Business : వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారా.. ఇక నుంచి కష్టమే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:45 PM
వ్యక్తిగత రుణాలు పొందాలనుకునేవారికి ఇక నుంచి కష్టసమయమే. ఒకేసారి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం ఇక నుంచి కుదరకపోవచ్చు. కొత్త ఏడాదిలో ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే అందుకు కారణం.
అవసరం ఉందని తీర్చే సామర్థ్యం ఉన్నా లేకున్నా అందినకాడికి అప్పులు చేసేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫైనాన్స్ లోన్లతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయని బ్యాంకుల్లో లోన్లు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారంతా. వ్యాపారాలు చేసేవారైతే ఒకేసారి వివిధ బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాది నుంచి అలా తీసుకోవడం అసాధ్యమే. కొత్త ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్‌ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన నిబంధనలే అందుకు కారణం. కొత్త నిబంధనల ప్రకారం తక్కువ వ్యవధిలోనే పలు బ్యాంకుల్లో లోన్లు పొందే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటివరకూ బ్యాంకులు నెలకు ఒకసారి మాత్రమే ఆర్‌బీఐకి రుణగ్రహీతల క్రెడిట్ రికార్డులు పంపించేవి. ఇక నుంచి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా పంపించాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి 15 రోజులకు ఒకసారి రుణగ్రహీత క్రెడిట్ రికార్డులు అప్‌డేట్ అవుతాయి. అందువల్ల, లోన్లు జారీ చేసే సమయంలో బ్యాంకులు మునుపటి కంటే క్షుణ్ణంగా తనిఖీలు చేసే అవకాశం లభిస్తుంది. ఎంత రుణం తీసుకున్నారు..ఎక్కడెక్కడ తీసుకున్నారు అనే విషయంపై స్పష్టత వస్తుంది. తాహతుకు మించి ఒకేసారి పలు బ్యాంకుల్లో లోన్లు పొందిన వ్యక్తులకు అప్పు ఇచ్చేందుకు నిరాకరించవచ్చు.
గతంలో ఆర్‌బీఐకి నెలరోజులకు ఒకసారే క్రెడిట్ రిపోర్ట్‌లు పంపేవి ఆర్థిక సంస్థలు. అందువల్ల రుణగ్రహీతల బకాయిల చెల్లింపులు, ఎగవేతల సమాచారం త్వరగా తెలిసేది కాదు. దాదాపు 40 రోజులు ఆలస్యమయ్యేది. ఇప్పుడు గడువును 15 రోజులకు కుదించడం వల్ల బకాయిలు ఆలస్యంగా చెల్లించేవారు తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులకూ కచ్చితమైన సమాచారం అంది సరైన వ్యక్తులకే రుణాలు ఇవ్వగలిగే సౌకర్యం లభిస్తుందని.. చెల్లించే సామర్థ్యం లేకున్నా అధికరుణాలు పొందేవారికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.