దళిత సాహిత్యోద్యమ వేగుచుక్క
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:38 AM
జాతీయోద్యమ సందర్భంలో రాజమండ్రి వచ్చిన మహాత్మగాంధీ మాల మాదిగ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, ఒక ప్రజానాయకుణ్ణి ఆహ్వానించారు. గాంధీ పిలిచాడు కదా అని ఆ నాయకుడు...

జాతీయోద్యమ సందర్భంలో రాజమండ్రి వచ్చిన మహాత్మగాంధీ మాల మాదిగ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, ఒక ప్రజానాయకుణ్ణి ఆహ్వానించారు. గాంధీ పిలిచాడు కదా అని ఆ నాయకుడు మహదానందంతో అమాంతం పరుగెత్తుకుంటూ వెళ్లలేదు. ‘అంటరాని ప్రజల పట్ల నిజంగా మీకు ప్రేమ ఉంటే స్వయంగా మా మాల పేటకు రావాలని’ ఆ నాయకుడు గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. గాంధీ స్వయంగా లక్ష్మీవారపుపేటకు వెళ్ళి ఆ నాయకుడిని కలుసుకున్నాడు. అంటరాని ప్రజల సంక్షేమానికి సంబంధించి ఆ నాయకుడి సూచనలు, సలహాలు తీసుకున్నాడు. అచంచలమైన అతని దీక్షాదక్షతలను, ఆత్మగౌరవతత్త్వాన్ని గ్రహించిన గాంధీ అప్పటికప్పుడు అభినందన పత్రం రాసి ఆయనకందించాడు. సంస్కృతం, ఆంగ్లం, హింది, ఉర్దూ భాషల్లో అభినివేశం కలిగిన ఆ నాయకుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో పాటు నిజామాంధ్రలోని ప్రముఖ నాయకుల ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాన్ని ధారవోసిన ఆ ప్రజానాయకుడి పేరు దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న. ‘హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబుకాద’ని తెలుగు సాహిత్యంలో తొలిసారిగా దళిత హక్కుల దండోరా మ్రోగించిన కవి. కుల, మత, వర్గాది సనాతన వ్యాధులతో కునారిల్లుతున్న సమాజ ఆరోగ్యానికి తన రచనల ద్వారా సముచితమైన కార్యాచరణ ప్రణాళిక నందించిన అసమాన సాంస్కృతిక వైద్యుడు కుసుమ ధర్మన్న. దేశ సౌభాగ్య మూలాలను విస్మరించి స్వరాజ్య ఫలాలను ఆరగించాలని వడివడిగా పరుగులు తీస్తున్న పోరాటయోధులకు సరైన దారి చూపిన దార్శనికుడు కుసుమ ధర్మన్న.
కవిగా, రచయితగా పత్రికా సంపాదకునిగా, బహుముఖ పాత్ర పోషించిన ధర్మన్న వెలివాడల చీకటిలో కుమిలిపోతున్న దళిత జాతిని చైతన్యభరితం చేశాడు. ఆధిపత్యవర్గాలు నిర్దేశించే ప్రధాన స్రవంతి ఉద్యమాల వెల్లువలో కొట్టుకుపోకుండా, మొక్కవోని సంకల్పంతో ‘ఆత్మగౌరవంబు నలరంగ’, ‘సాంఘిక సమరమ్ము సలుపంగ’ కుసుమ ధర్మన్న అట్టడుగు బతుకు పొరల్లోకి సాగిపోయాడు. అస్తిత్వ ఉద్యమాలు, కుల నిర్మూలనా పోరాటాలు అందించిన కొత్త అజెండా వెలుగుల్లో దళిత సాహిత్య చింతన గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరుగుతున్న ఈ సందర్భంలో దాదాపు వంద సంవత్సరాల క్రితమే దళిత సాహిత్య మౌలిక ఆశయాలను దశదిశలా చాటిచెప్పిన కుసుమ ధర్మన్న సృజన తత్వాన్ని, జీవన గమనాన్ని తడిమిచూస్తే ఆయన ప్రత్యామ్నాయ దృక్పథం అవగతమవుతుంది. ఆధునికాంధ్ర మహాకవులు ‘హంగ్రీథర్టీస్’ ప్రభావిత మహామహులు చూపుసారించని అసమ సమాజ ముఖచిత్రాన్ని కుసుమ ధర్మన్న తన రచనల్లో అద్భుతంగా ఆవిష్కరించాడు. అణగారిన వర్గాల నాయకుడిగా నిరంతరం ప్రజాజీవితంలో గడిపిన ధర్మన్న తదనుగుణమైన అనుభవాలతో, దళిత జీవన వాస్తవికతతో గొప్ప రచనలు చేశాడు.
