Share News

SBI Chairman : చిన్న సంస్థల రుణాలపై జర జాగ్రత్త

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:03 AM

చిన్న కంపెనీలకు ఇచ్చే రుణాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) చైర్మన్‌ సీ శ్రీనివాసులు శెట్టి హెచ్చరించారు.

SBI Chairman : చిన్న సంస్థల రుణాలపై జర జాగ్రత్త

  • నిధుల వినియోగం పర్యవేక్షణ తప్పదు

  • ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి

  • 8-9 శాతం వృద్ధి రేటుతోనే వికసిత్‌ భారత్‌

  • ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి

ముంబై: చిన్న కంపెనీలకు ఇచ్చే రుణాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) చైర్మన్‌ సీ శ్రీనివాసులు శెట్టి హెచ్చరించారు. ఈ సంస్థలు అప్పులు లేదా ఈక్విటీ ద్వారా సేకరించే నిధుల తుది వినియోగంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఎ్‌సఎం) ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఎస్‌బీఐ చైర్మన్‌ ఈ విషయాలు చెప్పారు. చిన్నచిన్న కంపెనీలు అప్పులు లేదా ఈక్విటీ ద్వారా సమీకరిస్తున్న నిధులను వేరే అవసరాలకు దారి మళ్లిస్తున్నాయని ఇటీవల పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శెట్టి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అధికారాలూ ఉండాలి: కొత్తగా ఏర్పాటు చేసే సంస్థకు.. చిన్న కంపెనీలు అప్పులు లేదా ఈక్విటీ ద్వారా సేకరించే నిధుల తుది వినియోగాన్ని పర్యవేక్షించే అధికారం కూడా ఉండాలని ఎస్‌బీఐ చైర్మన్‌ శెట్టి స్పష్టం చేశారు. ఇలాంటి సంస్థ ఏర్పాటు అటు రుణదాతలకు.. ఇటు మదుపరులు ఇద్దరికీ మేలు చేస్తుందన్నారు. అప్పుడు చిన్న కంపెనీలు కూడా పోటీ పద్దతిలో తక్కువ వడ్డీ రేటుకే రుణాలు పొందే సౌలభ్యం ఉంటుందన్నారు. గత ఏడాది మార్చిలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా చిన్న వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల తుది వినియోగాన్ని అప్పులిచ్చిన బ్యాంకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరింది.


బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులపై తీసుకున్న హామీ లేని రుణాలను కొందరు యువకులు నష్టభయం ఎక్కువగా ఉండే డెరివేటివ్స్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంపైనా ఎస్‌బీఐ చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల పెట్టుబడులు డెరివేటివ్‌ మార్కెట్లకు బదులు ప్రైమరీ మార్కెట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన (వికసిత్‌ భారత్‌) దేశంగా ఎదగాలంటే తీసుకోవాల్సిన చర్యలనూ ఎస్‌బీఐ చీఫ్‌ శెట్టి సూచించారు. ఇందుకోసం 2036 వరకు ఏటా 8-9 శాతం చొప్పున జీడీపీ వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందన్నారు. దీంతో పాటు జీడీపీలో పొదుపు రేటును ప్రస్తుత 30 శాతం నురచి 33.5 శాతానికి పెంచుకోవాలన్నారు. ఈ విషయంలో క్యాపిటల్‌ మార్కెట్లది కీలక పాత్ర అన్నారు. సరైన రికార్డుల లేకపోవడంతో ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాల రిస్క్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సరిగా బేరీజు వేయలేకపోతున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ శెట్టి తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 04:11 AM