Share News

రీసర్వే చిక్కులు!

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:36 PM

గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వల్ల ఆక్వా రంగానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రీసర్వే తో గ్రామాల్లో చేపల, రొయ్యల చెరువులకు, పంటపొలాలకు కొత్తగా ఎల్‌పీ నెంబర్లు ఇచ్చా రు. అయితే ఆక్వా జోన్‌లో ఉన్న లక్షలాది ఎక రాలు ఎల్‌పీ నెంబర్లతో నాన్‌ ఆక్వాజోన్‌లో ఉన్నట్టు ఆన్‌లైన్‌లో చూపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రీసర్వే చిక్కులు!

ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌ల సమస్య

ఆక్వాజోన్‌లోని చెరువులు నాన్‌ ఆక్వా జోన్‌లోకి..

రెండు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలు నాన్‌ ఆక్వాలోకి..

రీసర్వేతో రైతులకు ఇబ్బందులు

రేపు కైకలూరులో ఆక్వా రైతు సదస్సు

మత్స్యశాఖ అనుమతులు నిలుపుదల

ప్రభుత్వ పథకాలు వర్తించవని రైతులు గగ్గోలు

కైకలూరు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వల్ల ఆక్వా రంగానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రీసర్వే తో గ్రామాల్లో చేపల, రొయ్యల చెరువులకు, పంటపొలాలకు కొత్తగా ఎల్‌పీ నెంబర్లు ఇచ్చా రు. అయితే ఆక్వా జోన్‌లో ఉన్న లక్షలాది ఎక రాలు ఎల్‌పీ నెంబర్లతో నాన్‌ ఆక్వాజోన్‌లో ఉన్నట్టు ఆన్‌లైన్‌లో చూపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాన్‌ ఆక్వా జోన్‌లో చేరడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ రుణాలు, విద్యుత్‌ రాయితీలు, ఇన్సు రెన్సులు వర్తించని పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది ఆక్వా రైతులు తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్‌ రాయితీలు వర్తిస్తాయని ఆశతో మత్స్యశాఖ అనుమతుల కోసం పోర్టల్‌ లో దరఖాస్తు పెట్టుకోగా ఎల్‌పీ నంబర్‌ సమ స్య వెలుగులోకి వచ్చింది. గత నెల మొదటి వారం నుంచి ఈ సమస్య తెరపైకి రాగా మత్స్యశాఖ అధికారులు అనుమతులను తాత్కా లికంగా నిలిపివేశారు. మార్చికి ముందు ఆక్వా జోన్‌లో ఉన్నట్టు అనుమతులు పొందినప్పటికీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎల్‌పీ నంబర్‌ మార్పుతో నాన్‌ ఆక్వాజోన్‌లో చేపల, రొయ్యల చెరువులు ఉన్నట్టు చూపిస్తోంది.

ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 2.5 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు జరుగుతోంది. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఈ ఎల్‌పీ నంబర్‌ సమస్య ఉత్పన్నం కావడంతో సుమారు 2 లక్షల ఎకరాలు నాన్‌ ఆక్వాజోన్‌లో చూపిస్తున్నట్టు మత్స్యశాఖ అధికా ులు పేర్కొంటున్నారు. కైకలూరు నియోజక వర్గంలో 85 వేల ఎకరాలు ఆక్వా చెరువులు ఉండగా వాటిలో కైకలూరు మండలంలో 10, 560 ఎకరాలు, కలిదిండి 16 వేలు, మండవల్లి 12 వేలు, ముదినేపల్లి మండలంలో 10,800 ఎక రాలు నాన్‌ ఆక్వాజోన్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. దీనిని స్థానికంగా రైతులు మార్పు చేసుకోవాలంటే మండల, జిల్లాస్థాయి కమిటీల నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రస్తుతం డీఎల్సీ జరిగే పరిస్థితి లేనందున గతంలో ఆక్వా జోన్‌గా గుర్తించిన చెరువులను మరలా పునఃరుద్ధరించి రైతులకు ప్రభుత్వ పఽథకాలను వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

8న కైకలూరులో ఆక్వారైతు సదస్సు

ఆక్వా రైతుల సమస్యలపై ఈ నెల 8న కైకలూరు సీఎన్నార్‌ గార్డెన్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆక్వా రైతు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిఽథిగా రాష్ట్ర ఆక్వా కల్చర్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఏడీఏ) కోవైస్‌ చైర్మన్‌ ఆనం వెంకటరమణారెడ్డి హాజరవుతున్నారు. రీసర్వే లో వచ్చిన ఎల్‌పీ నంబర్‌తో వచ్చిన సమస్య ను, ఏపీ సడా యాక్ట్‌లో ఉన్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.

రీసర్వే వల్ల రైతులకు ఇబ్బందులు

గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వల్ల ఆక్వా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకే ఎల్పీ నంబర్లో రెండు చెరువులకు చెందిన రైతులు వివరాలు ఉండడంతో రుణాలు పొందేందుకు అవకాశం లేదు. సరిహద్దులో ఉన్న చెరువులు ఒకటి ఆక్వాజోన్‌లో ఉంటే మరోటి నాన్‌ ఆక్వాజోన్‌లోకి వెళ్లింది. ప్రభుత్వ రాయితీలు వర్తించడం లేదు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లి గత రీసర్వేను పూర్తిగా నిలుపుదల చేసేలా అసోసి యేషన్‌ ప్రయత్నిస్తోంది. ఈ నెల 8న కైకలూరులో జరిగే ఆక్వా సభలో ఏపీసడా చైర్మన్‌ దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.

– నంబూరి వెంకటరామరాజు (తాడినాడ బాబు), రాష్ట్ర చేపల రైతుల సంఘం అధ్యక్షుడు, కైకలూరు

దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు..

కైకలూరు మండలం పెంచికల మర్రులో మూడెకరాల రొయ్యల చెరువు ఉంది. ఇటీవల విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా రావడంతో మత్స్యశాఖ ద్వారా అనుమతులు తీసుకుని రాయితీ వచ్చేలా దరఖాస్తు చేసుకుందామని మత్స్యశాఖ కార్యాలయాన్ని సంప్రదించా. చెరువు నాన్‌ ఆక్వాజోన్‌లో ఉందని ప్రస్తుతానికి అనుమతులు వచ్చే పరిస్థితులు లేవన్నారు. నెల రోజులుగా అనుమతులు కోసం మత్స్యశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.

– సైదు జోబాబు, ఆక్వారైతు, కొట్టాడ

Updated Date - Apr 06 , 2025 | 11:36 PM