‘స్వరాజ్యం నా జన్మహక్కు’ నినాదానికి భిన్నంగా ‘సమానత్వం నా జన్మహక్కు’ అని జాతీయోద్యమ పరిమితులను విమర్శించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కంటే ముందుగానే కుసుమ ధర్మన్న 1921 నుండి దళిత జాతీయ వాదాన్ని తన పాటల ద్వారా, పద్యాల ద్వారా సరళ సుందరంగా ప్రబోధించాడు. సామాజిక ప్రతిబంధకాల పట్ల మౌనం వహించి, స్వదేశ దాస్య బంధనాలను నిర్మూలించాలనే సందేశంతో సమకాలిన కవులందరూ ఘోషిస్తుంటే, ‘స్వకులమునకాపాదించిన హైన్యతను నివారించుటయే జీవితోద్దేశము’గా కుసుమ ధర్మన్న కవితాగానం చేశాడు. స్వాతంత్ర్యోద్యమ కవులు భారతదేశ విముక్తి తత్వోపదేశాలను ప్రవచిస్తుంటే ఇందుకు భిన్నంగా కుసుమ ధర్మన్న ‘నిమ్మజాతి ముక్తి తరంగిణి’యై జీవితపు సన్నని సందుల్లోకి ప్రవహించాడు. జాతీయోద్యమ కవులు, రచయితలు, భారతదేశ పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక వైభవప్రాభవాలను కీర్తిస్తుంటే ధర్మన్న మాత్రం సామాజిక వాస్తవికతను అర్థం చేసుకుని దళితుల చారిత్రక ఔన్నత్యాన్ని దళితుల సాంస్కృతిక ఘనతను, వారి శ్రమైక జీవన స్థితిగతులను విశదీకరించాడు. బ్రిటీష్ పాలకుల దుర్నీతిని ఎండగట్టాడు. ఒకవైపు సాటి మనుషులను కఠినంగ అణిచివేస్తూనే, మరొకవైపు తెల్లదొరల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే నాయకుల ద్వంద్వ ప్రవృత్తిని ధర్మన్న విమర్శించాడు. ప్రత్యామ్నాయ వివేచనతో, అనుభవజ్ఞానంతో జాతీయోద్యమ లోపభూయిష్ట విధానాలను ఎంతో సాహసోపేతంగా ఎత్తిచూపాడు. గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన మాకొద్దీ ‘తెల్లదొరతనం’ అనే గేయం తెలుగునాట ప్రతిధ్వనిస్తున్న సమయంలో ఖ్యాతి గాంచిన గరిమెళ్ళ గేయస్ఫూర్తికి భిన్నంగా ‘మాకొద్దీ నల్లదొరతనం’ అనే గీతంతో కుసుమ ధర్మన్న సాహిత్యంలో సంచలనం సృష్టించాడు. అణగారిన ప్రజల్లో అగ్ని పర్వతంలా పెల్లుబుకుతున్న భావావేశానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ గీతం భారతీయ సాహిత్యంలోనే విలక్షణమైనదిగా పేర్కొనవచ్చు. విప్లవాత్మకమైన మా కొద్దీ నల్లదొరతనం గీతం దళిత జాతీయవాదానికి మేనిఫెస్టోలాగా కనబడుతుంది. అవిశ్రాంతమైన శ్రమతో తమ జవసత్వాలను ధారపోసి వ్యవసాయ అభివృద్ధికి ఆధారభూతంగా నిలిచే కూలీలతో సంబంధం లేకుండా అన్నట్లుగా కేవలం రైతును మాత్రమే తెలుగు కవులు ఉన్నతీకరించారు. ఇలాంటి వేలం వెర్రి సాహిత్య తత్వాన్ని త్రోసిరాజని బడారైతుల పెత్తనాన్ని విమర్శించి దళిత పాలేరుల కృషిని ప్రస్తుతించాడు ధర్మన్న. ‘కడుపు గొట్టి నీదు కష్టార్జితములాగి/ గుణముధనము జెరచి కూడు తినుచు/ గొప్పవాడననచు నొప్పుచుండడె? రైతు’ అంటూ రైతుల ఉన్నతికి దళితుల పతనానికి కారణాలను విశ్లేషించాడు.
హైదరాబాద్ కేంద్రంగా దళిత విముక్తి కోసం చారిత్రాత్మకమైన పోరాటం చేసిన భాగ్యరెడ్డివర్మ స్ఫూర్తి, ఆయన స్థాపించిన ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, జీవరక్షా జ్ఞాన ప్రచార మండలి, మన్యసంఘాల పనితీరు, ఆ సంస్థల లక్ష్యాలు కుసుమ ధర్మన్న ఉద్యమ ప్రస్థానానికి ఎంతగానో దోహదపడ్డాయి. మాకొద్దీ నల్లదొరతనం గీతంలో తెలంగాణ దళిత సంస్కర్తలైన బాలముకుందు, రావిచెట్టు రంగారావు, పల్లాట శేషయ్య, ఆదయ్యలాంటి ఎంతో మంది సేవలను ధర్మన్న స్మరించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌ను కుసుమ ధర్మన్న గుండెలకు హత్తుకున్నాడని, నైజాంరాష్ట్ర సంస్కర్తల గురించి ధర్మన్న లాగా తెలంగాణవాళ్లు రికార్డు చేయలేదని సంగిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నాడు.
డాక్టర్ కోయి కోటేశ్వరరావు
(నేడు కుసుమ ధర్మన్న జయంతి సందర్భంగా మునిమనుమరాలు రాధా కుసుమ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో సాహితీ సమాలోచన,
గోరేటి వెంకన్న, బిక్కి కృష్ణలకు జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం)
Also Read:
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన.. విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. పుంగనూరు పోలీసులకు షాక్..
For More Telangana News and Telugu News..