Global Shifts: ఆ దోస్తీ భారత్‌కు మేలు చేసేనా?
ABN , Publish Date - Mar 15 , 2025 | 03:46 AM
ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి హక్కుల పత్రం మాగ్నాకార్టా అని విశ్వసిస్తారు. క్రీ.శ. 1215లో ఇంగ్లాండ్ రాజు దాన్ని అంగీకరించారు. ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంటుగా ఐస్‌లాండ్ దేశపు..

ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి హక్కుల పత్రం మాగ్నాకార్టా అని విశ్వసిస్తారు. క్రీ.శ. 1215లో ఇంగ్లాండ్ రాజు దాన్ని అంగీకరించారు. ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంటుగా ఐస్‌లాండ్ దేశపు అల్థింగ్ అని భావిస్తారు. క్రీ.శ.1262లో ఈ తొలి పార్లమెంటు నేర్పాటు చేశారు. ప్రథమ ద్విసభీయ శాసన వ్యవస్థ చరిత్ర బ్రిటన్‌లో క్రీ.శ.1341లో ప్రారంభమయింది. ప్రథమ లిఖిత రాజ్యాంగం శాన్‌మరినో రిపబ్లిక్‌ది. క్రీ.శ.1600 సంవత్సరం నుంచి ఇది అమల్లో ఉంది. అధికారాల విభజనకు ప్రేరణ ‘స్పిరిట్ ఆఫ్ లాస్’. ఫ్రెంచ్ తాత్వికుడు మోంటెస్క్యూ (1889–1775) రాసిన ఈ ఉద్గ్రంథం అమెరికా రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది. ఒక దేశ న్యాయ అధికారాలను మొట్టమొదట ఒక సుప్రీంకోర్టుకు అధీనం చేసిన దేశం అమెరికా. సెప్టెంబర్ 24, 1789న సమస్త న్యాయ అధికారాలను సుప్రీంకోర్టుకు అప్పగించారు.
రాజ్యాంగబద్ధమైన చరిత్ర ఉన్నతమైన, ప్రశంసనీయమైన పాఠాలు అన్నీ అమెరికా రాజ్యాంగంలో నిర్దిష్టంగా పొందుపరిచారు. భారత రాజ్యాంగ నిర్మాతలతో సహా అనేక దేశాలలో అమెరికా రాజ్యాంగాన్ని అనుకరించారు. యుద్ధాలు, పేదరికం, వ్యాధుల ముప్పుకు ఆస్కారం లేని కొత్త ప్రపంచ వ్యవస్థను నిర్మించేందుకు అమెరికా నాయకత్వంలో స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక దేశాలు మానవాళికి వాగ్దానం చేశాయి. ఆ లక్ష్య పరిపూర్తిలో అవి చాలవరకు సఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో గత మూడు సంవత్సరాలలో, ముఖ్యంగా జనవరి 20, 2025 నుంచి సంభవించిన, సంభవిస్తున్న పరిణామాలు ప్రపంచ ప్రజలను దిగ్భ్రాంతి పరిచాయి. భావావేశాలకు లోను చేస్తున్నాయి. సహేతుకమైన ప్రతిస్పందనలవి. ఎందుకంటే గత మూడేళ్ల పరిణామాలు ప్రపంచానికి ఎనలేని ముప్పు కలిగించేవిగా ఉన్నాయి. స్వార్థపరత్వం రాజ్యమేలే, నిరంకుశాధికార వ్యవస్థలు ప్రబలిపోయేందుకు ఆ పరిణామాలు దోహదం చేసేవిగా ఉన్నాయి.
అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష పదవి మహా శక్తిమంతమైనది. నిర్దిష్టమైన అధికారాలు, ప్రత్యేక అధికారాలతో పాటు అనిర్ణీత అధికారాలు కూడా ఆ పదవికి ఉన్నాయి. పైగా అమెరికా ప్రపంచ అగ్రగామి సంపన్న దేశం అనే వాస్తవం ఆ పదవికి మరింత ప్రాధాన్యాన్ని కల్పిస్తుంది. ఆ అధికారాలను ఉపయోగిచుకుని 19వ శతాబ్దిలో అధ్యక్షుడు విలియం మెక్ కిల్లే అమెరికాను భౌగోళికంగా విస్తరింపచేశాడు. ప్యూరిటో రికో, గువామ్, ఫిలిప్పీన్స్, హవాయిలను అమెరికాకు అనుసంధించాడు. ఇరవయో శతాబ్దిలో ఉడ్రో విల్సన్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ లు వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేశారు. తమ కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి విదేశీయులను నిర్బంధంలోకి తీసుకున్నారు. అలా అరెస్ట్ చేసిన వారిని బలవంతంగా స్వదేశాలకు పంపించివేశారు. రాజకీయ అసమ్మతివాదులను సైతం తీవ్రంగా అణచివేశారు. 21వ శతాబ్దిలో బరాక్ ఒబామా అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే లిబియాలో యుద్ధాన్ని ప్రారంభించాడు. యుద్ధ అధికారాల చట్టం–1973 కింద ఆయన స్వతంత్ర నిర్ణయం తీసుకున్నాడు ఇతర అధ్యక్షులు సైతం తమ పదవీ అధికారాల పరిమితులను తమ స్వతంత్ర నిర్ణయాలతో పరీక్షించారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం, చర్యలు చేపడుతూనే కాంగ్రెస్ అభిశంసన నుంచి తప్పించుకోగలిగారు.
అమెరికా అధ్యక్ష పదవి అధికారాలను మరే అధ్యక్షుడు కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నది 47వ అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్. గత ఎనిమిది దశాబ్దాలలో అమెరికా ఎన్నిమార్లు తన మామూలు విధానాలకు భిన్నంగా వ్యవహరించినప్పటికీ, ఎన్నిసార్లు దుస్సాహసాలకు పాల్పడినప్పటికీ స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక దేశాల నాయకుడుగా గౌరవాదరాలు పొందింది. సకల దేశాల ప్రజలు, ప్రభుత్వాలు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా అధ్యక్షుడి మాటను, ఆమోదించినా, ఆమోదించకపోయినా, ప్రాధాన్యమిచ్చారు. ప్రపంచ వ్యవస్థ భద్రతకు హామీపడ్డ దేశం అమెరికా. ప్రపంచ శాంతి సంరక్షణకు, విద్యావ్యాసంగాల వికాసానికి, ఆరోగ్య భద్రతకు, మానవ హక్కుల పరిరక్షణకు అమెరికా ప్రభుత్వం ఎన్నో అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పి, నిర్వహించింది. అయితే డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారానికి వచ్చిన రెండు నెలల లోగానే అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగింది; ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితికి, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి నిధులు నిలిపివేస్తామని, అసలు ఆ సంస్థ నుంచి ఉపసంహరించుకుంటామని అమెరికా బెదిరిస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు ఇప్పటికే యుఎస్ ఎయిడ్‌ను మూసివేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సహాయ కార్యక్రమాల అమలు పూర్తిగా నిలిచి పోయింది. అలాగే నాటో నుంచి కూడా వైదొలుగుతామని, యూరోపియన్ మిత్ర దేశాలకు గతంలో వలే ఎటువంటి సహాయ సహకారాలు అందించే ప్రసక్తి లేదని ట్రంప్ మహాశయుడే స్వయంగా ప్రకటించాడు.
డోనాల్డ్ ట్రంప్ విచిత్రమైన వ్యక్తి. స్నేహితుడు శత్రువు అయిపోయాడు (ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ), శత్రువు మిత్రుడు కావచ్చు (రష్యా అధ్యక్షుడు పుతిన్). పొరుగు దేశం సువిశాల కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా అభిలషిస్తున్నాడు. అమెరికాలో చేరమని గ్రీన్ ల్యాండ్‌కు బహిరంగంగా ఆహ్వానం పలికాడు. అంతటితో ఆగకుండా ఏదో ఒక విధంగా గ్రీన్ ల్యాండ్‌ను తమ దేశంలో కలుపుకుంటామని’ నర్మగర్భితమైన హెచ్చరికను ట్రంప్ జారీ చేశాడు.
డోనాల్డ్ ట్రంప్‌కు అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. శత్రువు (చైనా), మిత్రుడు (భారత్) మధ్య ఎటువంటి భేదాన్ని చూపరు. ‘నేను నా జీవితమంతా ఎన్నో ఒప్పందాలు చేసుకున్నాను’ అని ఆయన ఘనంగా చెప్పుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని చర్చలకు ఆహ్వానించి, అవమానపరిచి, పంపించివేసిన ట్రంప్ ‘ఒప్పందానికి సిద్ధమయినప్పుడే మళ్లీ వైట్‌హౌజ్‌కు రండి’ అని జెలెన్ స్కీని ఆహ్వానించాడు బహుశా, ఉక్రెయిన్‌లో లభించే అరుదైన ఖనిజ సంపద విషయమై ఒప్పందం కుదుర్చుకునేందుకు కాబోలు! రష్యాతో యుద్ధంలో సహాయపడుతున్నందుకు ఉక్రెయిన్ తన ఖనిజ సంపదను అమెరికాకు ఇవ్వాలన్నది ట్రంప్ వాదన మరి.
