MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:25 AM
విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు

మెడికల్ కాలేజీలో మాస్ కాపీయింగ్.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఇతర ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు స్లిప్‌లు
అంతా బడా వ్యక్తుల పిల్లలే.. ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం.. ఇన్విజిలేటర్ల చేతివాటం
సబ్జెక్టును బట్టి రేట్లు.. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి లక్షలు వసూలు.. పారా మెడికల్, నర్సింగ్ వారి నుంచి ఒక్కో పరీక్షకు 1000.. పరీక్ష రాసిన తర్వాత జవాబుపత్రాలూ మార్పిడి
ఆరోగ్య శాఖ అధికారులకు పలు ఫిర్యాదులు.. తాజా తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురు విద్యార్థులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎంతో ఘన చరిత్ర ఉన్న విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఇప్పుడు కొందరు అధికారులు, ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల విద్యార్థులు కలసి కాపీయింగ్‌కు కేరాఫ్ అడ్ర్‌సగా మార్చేశారు. విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సప్లమెంటరీ పరీక్షల్లో కాపీ కొట్టేందుకు ఎగ్జామినేషన్ విభాగం సిబ్బంది కొందరు సహకరిస్తున్నారు. ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు.. ఏవైనా ఇక్కడ కాపీ మాత్రం కామన్ అయిపోయింది. దీంతో కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు సిద్ధార్థ కాలేజీలోనే సప్లిమెంటరీ రాసేందుకు ఆప్షన్ పెట్టుకుంటున్నారు. రెగ్యులర్ పరీక్షల్లో పాస్ కాలేక... ఒకే పరీక్షను నాలుగైదు సార్లు రాస్తున్నవారు ఇటు మొగ్గు చూపుతున్నారు. స్థాయి, పరపతి, డబ్బు ఉన్న వారి పిల్లలు... సిద్ధార్థనే పరీక్ష కేంద్రంగా ఎంచుకుంటున్నారు. దీనిపై కొంతకాలం కిందటే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు, వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ విషయంపై మాట్లాడారు. ‘మీ కాలేజీలో ఏదో జరుగుతోంది.. పెద్ద పెద్దవాళ్ల పిల్లలు మొత్తం సప్లమెంటరీ పరీక్షలకు మీ కాలేజీనే ఆప్షన్ పెట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి’ అని హెచ్చరించారు.
ఎగ్జామినేషన్ వింగ్‌లో స్కెచ్
సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎగ్జామినేషన్ విభాగంలో కాపీయింగ్‌కు సంబంధించిన మొత్తం స్కెచ్ వేస్తారు. కాపీ కొట్టేందుకు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఒక రేటు, నర్సింగ్ విద్యార్థులకు మరో రేటు, పారా మెడికల్ విద్యార్థులకు ఇంకో రేటు ఫిక్స్ చేస్తారు. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకూ వసూలు చేస్తారు. అది కూడా సబ్జెక్టును బట్టి రేటు నిర్ణయిస్తారు. నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులైతే ఒక్కొక్కరి నుంచి పరీక్షకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు. నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది. విద్యార్థులు ఎగ్జామ్ హాల్‌లో సరిగ్గా రాయలేకపోతే, పరీక్ష పూర్తయిన తర్వాత రెండో రోజు లేదా మూడో రోజు వారి జవాబు పత్రాలను బయటకు తీసేసి పేపర్లు మార్చే అవకాశాన్ని కూడా ఎగ్జామినేషన్ విభాగం సిబ్బంది కల్పిస్తారు. ఎగ్జామినేషన్ విభాగంలో సిబ్బందిని ప్రతి ఏటా లేదా రెండేళ్లకు ఒకసారి మార్చాలి. కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎగ్జామినేషన్ విభాగం సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయారు.
కాపీయింగ్ ఇలా..
