Share News

Kakani Goverdhan Reddy Bail Hearing: కాకాణి నేరానికి పాల్పడ్డారు

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:57 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. హైకోర్టులో విచారణ జరుగుతుండగా, ఆయన ముందస్తు బెయిల్‌పై చర్చ కొనసాగుతోంది

Kakani Goverdhan Reddy Bail Hearing: కాకాణి నేరానికి పాల్పడ్డారు

  • క్వార్ట్జ్‌ అక్రమాల కేసులో ఎస్సీ,ఎస్టీ చట్టం సెక్షన్లు

  • దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదు

  • హైకోర్టుకు నివేదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

  • అరెస్టు నుంచి రక్షణ కోరిన కాకాణి న్యాయవాది

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరానికి పాల్పడ్డారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లు చేర్చారని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లిఖార్జునరావు, ఆ అదనపు సెక్షన్ల వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు వీలుగా ఆ వివరాలను పిటిషనర్‌కు అందజేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 3కు వాయిదా వేశారు. ఈ దశలో సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి స్పందిస్తూ, పిటిషనర్‌కు అరెస్ట్‌ నుండి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. తమ పిటిషన్‌ను నిరర్థకం చేసేందుకు ప్రాసిక్యూషన్‌ ప్రయత్నిస్తుందని విమర్శించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్పందిస్తూ... పిటిషనర్‌ దర్యాప్తునకు సహకరించడం లేదని, నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... ప్రస్తుత ముఖ్యమంత్రి విషయంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే మీడియాకు ఎక్కి తనను అప్పట్లో విమర్శించారని గుర్తు చేశారు. ఎస్సీ-ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పుడు సంబంధిత ప్రత్యేక కోర్టు ముందు మాత్రమే బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని ఇదే కోర్టులోని ఓ న్యాయమూర్తి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారన్నారు. పిటిషనర్‌పై ఎస్సీ-ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చేర్చిన నేపథ్యంలో ఈ కోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ జరపవచ్చా? లేదా? అనే విషయంలో వాదనలు వినిపించాలని సీనియర్‌ న్యాయవాదికి సూచించారు.


ఈ విషయంలో సంతృప్తి చెందకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేనని స్పష్టంచేశారు. వైసీపీ హయాంలో నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామపరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్ట్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారని ఆ జిల్లా మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బాలాజీనాయక్‌ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కాకాణి పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు కేసును కొట్టివేయాలన్న కాకాణి వేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను కూడా న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు.

  • అట్రాసిటీ కేసు

  • గిరిజనులను బెదిరించారనే ఫిర్యాదు మేరకే!

  • మరింత బిగుసుకున్న క్వార్ట్జ్‌ కేసు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఇప్పటికే నమోదైన క్వార్ట్జ్‌ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో పొదలకూరు మండలం మహమ్మదాపురంలోని రుస్తుం మైన్స్‌లో జెలిటిన్‌ స్టిక్స్‌ పేల్చే క్రమంలో గిరిజనులు అడ్డుకోవడంతో వారిని కాకాణి బెదిరించారన్న ఫిర్యాదుపై క్వార్ట్జ్‌ కేసులోనే అట్రాసిటీ కేసు కూడా యాడ్‌ చేస్తూ.. మంగళవారం కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోఉన్న కాకాణి గురువారం నెల్లూరు వస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తమకు ఎలాంటి సమాచరం లేదని పోలీసులు చెబుతున్నారు. కాకాణిపై అట్రాసిటీ కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఆయనకు మళ్లీ నోటీసు ఇస్తారా.. లేదా నెల్లూరు చేరుకోగానే అరెస్టు చేస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:58 AM