Share News

YS Jagan: చంద్రబాబు ప్రతి అడుగులో మోసం.. పాలనలో అబద్ధం

ABN , Publish Date - Apr 02 , 2025 | 08:31 PM

YS Jagan: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధికారాన్ని అందుకొంటుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

YS Jagan: చంద్రబాబు ప్రతి అడుగులో మోసం.. పాలనలో అబద్ధం
Ex CM YS Jagan

అమరావతి, ఏప్రిల్ 02: రాబోయే రోజుల్లో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ జోస్యం చెప్పారు. జగన్ 2.0లో కార్యకర్తలకు తోడుగా ఉంటానని మీకు మాట ఇస్తున్నానని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మాట మీద నిలబడే పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తమ కోసం తపించే గుండె రావాలని ప్రజలు కోరుకొంటున్నారని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన జడ్పీ,ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు,ఉప సర్పంచ్ స్ధానాలకు 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేక ఎన్నికలు వాయిదా వేశారని పేర్కొన్నారు. మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేక పోవడంతో ఎన్నికలు జరిపారన్నారు. అలా నిర్వహించిన 50 స్ధానాల్లో 39చోట్ల వైఎస్ఆర్ సీపీ గెలిచిందని చెప్పారు. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి..గెలిచారని తెలిపారు.


తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదన్నారు. గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినా సరే... ఈ మాదిరిగా మభ్యపెట్టి, భయపెట్టి, ఆందోళనకు గురిచేసి, ప్రలోభాలు పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఈ ఎన్నికలు నిర్వహించారని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్దీ జ్ణానం రెండూ లేవని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో మనకు బలం లేనప్పుడు ఎవరైనా పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబు అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి. ఎవరినైనా నేను భయపెడతాను, కొడతాను, చంపుతాను, ప్రలోభపెడతానని అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తున్నామని వివరించారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? అన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు.


ఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి... ప్రతి ఇంటికి వాళ్ల కార్యకర్తలను పంపేట్లు పంచారన్నారు. ప్రతి ఒక్కరికీ చంద్రబాబు బాండ్లు పంపించాడని ప్రలోభపెట్టి.. ఎన్నికల్లో గెలిచారన్నారు. గెల్చిన తర్వాత చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లు ఏమయ్యాయని ఎవరైనా అడగడానికి దైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతున్నారన్నారు. అంతే తప్ప ఆ హామీలు నెరవేర్చాలని కాని, ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలని కానీ చంద్రబాబు అడుగుల్లో కనిపించడం లేదని స్పష్టం చేశారు.

ప్రతి అడుగులోనూ మోసం, పాలనలో అబద్దాలే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్‌లు,సూపర్ సెవెన్‌లు గాలికెగిరిపోయి.. మోసాలుగా కనిపిస్తున్నాయి.చివరకు చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు మీ జగన్ పాలనలో.. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక బటన్ నొక్కే పరిస్థితి ఉండేది. ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగిందన్నారు. నాలుగు వేళ్లు నోట్లోకి పోయేయన్నారు.


చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశాడని వ్యంగ్యంగా అన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లోకి పోలేడు, కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి లేదన్నారు. స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీష్ మీడియం గాలికెగిరి పోయిందన్నారు.

నాడు నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ క్లాసులు తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్ పెట్టి మన పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలూ గాలికెగిరిపోయాయన్నారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు పంపిణీ ఆగిపోయిందని చెప్పారు.


ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. వైద్యం పరిస్థితి అలాగే ఉంది. మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు రూ. 300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3500 కోట్లు బకాయిలు పెట్టాడు. చివరకు ఆరోగ్య శ్రీ కింద నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

104, 108 ఆంబులెన్సులు గురించి చెప్పాల్సిన పని లేదు. వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారులకు అమ్ముడుపోయి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్ పీఎం కిసాన్ తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు. మేం వస్తే పీఏం కిసాన్ కాకుండా రూ. 20 వేలు ఇస్తామని నమ్మబలికాడు.


చంద్రబాబు వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన అమౌంట్ లేదు. బాబు ఇస్తామన్నది కూడా లేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశాడు. ఇన్ పుట్ సబ్సిటీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు లేకపోగా.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేనిపరిస్థితుల్లో రాష్ట్రం ప్రయాణం చేస్తోంది.

మరోవైపు వాలంటీర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. విచ్చల విడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తిరుపతి కార్పొరేషన్ లో 48 స్ధానాలు మనం గెలిస్తే వాళ్లు ఒక్కటే గెలిచారు. అక్కడ ఈ మధ్య కాలంలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగితే.. మన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు అడ్డుకుని, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి.


విశాఖపట్నంలో ఉన్న 98 స్ధానాలకు 56 స్ధానాలకు పైగా వైయస్సార్సీపీ గెలిచింది. ప్రజాస్వామ్యయుతంగా వైయస్సార్సీపీ మేయర్ ఉంటే, అక్కడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొరేటర్లను క్యాంపులోనికి తీసుకున్నాం. వారు క్యాంపులకు పోతే వాళ్ల ఇళ్లకు పోలీసులు వచ్చి.. మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్ కి తీసుకుపోతామని బెదిరిస్తున్నారు. నా అక్కచెల్లమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. అలాంటి సంఘటనలు విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి.

ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో... ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. కష్ట సమయంలో ఉన్న కార్యకర్తకు ఒక్కటే చెబుతున్నాను. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తికి, ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు.


రాబోయే రోజులు మనవే. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. ఈ సారి కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫెర్ట్ పెట్టాం.

కాబట్టి కార్యకర్తలకు తోడుగా ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నాను. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటాను. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు. చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్ కి చేరాయి. ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఆయన పీ-4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు.


పీ-4 విధానం అంటే సమాజంలో ఉన్న 20శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడంట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్దం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు.

రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటాడు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించాడు.


అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆయన చేసిన అప్పులు అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షలు కోట్లు అని చెబుతున్నాడు. మరో రెండు రోజుల పోతే రూ.12 లక్షల కోట్లు అని రూ.14 లక్షల కోట్లు అని చెబుతాడు. కారణం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్దాలు చెబుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 02 , 2025 | 08:31 PM