Share News

సెమీకండక్టర్స్‌ వ్యాపారంలోకి సైయెంట్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:27 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఐటీ కంపెనీ సైయెంట్‌ తన సెమీకండక్టర్‌ వ్యాపారాన్ని పెద్దఎత్తున విస్తరిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 400 మంది ఉద్యోగులతో...

సెమీకండక్టర్స్‌ వ్యాపారంలోకి సైయెంట్‌

  • సైయెంట్‌ సెమీకండక్టర్స్‌ పేరుతో సంస్థ ఏర్పాటు

  • రూ.862 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఐటీ కంపెనీ సైయెంట్‌ తన సెమీకండక్టర్‌ వ్యాపారాన్ని పెద్దఎత్తున విస్తరిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 400 మంది ఉద్యోగులతో సైయెంట్‌ సెమీకండక్టర్స్‌ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసి 10 కోట్ల డాలర్లు (సుమారు రూ.862 కోట్లు) కేటాయించింది. సెప్టెంబరు నాటికి ఈ అనుబంధ కంపెనీ కోసం విదేశాల నుంచి మరిన్ని నిధులు సమీకరిస్తామని సైయెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీ బోదనపు కృష్ణ తెలిపారు. ఇందుకోసం మర్చంట్‌ బ్యాంకర్లను నియమించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. అయితే విదేశాల నుంచి ఎంత మొత్తం నిధులు సమీకరించేది ఆయన వెల్లడించలేదు. భవిష్యత్‌లో ఈ అనుబంధ కంపెనీ షేర్లను స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదు చేసే యోచన కూడా ఉందన్నారు.


నైపుణ్యాలపైనే దృష్టి: సెమీకండక్టర్ల వ్యాపారంలో కొత్త చిప్స్‌ పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా మేధో సంపత్తి హక్కులు పొందాలని సైయెంట్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా దేశ విదేశాల్లోని విద్యుత్‌ వాహనాలు, విద్యుత్‌ పంపిణీ సంస్థల వంటి రంగాలకు అవసరమైన కస్టమైజ్డ్‌ సిలికాన్‌ చిప్స్‌ అభివృద్ధి చేస్తామని కృష్ణ తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఈ విషయంలో తమకు కలిసి వస్తాయని కంపెనీ భావిస్తోంది.

Updated Date - Apr 09 , 2025 | 04:27 AM