11న సీఎం ఆగిరిపల్లి పర్యటన
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:44 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బలహీనవర్గాలకు, వృత్తిదారులకు పనిముట్లు, రుణాలు పంపిణీ చేయనున్నట్లు గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం
బీసీలకు పనిముట్లు, రుణాల పంపిణీ
ఏర్పాట్లపై కలెక్టర్, అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్ష
ఆగిరిపల్లి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బలహీనవర్గాలకు, వృత్తిదారులకు పనిముట్లు, రుణాలు పంపిణీ చేయనున్నట్లు గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ నెల 11న ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ కె.వెట్రి సెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలసి మంత్రి పరిశీలించి, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్రస్థాయి ఉత్సవంగా ఆగిరిపల్లిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై బలహీన వర్గాల జీవనోపాధికి అవసరమైన పనిముట్లు, రుణాలను పంపిణీ చేస్తారు. వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటా రని మంత్రి చెప్పారు. ఆగిరిపల్లి శివారు వడ్లమానులో హెలిప్యాడ్, బహిరంగ సభకు అధికారులు ప్రతిపాదించిన ప్రదేశాలను పరిశీలించారు. వేసవి దృష్ట్యా బహిరంగ సభలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, టెంట్లు, కుర్చీలు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి.స్మరణ్‌రాజ్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, ఆరేపల్లి శ్రీనివాసరావు, ఎ.సతీష్, చిట్నేని శివ రామకృష్ణ మడుపల్లి గోపాలకృష్ణ, నక్కనబోయిన వేణు, నాయకులు, ప్రజాప్రతిధులు, తదితరులు పాల్గొన్నారు.