ఎంబీబీఎస్ విద్యార్థులు కాపీ కొట్టడం అంత ఈజీ కాదు. పరీక్షా కేంద్రాల్లో జామర్లు, సీసీ కెమెరాలు ఉంటాయి. సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా, తీసుకువచ్చినా సిగ్నల్స్ రాకుండా జామర్లు ఏర్పాటు చేస్తారు. అయితే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీసీ కెమెరాలు, జామర్ల కళ్లుగప్పి మరీ కాపీ కొట్టిస్తారు. వర్సిటీ నుంచి ఆన్‌లైన్‌లో పేపర్ వచ్చినప్పటి నుంచే వ్యవహారం ప్రారంభమవుతుంది. వర్సిటీ అధికారులు ఏ పేపర్ ఓపెన్ చేయాలన్నా ప్రిన్సిపాల్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. లాగిన్ ఐడీ, పిన్ కూడా ఇచ్చి, పేపర్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. పరీక్షకు గంట ముందు ఇదంతా జరుగుతుంది. ఈ గంటలోనే సిద్ధార్థలో ఎగ్జామినేషన్ విభాగం సిబ్బంది కాపీ కొట్టేందుకు అవసరమైన స్లిప్పులు సిద్ధం చేస్తారు. వాటిని బాత్ రూమ్‌ల్లో సిద్ధంగా ఉంచుతారు. వీరితో బేరం కుదుర్చున్న విద్యార్థులకు పరీక్ష ప్రారంభమైన 45 నిమిషాల తర్వాత స్లిప్‌లు అందజేస్తారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్‌ను మేనేజ్ చేస్తారు. కొన్నేళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతోంది. తాజాగా బుధవారం జరిగిన పరీక్షా సమయంలో కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాల దిశమార్చినట్టు వర్సిటీ అధికారులు గుర్తించారు.
రట్టవుతున్న గుట్టు...
బుధవారం ఎంబీబీఎస్ చివరి ఏడాది జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్ రెండో ఏడాది ఫార్మకాలజీ సప్లమెంటరీ పరీక్షలు దాదాపు 90 మంది రాశారు. అందులో ఎక్కువ మంది బిగ్ షాట్స్ పిల్లలు ఉన్నారు. దాదాపు 15 మంది విద్యార్థులు కాపీయింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు జరిగినట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని హెల్త్ వర్సిటీ అధికారులకు తెలియజేసి, పరీక్ష ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. దీంతో హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ 15 మందిలో ముగ్గురు పిల్లలు కాపీ కొడుతూ పట్టుబడగా, మిగిలిన విద్యార్థులు అలర్ట్ అయ్యారు. పట్టుబడిన ముగ్గురిలో ఇద్దరు మంగళగిరిలోని ప్రముఖ మెడికల్ కాలేజీ విద్యార్థులు. మరొకరు ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీ విద్యార్థి. విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్, ఇతర వైద్య సిబ్బంది, ఎగ్జామినేషన్ విభాగం ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అధికారులు భావించారు. కానీ శుక్రవారం బదిలీలతో సరిపెట్టారు. శనివారం సిద్ధార్థ కాలేజీలో జరిగిన ఎంబీబీఎస్ సప్లమెంటరీ పరీక్షల్లో కూడా ఇద్దరు విద్యార్థులు కాపీయింగ్ చేస్తూ దొరికారు. వీరిద్దరిని ఓ గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నట్టు సమాచారం. ఇద్దరు విద్యార్థులను డీ బార్ చేశారు.
ఇన్విజిలేటర్లూ వాళ్లే...
ఇన్విజిలేటర్ల ఎంపికలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎగ్జామినేషన్ విభాగం సిబ్బంది హెల్త్ వర్సిటీ ఉద్యోగులను మేనేజ్ చేస్తారు. ఇన్విజిలేటర్లుగా తమతో కుమ్మక్కైయిన వైద్యులను నియమించుకుంటారు. కొన్ని పరీక్షలకు అర్హత లేని వారిని కూడా నియమిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నర్సింగ్ పరీక్షల సమయంలో ఇన్విజిలేషన్ కోసం స్టాఫ్ నర్సులు పోటీపడతారు. కాపీ కొట్టేందుకు అవకాశం కల్పించడం వల్ల కొంత మొత్తం ఇస్తారని ఆశించడమే కారణం. పారా మెడికల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోందన్న దానిపై ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా విచారణ చేయాల్సి అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.