Share News

దోపిడీ దొంగలు ఏడుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:34 AM

పని చేస్తున్న చోట యజమాని రాకపోకలను గమనించి దోపిడీకి పాల్పడ్డారు.

దోపిడీ దొంగలు ఏడుగురి అరెస్ట్‌
నిందితులను చూపిస్తున్న భీమవరం డీఎస్పీ జయసూర్య

రూ.1.10 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

భీమవరం క్రైం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పని చేస్తున్న చోట యజమాని రాకపోకలను గమనించి దోపిడీకి పాల్పడ్డారు. కాళ్ళ మండలం కోలనపల్లి రాత్రివేళ ముఠాగా వచ్చి దారి కాచి నగదు దోచుకెళ్లిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి భీమవరం డీఎస్పీ ఆర్‌జి జయసూర్య సోమవారం వివరాలు తెలిపారు. కాళ్ళ గ్రామానికి చెందిన కోటి సుబ్బారావు ఆకివీడులో డ్రింక్‌ల కంపెనీ నడుపుతున్నాడు. అతని వద్ద ఆకివీడు మండలం దుంపగడపకు చెందిన తిరుమాని కిశోర్‌ పనిచేసి మానివేశాడు. ప్రస్తుతం చెరుకువాడ గ్రామానికి చెందిన పాకలపాటి నరేష్‌ పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా గత నెలలో కోటి సుబ్బారావు ఆకివీడులో విధులు ముగించుకుని రూ. 2 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. కోలనపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం ఆపి మూత్రవిసర్జన కోసం పక్కకు వెళ్లాడు. అదే సమయం లో దుంపగడపకు చెందిన తిరుమాని కిశోర్‌, ఆకివీడు సంత మార్కెట్‌కు చెందిన బొత్స కృష్ణమనాయుడు (మౌళి), ఆకివీడుకు చెందిన దాసరి హరి, ఆకివీడు పెదపేటకు చెందిన మైలా జోషువా (అలియాస్‌ వర్ష), చెరుకువాడకు చెందిన పాకలపాటి నరేష్‌, మరో ఇద్దరు బాలనేరస్తులు కలిపి కోటి సుబ్బారావును కాపు కాసి బ్యాగు లాక్కుని పరారయ్యారు. ఈ నెల 4న మళ్లీ ఆ ఏడుగురు కలిసి కోటి సుబ్బారావును అడ్డగించి జేబులో ఉన్న రూ. 10 వేలు లాక్కుని పరారయ్యారు. అనంతరం నగదును పంచుకున్నారు. దీనిపై కాళ్ళ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, డీఎస్పీ జయసూర్య, ఆకివీడు సిఐ జగదీశ్వరరావు ఆదేశాలతో ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాసరావు గస్తీ ముమ్మరం చేశారు. సోమవారం కాళ్ళ మండలం ఏలూరుపాడు చెక్‌ పోస్ట్‌ సమీపంలో వారు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నా రు. ఇద్దరు బాల నేరస్తులను జువైనల్‌ హోమ్‌కు తరలించామని, మిగిలిన ఐదుగురిని కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఆకివీడు సిఐ జగదీశ్వరరావు, కాళ్ళ ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:34 AM