Woman Kills Husband for Govt Job: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్త హత్య.. పోస్టుమార్టంతో బయటపడ్డ దారుణం
ABN , Publish Date - Apr 08 , 2025 | 08:44 PM
ప్రభుత్వోద్యోగం చేస్తున్న యువకుడు సడెన్‌గా మృతి చెందడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. అప్పటికే భార్యతో అతడికి విభేదాలు ఉండటంతో ఎందుకైనా మంచిదని పోస్టు మార్టం చేయించడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. భార్యే అతడిని హత్య చేసినట్టు తేలింది.

ఇంటర్నెట్ డెస్క్: అప్పటిదాకా బాగానే ఉన్న యువకుడు సడెన్‌గా కన్నుమూశాడు. కుటుంబసభ్యులు షాకైనా విధిరాత అని సరిపెట్టుకున్నారు. అంత్యక్రియలకు కూడా సిద్ధమయ్యారు. కానీ మనసులో ఏదో సందేహం. దీంతో, పోస్టుమార్టం కోసం పట్టుబట్టారు. ఆ తరువాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువకుడి భార్య చేసిన దారుణం బయటపడి యావత్ కుటుంబం నిర్ఘాంతపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, యూపీలోని బిజ్‌నోర్‌కు చెందిన దీపక్ అనే 27 ఏళ్ల యువకుడు రైల్వేలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. అతడికి 2023లో శివానీ అనే యువతితో పెళ్లైంది. వారికి ఆరు నెలల వయసున్న బిడ్డ కూడా ఉంది. ఇటీవల నవరాత్రి పూజ సందర్భంగా ఆ యువకుడు కన్నుమూశాడు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మరణించడంతో కుటుంబసభ్యులు షాకపోయారు. శోకసంద్రంలో కూరుకుపోయారు. హార్ట్ ఎటాక్‌తో మృతి చెందాడని భావించిన కుటుంబసభ్యులు చివరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అప్పటికే అతడికి భార్యతో విభేదాలు ఉన్నాయి. దీంతో, కుటుంబసభ్యులు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మృతదేహానికి పోస్టు మార్టం చేయిస్తే అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. అతడికి ఊపిరాడకుండా చేసి చంపేశారన్న విషయం బయటపడింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరో వ్యక్తితో కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. భర్త ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతోనే శివానీ అతడిని చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెకు సహకరించిన వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే దీపక్ భార్యకు అత్తింటివారితో అస్సలు పడేది కాదని మృతుడి సోదరుడు తెలిపారు. తన తల్లిపై కూడా వదిన చేయి చేసుకునేదని అన్నాడు. దీపక్ తల్లి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కొడుకూ కోడల మధ్య కూడా తరచూ గొడవలు జరిగేవని చెప్పింది. తన కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం కోసమే అతడిని మట్టుపెట్టిందంటూ కన్నీటిపర్యంతమైంది.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు