దార్శనిక ఆర్థికవేత్త అంబేడ్కర్
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:52 AM
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, దార్శనిక ఆర్థికవేత్త కూడా. మన కేంద్ర బ్యాంకు అంటే ఆర్బీఐ (భారత రిజర్వ్ బ్యాంక్) వ్యవస్థాపనకు ఆయన అర్థశాస్త్ర విద్వత్తు విశేషంగా...

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, దార్శనిక ఆర్థికవేత్త కూడా. మన కేంద్ర బ్యాంకు అంటే ఆర్బీఐ (భారత రిజర్వ్ బ్యాంక్) వ్యవస్థాపనకు ఆయన అర్థశాస్త్ర విద్వత్తు విశేషంగా దోహదం చేసింది. భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంక్ (ఇదే తదనంతర కాలంలో ఆర్బీఐగా మారింది) నేర్పాటు చేయాలని 1926లో బ్రిటిష్ వైస్రాయి లార్డ్ రీడింగ్‌కు సిఫారసు చేసిన రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ (హిల్టన్ యంగ్ కమిషన్‌గా సుప్రసిద్ధమైనది) మన దేశంలో పర్యటించినప్పుడు ఆ కమిషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ పరిశోధనా గ్రంథం ‘ది ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ’ని ప్రమాణంగా తీసుకోవడం గమనార్హం. భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు ఏర్పాటు ఆవశ్యకతను వారు ఆ పుస్తకం ఆధారంగా నొక్కి చెప్పారు.
అంబేడ్కర్ మేధో కృషిలో అంతర్భాగంగా ఉన్న సుస్థిరాభివృద్ధి సూత్రాలు ఆయన ఆర్థిక దార్శనికతకు మరొక విశిష్ట తార్కాణం. ఆయన రచనలు, ఉపన్యాసాలు, ఉద్యమాలకు సైతం ఆ దార్శనికత ఒక స్ఫూర్తిగా ఉన్నది. ప్రత్యేకించి ఆయన అర్థశాస్త్ర పరిశోధనలను వర్తమాన భారతదేశం అధ్యయనం చేయవలసిన అవసరమున్నది. నేటి వికసిత్ భారత్ లక్ష్యాలకు ఆయన ఆలోచనలు సమతూకంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ విద్యతో చైతన్యాన్ని, సాధికారతను సాధిస్తారని ఆయన నినదించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికై సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించి ఆయన పరిశోధనలు చేశారు. వెనుకబడిన వర్గాల వారి హక్కుల పరిరక్షణకు ప్రపంచ వేదికల మీద ఉపన్యసించారు. ఎదురైన ప్రతి ప్రశ్నకు దీటుగా సమాధానం చెప్పారు. వీటిని గ్రంథస్థం చేశారు. అలా వెలుగు చూసిన గ్రంథమే ‘అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ (కుల నిర్మూలన). కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్, పొలిటికల్ ఎకానమీలలో ఆయన డాక్టరేట్ డిగ్రీలు పొందారు. దక్షిణాసియా నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ డిగ్రీ పొందిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. అంతేకాదు ఆయన బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, పాళీ, సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కొంకిణి భాషల మీద సాధికారత ఉన్న విద్వజ్ఞుడు. భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని ప్రగాఢంగా అధ్యయనం చేశారు. కనుకనే బ్రిటీష్ పాలకుల ముందు భారతీయ సమాజాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించగలిగారు.
రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థాపనకు స్ఫూర్తినిచ్చిన తన పరిశోధనా గ్రంథాలు ‘ది ప్రోబ్లమ్ ఆఫ్ రూపీ’, ‘నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా’లో భూ సంస్కరణలు, బంగారం విలువను నిర్ధారించే ప్రమాణాలు, ద్రవ్య విధానాలు మొదలైన అంశాలను అంబేడ్కర్ విపులంగా చర్చించారు.
పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ విషయమై రాజ్యాంగపరిషత్తు సమావేశాల్లో ఆయన సమగ్రంగా చర్చించారు. ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా బ్రిటీష్ పాలకులను, నాటి జాతీయ కాంగ్రెస్, ఇతర సభ్యులను ఒప్పించి ప్రాథమిక హక్కులకు హామీపడుతున్న అధికరణలు, నిబంధనలను పొందుపరచగలిగారు. అసమానతలను రూపుమాపడానికి ఉపాధి, విద్యా రంగాల్లో, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన పట్టుబట్టి సాధించారు. ఈ స్ఫూర్తితోనే బీసీలకు, మహిళలకు, మైనారిటీలకు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగంలో 15 అధికరణ మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. 1951 తొలి రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి మహిళలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకురావడానికి రాష్ట్రానికి అధికారం ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే అంబేడ్కర్ ఈ దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును నిర్మించేందుకు ఎంత దూరదృష్టితో ఆలోచించారో స్పష్టమవుతుంది. డాక్టర్ అంబేడ్కర్ భారతీయ ఆర్థికశాస్త్రాన్ని కొత్త సామాజిక, రాజకీయ దృక్పథంతో సమున్నతం చేశారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధనలో రాజ్యం పాత్రను, రాజ్యాంగ పద్ధతుల ప్రాధాన్యాన్ని సమగ్రంగా వివరించారు. నియంతృత్వ పాలనను, హింసాత్మక పద్ధతులను గట్టిగా వ్యతిరేకించారు.
ప్రత్యేకించి నిమ్నకులాలవారు ప్రజాస్వామ్య పంథా అనుసరించాలని అంబేడ్కర్ నొక్కి చెప్పారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాద భావజాలంతో 1972లో వచ్చిన దళిత్ పాంథర్స్ ఉద్యమం నిలబడలేదు. మానవతావాదం, వ్యక్తి స్వేచ్ఛలకు ఎక్కడా భంగం వాటిల్లకూడదని ఆయన హెచ్చరించారు. 1947లో ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ పేరు మీదుగా బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించిన మెమోరాండంలో భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ప్రయోజనాత్మక వ్యూహ రచన చేశారు.
ప్రైవేట్ సంస్థలకు మార్గాలను మూసివేయకూడదని గట్టిగా చెప్పారు. దీనికి తగిన విధంగా ప్రజల ఆర్థిక జీవితాన్ని అలవర్చుకోవాలన్నారు. సంపద సమాన పంపిణీ బాధ్యతను రాజ్యం చేపట్టాలన్నారు. వర్గరహిత సమాజాన్ని ఆశించారు. రాజ్యరహిత సమాజాన్ని నిరసించారు. ఈ విషయంలో ఆయన ప్రపంచ మేధావుల మెప్పుపొందారు. వ్యవసాయరంగ సమస్యల పరిష్కారానికి శాస్త్రీయమైన సూచనలు చేశారు. రైతు సహకార సంఘాలను ఏర్పాటు చేసి భూ కమతాలను ఏకీకృతం చేయాలన్నారు. దీంతో వ్యయాన్ని తగ్గించి, ఉత్పత్తి పెంచవచ్చని అన్నారు. వ్యవసాయ రంగంలోని మిగులు శ్రామికులను పారిశ్రామిక రంగంలో ఉపయోగించుకోవాలని ఆయన పదేపదే చెప్పారు. పారిశ్రామికీకరణ పురోగతి వ్యవసాయ రంగంపై భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు రంగాల వృద్ధి ఆధారంగా మూడో రంగం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు అంబేడ్కర్ నిర్దేశించిన దారిలోనే పయనిస్తున్నాయి.
డాక్టర్ జీకేడీ ప్రసాదరావు
ఫ్యాకల్టీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం
(రేపు అంబేడ్కర్ జయంతి)
ఇవి కూడా చదవండి..