అదనపు భారం
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:51 AM
గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి సాధ్యమైనంత మేర అదనపులోడు చార్జీలు రాబట్టేందుకు ఈపీడీసీఎల్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అదనపు విద్యుత్ చార్జీల వసూళ్లకు వీలుగా రాయితీలు ప్రకటించింది.

విద్యుత్ అదనపులోడు క్రమబద్ధీకరించుకోవాలి
అదనపు లోడుకు చార్జీల వసూలు
గృహ వినియోగదారులకు షాక్
క్రమబద్ధీకరణ చార్జీల్లో రాయితీ
వినియోగం నియంత్రణ చర్యలు
దరఖాస్తులు కోరినా స్పందన కరువే
వినియోగదారుల్లో ఆగ్రహం
గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి సాధ్యమైనంత మేర అదనపులోడు చార్జీలు రాబట్టేందుకు ఈపీడీసీఎల్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అదనపు విద్యుత్ చార్జీల వసూళ్లకు వీలుగా రాయితీలు ప్రకటించింది. నిర్దిష్ట గడువు తేదీ లేకుండా వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. చాన్నాళ్ల క్రితమే అదనపు లోడుకు అనుగుణంగా చార్జీలు వసూలు చేయాలని భావించినా అప్పట్లో అది సాధ్యం కాలేదు. తిరిగి మరోసారి వసూళ్లకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
మీ ఇంటి అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రకారమే విద్యుత్ వినియోగించుకుంటున్నారా..? లేదా అదనపు వినియో గానికి పాల్పడుతున్నారా.. అదనమైతే తక్షణం ఈపీడీసీఎల్‌కు రాయితీ మేరకు చార్జీలు కట్టి తీరాల్సిందే. ఆ మేరకు తక్షణమే స్పందించని వినియోగదారులందరూ విద్యుత్ సంస్థ వంద శాతం వేసే అదనపు లోడు చార్జీలను భరించాలి. వాస్తవానికి గృహ అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న ప్రకారమే విద్యుత్ వినియోగించుకోవాలి. ఈ మేరకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఎక్కడిక్కడ లోడు బేరీజు వేసుకుని సరఫరాకు సిద్ధమవుతూ వస్తోంది. కానీ దరఖాస్తులో చూపిన లోడు కంటె అదనంగా విద్యుత్ వినియోగం అవుతోంది. కేవలం రెండు గదులున్న ఇంటికి అవసరమైన సామర్థ్యం మేరకు విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు వినియోగదారులందరూ అంగీకార పత్రం సమర్పించారు. తర్వాత దరఖాస్తుదారు అదనంగా విద్యుత్ వినియోగిస్తున్నారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్, హీటర్‌తో సహా తదితర విద్యుత్ ఉపకరణాలను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్, సప్లయ్ మధ్య అంతరం పెరిగి అనేకమార్లు సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి వేసవి సీజన్‌లో విద్యుత్ వినియోగం రెట్టింపవుతోంది. ఈ పరిస్థితులను ఎదుర్కొవడానికి ఈపీడీసీఎల్ నానా తంటాలు పడుతోంది. ప్రత్యేకించి విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళికలు వేసుకుని ఏటా కసరత్తు చేయాల్సి వస్తోంది. వ్యవసాయ అవసరాలకు రెండు గంటలపాటే విద్యుత్ సరఫరా చేసి గృహ, వాణిజ్య అవసరాలకు అత్యధిక విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తోంది. విద్యుత్ వాడకాన్ని శృతిమించి వినియోగిస్తున్న వారి నుంచి కొంతమేర చార్జీలు వసూలు చేయాలని తలపెట్టారు. చాన్నాళ్లక్రితమే ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ వెను వెంటనే అమలులోకి తెచ్చినా వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. వ్యతిరేకత ఎదురవుతుందేమోనన్న ధోరణిలో కొంత కాలం పాటు ఈ తరహా ప్రస్తావన లేకుండానే జాగ్రత్తపడుతూ వచ్చారు.
ఇప్పుడేం జరుగుతుందంటే..
అదనపు విద్యుత్ లోడు వినియోగిస్తున్న వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా వినియోగదారులను అప్రమత్తం చేశారు. ఎవరైతే అదనపు లోడు వినియోగించుకుంటున్నారో వారికి చెల్లింపుల్లో రాయితీలు ప్రకటించారు. ముందుగా దరఖాస్తు చేసుకునేందుకు రూ.50, డిపాజిట్ ఫీజు రూ.200, డవలప్‌మెంట్ చార్జీలు రూ.200 మొత్తం రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతం రాయితీ ప్రకారం డవలప్‌మెంట్ చార్జీల కింద అదనపు లోడు కావాలనుకుంటే ఒక కిలోవాట్‌కు రూ.1,250, రెండు కిలోవాట్‌లకు రూ.2,450, మూడో కిలోవాట్‌లకు రూ.3,650 ఈపీడీసీఎల్ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు లేదా ఐదు కిలోవాట్‌ల వినియోగానికి వీలుగా 2,500 దరఖాస్తులు మాత్రమే పంపిణీ సంస్థకు అందాయి. వాస్తవానికి గృహావసర వినియోగదారుల్లో అత్యధికులు అదనపు లోడు పరిధిలోకి వచ్చేవారే. సాధారణంగా గృహావసరాలకు ఒకటి నుంచి మూడు కిలోవాట్స్ లోపే దరఖాస్తులో విద్యుత్ లోడు చూపడంతో అప్పట్లో కొంతలో కొంత చార్జీలు వసూలు చేశారు. కాని ఆ పరిస్థితి మారి గృహ వినియోగంలో ప్రతీ ఇంటికి నాలుగు నుంచి ఐదు కిలోవాట్‌ల మధ్య వాడకం ఉంటోంది.
అదనపు వాత తప్పదా..?
అదనపు లోడు వినియోగించుకుంటున్న వారంతా ఆ మేరకే చార్జీలు చెల్లించాలని పంపిణీ సంస్థ పట్టుపడుతుండడంతో ఈ మేరకు సిబ్బంది వినియోగదారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. కాని ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచేసి అదనపు భారం మోపి ఇప్పుడు అదనపు లోడు పేరిట చార్జీలు చెల్లించాలనడంపై కొందరు ఆక్షేపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.6 లక్షలకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అదనపులోడు నిమిత్తం చార్జీలు చెల్లించడానికి వచ్చిన దరఖాస్తులు మాత్రం అత్యల్పం. కేవలం పది శాతం కూడా దరఖాస్తులు రాలేదు. దీనిని గమనించి ప్రస్తుతం రాయితీ అమలులో ఉందని, దీనిని పట్టించుకోకుండా జాప్యం చేస్తే భవిష్యత్‌లో నూరు శాతం మేర అదనపు లోడు చార్జీలు వసూలు చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.