తిపాడు జంక్షన్ నుంచి తాడేపల్లిగూడెం పట్టణ ప్రధాన రహదారి బాదం పూడి జంక్షన్ వరకు పట్టుమని పది కిలో మీటర్లు ఉండదు. ప్రయాణం మాత్రం అడుగడుగునా ప్రమాదమే. ద్విచక్ర వాహనదారులు ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఏదొక గోతిలో పడి గాయపడాల్సిందే. పట్టణానికి ఇదే ప్రధాన రహదారి. అయిన ప్పటికి రాకపోకలకు వాహనదారులు వణికి పోతున్నారు. ఈ రహదారిపై అనేక ప్రమాదాల్లో గాయపడిన వారు ఎందరో.. కొందరు మృత్యువాత పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ రహదారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా రహదారి అస్తవ్యస్తంగా మారింది. కూటమి ప్రభుత్వం రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేసినా వాహనదారులకు ఇబ్బం దులు తప్పడం లేదు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్గంలో నిత్యం ప్రయాణం తప్పని వారు వెన్నుముక, మెడ నొప్పితో బెల్టు వేయించుకుని తిరుగుతున్నారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారి సమస్యను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించారు. ఎప్పటికి మోక్షం కలుగుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.