Share News

Varanasi Temple: కాశీ విశ్వనాధుడి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం ఎలా పొందాలో తెలుసా.. ఇలా చేస్తేనే వీఐపీ లెటర్ చెల్లుతుంది

ABN , Publish Date - Mar 10 , 2025 | 09:16 AM

కాశీలో వీఐపీల సిఫార్సు లేఖలు చెల్లుతాయా. ప్రోటోకాల్ దర్శనాల కోసం వారణాసిలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి. నేరుగా సిఫార్సు లేఖ తీసుకెళ్తే దర్శనం కల్పిస్తారా.. ప్రోటోకాల్ దర్శనం కోసం వారణాసిలో ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Varanasi Temple: కాశీ విశ్వనాధుడి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం ఎలా పొందాలో తెలుసా.. ఇలా చేస్తేనే వీఐపీ లెటర్ చెల్లుతుంది
Varanasi Temple

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రోటోకాల్ దర్శనాల గురించి చాలామందికి తెలుసు. వీఐపీలు ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా లేదా అధికారిక లేఖ ద్వారా ఆలయాల్లో ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తుంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు లేదా ముఖ్యమైన వ్యక్తుల సిఫార్సు మేరకు ఆలయాల్లో దర్శనాలు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆలయాలకు వెళ్లేటప్పుడు ప్రోటోకాల్ దర్శనం వర్తిస్తుందా.. ప్రముఖుల సిఫార్సు లేఖలు చెల్లుబాటవుతాయా అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి.


సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖుల గురించి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా గుర్తించే అవకాశం ఉండకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో మన నేతల సిఫార్సు లేఖలు వర్తించవనే అభిప్రాయంలో ఎక్కువమంది ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎక్కువమంది సందర్శించే క్షేత్రాల్లో కాశీ విశ్వనాధుడి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రోటోకాల్ దర్శనాలను అనుమతిస్తారా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటారా.. అసలు కాశీ విశ్వనాధుడి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం కోసం ఎలాంటి విధానం అందుబాటులో ఉందనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చాలామంది ప్రముఖుల సిఫార్సు లేఖలు అడిగి నేరుగా తీసుకెళ్తుంటారు. కాశీలో ఇలా నేరుగా తీసుకెళ్లే లేఖలపై దర్శనాలను కల్పించరు. కానీ సిఫార్సు లేఖలపై సులువుగా దర్శనం ఎలా పొందాలో తెలుసుకుందాం.


వీరికి మాత్రమే..

కేంద్రమంత్రులు, ఎంపీలు(లోక్‌సభ, రాజ్యసభ)తో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తారు. గతంలో సిఫార్సు లేఖలపై ఉచిత దర్శనం కల్పించేవారు. ప్రస్తుతం ఆలయంలో రద్దీ, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకూడదననే ఉద్దేశంతోపాటు ఆలయ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో సిఫార్సు లేఖలపై దర్శనానికి వచ్చే భక్తులు ఒక్కొక్కరు రూ.300 టికెట్ తీసుకోవాలనే నిబంధనను ఆలయ ట్రస్టు అమలుచేస్తోంది. ముఖ్యంగా ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు అధికంగా వస్తుండటంతో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.


ఎలా పొందాలి

సాధారణంగా ఆలయాలకు ప్రముఖ వ్యక్తుల సిఫార్సు లేఖలను భక్తులు నేరుగా తీసుకెళ్తుంటారు. కానీ కాశీ విశ్వనాధుడి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. సిఫార్సు లేఖను నేరుగా తీసుకెళ్లినప్పటికీ దర్శనానికి వెళ్లే భక్తుల వివరాలతో కూడిన లేఖను ముందుగానే ఈ మెయిల్ ద్వారా లేదా అధికారిక వాట్సప్ నెంబర్‌కు పంపించాల్సి ఉంటుంది. సిఫార్సు లేఖను ఇస్తున్న వ్యక్తులు లేదా సంస్థల అధికారిక మెయిల్ నుంచి ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది. protocol@shrikashivishwanth.org, kvdvipdarshan@gmail.com మెయిల్ ఐడికి ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది. వారణాసి చేరుకున్న తర్వాత విశ్వనాధుడి ఆలయం సమీపంలో ఉండే ప్రోటోకాల్ కార్యాలయాన్ని సందర్శించి ఏ పేరుతో మెయిల్ వచ్చిందో తెలియజేయాల్సి ఉంటుంది. ఆలయ సిబ్బంది తక్షణమే చెక్ చేసి లెటర్ సరైన ఫార్మెట్‌లో ఉందని నిర్దారించుకున్న తర్వాత భక్తుల ఐడీ కార్డులు పరిశీలిస్తార. సిఫార్సు లేఖలో పేర్లతో సరిపోలతే దర్శనానికి అనమతిస్తారు. రాష్ట్రపతి, ప్రధాని లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు ఎవరైనా దర్శనానికి వచ్చే రోజుల్లో ప్రోటోకాల్ దర్శనాలపై ఆంక్షు విధిస్తారు. అలాంటి రోజుల్లో అసిస్టెండ్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ వారణాసి వారి అనుమతి పొందాల్సి ఉంటుది. సిఫార్సు లేఖను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ పేరుతో రాయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

శ్రీలీలకు చిరంజీవి కానుక

పంచాయతీరాజ్‌ ప్రక్షాళన

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 10 , 2025 | 09:16 AM