రాజనీతిజ్ఞతను వ్యాపార లావాదేవీగా మార్చి వేసిన ఘనత ట్రంప్‌దే అనడంలో సందేహం లేదు. అత్యంత శక్తిమంతమైన పదవిలో ఉన్న ఇటువంటి వ్యక్తితో ప్రపంచం ఏమవనున్నది? ట్రంప్ విధానాల పర్యవసానాలు మన దేశం విషయంలో ఎలా ఉంటాయి? ప్రపంచ స్థాయిలో చూస్తే నిరంకుశ పాలకులు అయిన ట్రంప్, పుతిన్, క్సి జిన్‌పింగ్‌లు తమ ప్రయోజనాలకు ఏకమయ్యే అవకాశమున్నది. వారు తాము కోరుకుంటున్న ఇరుగు పొరుగు దేశాలను స్వాధీనం చేసుకునేందుకు తప్పక ప్రయత్నిస్తారు. ట్రంప్ ఇప్పటికే పనామా కాలువ, కెనడా, గ్రీన్‌ల్యాండ్, గాజాపై కన్ను వేశారు; ఇప్పటికే క్రిమియా, అబ్కాజియా, దక్షిణ ఒస్సెటియాను కలిపివేసుకున్న రష్యా ఉక్రెయిన్‌ను కైవశం చేసుకోవడానికే యుద్ధానికి దిగింది. బహుశా జార్జియాను కలిపివేసుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఇక చైనా టిబెట్, హాంకాంగ్‌లను బలవంతంగా కలిపివేసుకుని ఇప్పుడు తైవాన్, భారత్‌లోని కొన్ని హిమాలయ ప్రాంతాలు, దక్షిణ చైనా సముద్రంలోని దీవులను కలిపివేసుకోవాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తోంది. దీన్ని ఆ దేశం ఏ మాత్రం దాచుకోవడం లేదు.
అమెరికా, రష్యా, చైనాలు ప్రపంచాన్ని ‘ప్రభావ ప్రాంతాలు’గా విభజించి తమ ప్రాబల్యంలో ఉన్న ప్రాంతాలలోని సహజవనరులను ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతమవుతాయి. ఈ దృష్ట్యా భారత్, చైనా దాడికి గురయ్యే అవకాశమున్నది. అరుణాచల్ ప్రదేశ్, ఇతర హిమాలయ ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే అమెరికా గానీ, రష్యా గానీ మనకు ఎటువంటి సహాయ సహకారాలు అందించవు. అమెరికా నుంచి మన దేశం మరింత ఎక్కువగా సైనిక సామగ్రిని కొనుగోలు చేసుకోవల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అలాగే అమెరికా నుంచి మరిన్ని వస్తూత్పత్తులను స్వల్ప సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి అంగీకరించవలసివస్తుంది. అమెరికా, రష్యాల సామరస్యం నెలకొంటే రష్యన్ చమురు సంపద మనకు చౌక ధరలకు ఇంకెంత మాత్రం అందుబాటులో ఉండదు. బ్రిక్స్, క్వాద్ కూటమి నుంచి మనకు పెద్దగా తోడ్పాటు లభించకపోవచ్చు. అమెరికా మద్దతుతో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు భారత్‌కు వ్యతిరేకంగా తమ ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ఠం చేసుకుంటాయి. ట్రంప్ సుంకాల సమరాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తే నియమబద్ధ ప్రపంచ వాణిజ్యం తలకిందులవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవుతుంది. జర్మనీ, ఫ్రాన్స్‌లు ఇప్పటికే గ్రహించినట్టుగానే భారత్ కూడా తనను తానే కాపాడుకోవల్సి ఉంటుంది. డోనాల్డ్ ట్రంప్ స్నేహం (దోస్తీ) భారత్‌కు బహుదా ఉపకరిస్తుందని నరేంద్ర మోదీ భావిస్తున్నారేమో కానీ అందుకు ఏ మాత్రం ఆస్కారం లేదు. ట్రంప్ స్వార్థపరుడు, అహంభావి. తన విధానాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోయినా ఆయన లెక్క చేయడు. మరో నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచానికి అన్నీ కష్టాలే, సందేహం లేదు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు)