RK Kothapaluku : రేవంత్ ‘ఫార్ములా’ ఏమిటో..!?
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:50 AM
ఫార్ములా–ఈ రేసు కంపెనీ కేసులో ఏమి జరగబోతోంది? మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసులో ఇరుక్కున్నారా? ఆయనను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేస్తుందా? చేస్తే ఎప్పుడు? ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ...

ఫార్ములా–ఈ రేసు కంపెనీ కేసులో ఏమి జరగబోతోంది? మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసులో ఇరుక్కున్నారా? ఆయనను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేస్తుందా? చేస్తే ఎప్పుడు? ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్రూవర్‌గా మారబోతున్నారా? తెలంగాణలో గత కొన్ని వారాలుగా ఈ ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్‌ను ఇప్పుడు అరెస్టు చేస్తారు.. అప్పుడు అరెస్టు చేస్తారు అని మీడియాలో ఊహాగానాలు చేస్తున్నారు. అయితే కేసు మాత్రం జీడి పాకంలా సాగుతోంది. ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అసలు అవినీతే జరగనప్పుడు కేసు ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎంత బలంగా తన వాదన వినిపిస్తున్నదో.. కేటీఆర్ కూడా అంతే బలంగా తన వాదన వినిపిస్తున్నారు. దీంతో అసలు ఇందులో కేసు ఉందా? ఉంటే కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఫార్ములా–ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు కట్టి విచారణ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్‌కు ప్రభుత్వం ఫైల్ పంపింది. ప్రభుత్వం అడిగింది కదా అని గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వలేదు. మొత్తం ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పంపి అభిప్రాయం చెప్పవలసిందిగా గవర్నర్ కోరారు. తుషార్ మెహతా సూచన మేరకు కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.
ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి అప్పటి అధికారులు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డితో పాటు కేటీఆర్‌ను కూడా విడివిడిగా విచారించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేసు నమోదు చేసుకొని ఈ ముగ్గురినీ విచారించారు. ఈ విచారణలో ఏం తేలింది? కేటీఆర్‌ను కేసులో ఇరికించే ఆధారాలు లభించాయా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే ఉంది. ప్రభుత్వం చెల్లించిన 55 కోట్లు తమకు అందాయని ఫార్ములా–ఈ కంపెనీ అంగీకరిస్తున్నందున ఇందులో అవినీతి జరిగిందని ఎలా చెబుతారు? అని తాను విచారణ అధికారులను ఎదురు ప్రశ్నించినట్టు కేటీఆర్ చెబుతున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కార్ రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయించి ఇబ్బందుల పాల్జేసింది. నాడు తనను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందున ఫార్ములా–ఈ రేసు కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారన్న అభిప్రాయం బలంగా వ్యాపించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టివేశాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు కొంత కాలంపాటు ఆయనకు రక్షణ కల్పించింది. దీంతో పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత ఆయనను అరెస్టు చేస్తారని అందరూ భావించారు. ఇలాంటి కేసులలో నిందితులు వెంటనే హైకోర్టుకు వెళ్లి బెయిలు కోరే అవకాశం లేకుండా శుక్రవారంనాడు అరెస్టు చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైనప్పుడు కేటీఆర్‌ను అరెస్టు చేస్తారని భావించారు. సెలవులు ముగిశాయి. కేటీఆర్ ఈడీ విచారణకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎప్పుడైనా కేటీఆర్‌ను అరెస్టు చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన లండన్ పర్యటనకు వెళ్లిన తర్వాత చంద్రబాబును అరెస్టు చేశారు. దీంతో సదరు అరెస్టుతో తనకు సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసిందని, పోలీసులు చట్ట ప్రకారం చంద్రబాబును ఎత్తారని జగన్‌రెడ్డి అప్పుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణలో ఈ సంఘటనను గుర్తుచేసుకొని ప్రస్తుతం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున కేటీఆర్‌ను కూడా రేపో మాపో అరెస్టు చేస్తారని ప్రచారం మొదలైంది. రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లి రెండు రోజులు దాటింది. దీంతో అసలు కేటీఆర్ అరెస్టు ఉంటుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రభుత్వం కేటీఆర్‌ను అరెస్టు చేయిస్తే రాజకీయంగా తమకు లాభిస్తుందని భారత రాష్ట్ర సమితి నాయకులు మరోవైపు లెక్కలు వేసుకుంటున్నారు. కేటీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసులో ఏముందో తెలియడం లేదు. ఆయన గుంభనంగా ఉంటున్నారు. మంత్రులు మాత్రం జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని అడపాదడపా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో మొత్తం వ్యవహారం ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా తయారవుతోంది.
‘క్విడ్ ప్రో కో’లో బలమెంత?
కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసులు కట్టి నెల రోజులు అయిపోయినా తదుపరి చర్యలు లేకపోవడంతో అసలు కేసులో బలం ఉందా? అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతాయి. సంబంధిత ఫైలును సొలిసిటర్ జనరల్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వవచ్చునని గవర్నర్‌కు సూచించినందున కేసులో బలం లేకుండా ఉంటుందా? అనే అనుమానం కూడా అదే సమయంలో ఉత్పన్నమవుతోంది. అవినీతి జరిగింది అనడానికి తగిన ఆధారాలు లేకపోతే ప్రభుత్వం ఇంత హడావిడి ఎందుకు చేస్తుంది? కేటీఆర్‌ను అరెస్టు చేయలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం అభాసుపాలవుతుంది కదా! ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాల్లోకి వెళదాం. ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు తొలుత త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఫార్ములా–ఈ కంపెనీతో పాటు గ్రీన్‌కో కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నవారు ఏర్పాటు చేసిన ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీ, ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కారు రేసు నిర్వహణ కోసం తగిన రోడ్లను అభివృద్ధి చేయడం, ఇతర ఏర్పాట్లను చేయడం మాత్రమే ప్రభుత్వం బాధ్యత. రేసు నిర్వహణకు అయ్యే ఖర్చును ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీ భరించాలి. ఈ ఖర్చును రాబట్టుకోవడం కోసం స్పాన్సర్స్‌ను వెదుక్కోవడం కూడా ఏస్ నెక్స్ట్‌జెన్ బాధ్యత. అయితే స్పాన్సర్లు లభించకపోవడంతో ఏస్ నెక్స్ట్‌జెన్ నష్టపోయింది. దీంతో ఫార్ములా–ఈ కంపెనీకి ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్మును ఈ కంపెనీ చెల్లించలేదు. ఈ క్రమంలో త్రైపాక్షిక ఒప్పందం అమలులో ఉండగానే ఫార్ములా –ఈ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో ఇది మొదటి తప్పు. ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ద్వారా 55 కోట్లు ఫార్ములా–ఈ కంపెనీకి చెల్లించింది. ఈ చెల్లింపుల విషయంలో హెచ్‌ఎండీఏ పాలక మండలి ఆమోదం పొందలేదు. పాలక మండలి చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. అదే సమయంలో ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందలేదు. మున్సిపల్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటే హెచ్‌ఎండీఏ ఎందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందనేది మరో ప్రశ్న. ఇవన్నీ పాలనాపరమైన లోపాలు. నిబంధనలు, బిజినెస్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగింది.
నాటి మంత్రి కేటీఆర్ మౌఖికంగా ఆదేశించడంతో తాము చెల్లింపులు చేశామని నిందితులైన అధికారులు విచారణ అధికారుల వద్ద చెప్పారు. ఇదే నిజమైతే మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను ఈ కేసులో ఇరికించడం కష్టం. మంత్రులు, ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి.. నోటి మాటగా ఎన్ని చెప్పినా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ముఖ్యమంత్రి లేదా మంత్రులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే అందుకు బాధ్యులైన అధికారులే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫార్ములా–ఈ కంపెనీకి డాలర్ల రూపంలో చెల్లించినందున ఫెమా చట్టం వర్తిస్తుంది. డాలర్ల చెల్లింపులో నిబంధనలు పాటించలేదన్నది మరో ఆరోపణ. ఈ కారణంగానే ఈడీ రంగంలోకి దిగింది. సవరించిన చట్టాల ప్రకారం విదేశాలలో చెల్లింపులు చేయాలంటే అందుకు సంబంధించిన పత్రాలు సవ్యంగా ఉన్నాయా? లేవా? అని బ్యాంకులు నిర్ధారించుకోవాలి. ప్రైవేటు కంపెనీలు విదేశీ మారకద్రవ్య రూపంలో చెల్లింపులు చేయాలన్నా కూడా బ్యాంకులు అన్ని పత్రాలనూ పరిశీలించిన మీదటే సొమ్ము బదలాయిస్తాయి. ఈ లెక్కన చూసుకుంటే విదేశీ మారకద్రవ్యం చెల్లింపుల్లో అవకతవకలు జరిగి ఉంటే అందుకు సంబంధిత బ్యాంకులు లేదా ఆథరైజ్డ్ బ్యాంక్ బ్రాంచీలు బాధ్యత తీసుకోవాలి. ఈ కారణంగానే హైదరాబాద్ ఇమేజ్‌ను కాపాడటం కోసం తాను చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించానని, అయితే నిబంధనల ప్రకారం చేయడం అధికారుల బాధ్యత అని కేటీఆర్ సమర్థించుకుంటున్నారు. ఫార్ములా–ఈ కంపెనీకి లభించిన సొమ్ము తిరిగి తనకు వేరే రూపంలో అందినట్టు ఆధారాలు లేనప్పుడు అవినీతి కేసు ఎక్కడిదని కేటీఆర్ దబాయిస్తున్నారు. అయితే ప్రభుత్వం వాదన మరో విధంగా ఉంది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామిగా ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీని ఎంపిక చేయడంలో కూడా అవకతవకలు జరిగాయని, కేవలం రెండు లక్షల ఈక్విటీతో ప్రారంభించిన కంపెనీ ఒక్క సీజన్‌కు 200 కోట్లు చెల్లించగలదని ఎలా నిర్ణయించారు? ఈ విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీ భాగస్వాములు అందరూ కేటీఆర్‌కు వ్యక్తిగతంగా సన్నిహితులు అని, వారిని కాపాడడానికే త్రైపాక్షిక ఒప్పందం అమలులో ఉండగానే ద్వైపాక్షిక ఒప్పందాన్ని తెర మీదకు తెచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రేసు విషయంలో ఏస్ నెక్స్ట్‌జెన్‌ను భాగస్వామిని చేయడానికి అంగీకరించినందునే గ్రీన్‌కో కంపెనీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు అందాయని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 41 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో గ్రీన్ కో కంపెనీ భారత రాష్ట్ర సమితి ఖాతాలో జమ చేసింది. ఇది క్విడ్ ప్రో కో కిందకే వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఫార్ములా–ఈ కంపెనీ నుంచి కేటీఆర్‌కు నేరుగా ముడుపులు ముట్టకపోయినా క్విడ్ ప్రో కో రూపంలో గ్రీన్‌కో కంపెనీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి నిధులు అందినందున కేటీఆర్ అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టేనని ప్రభుత్వ వర్గాల అభిప్రాయంగా ఉంది. ఈ వాదనలో హేతుబద్ధత ఉన్నప్పటికీ న్యాయ సమీక్షలో నిలబడుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కేసులో మొదటి భాగమైన చెల్లింపులు, నిబంధనల ఉల్లంఘనలో కేటీఆర్‌ను నేరుగా ఇరికించడం సాధ్యమా? అన్న సందేహం కలుగుతోంది.
మౌఖిక ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన నేరుగా బాధ్యులను చేయలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అంతా ఒక పథకం ప్రకారం జరిగిందని ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీ ఎంపికకు, భారత రాష్ట్ర సమితికి సంబంధం ఉందని, ఇందులో క్విడ్ ప్రో కో జరిగిందని రుజువు చేయగల పరిస్థితి ఉంటేనే కేటీఆర్‌ను కేసులో ఇరికించవచ్చు. ఈ కారణంగానే కేటీఆర్ అరెస్టులో జాప్యం జరుగుతూ ఉండవచ్చు. కేటీఆర్ తప్పు చేశారని నిరూపించడానికి అవసరమైన బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు చెబుతున్నారు. త్రైపాక్షిక ఒప్పందం గడువు ముగియక ముందే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీకి భారీ ఉపశమనం కలిగించడం తప్పిదమే. ఈ కంపెనీ బదులు హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడం కూడా నేరమే. అయితే ఈ రెండు సందర్భాలలో కేటీఆర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. అధికారులు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి మాత్రం కచ్చితంగా ఇరుక్కుంటారు. ఇక కేటీఆర్ కూడా ఇరుక్కుంటారా? ఆయన అరెస్టు అవుతారా? అన్నవి ప్రస్తుతానికి శేష ప్రశ్నలు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చేసరికి ఏమి జరుగుతుందో చూద్దాం!
ఏపీకి మంచి రోజులు!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం–బీజేపీ–జనసేన చేయి చేయి కలిపి నడవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకుని బలపడాలంటే కేంద్ర సహకారం పూర్తిగా అవసరం. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువిడుపులతో వ్యవహరిస్తున్నారు. కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. ఫలితంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టడానికి 11 వేల కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు కూడా సజావుగా పూర్తికావడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదారంగా వ్యవహరించారని చెప్పవచ్చు. కేంద్రంలో మోదీ సర్కార్ మూడవ పర్యాయం అధికారం చేపట్టడంలో తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకం. అలా అని తనకు లభించిన అవకాశాన్ని కేంద్రంపై పెత్తనం చేయడానికి కాకుండా రాష్ర్టానికి ప్రయోజనాలు పొందడానికి ఉపయోగించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం ఆయన పరిపక్వతకు నిదర్శనం. గతంలో కేంద్రంతో విభేదించినందున ఏం జరిగిందో ఆయనకు తెలుసు కనుక వాజపేయి సర్కారుకు బేషరతుగా మద్దతు ఇచ్చినట్టుగానే ఇప్పుడు మోదీ సర్కారుకు కూడా మద్దతు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి లోక్‌సభలో 16 మంది సభ్యులు ఉన్నారు. ఈ మాత్రం సంఖ్యా బలాన్ని సమకూర్చుకోవడం మోదీ ప్రభుత్వానికి కష్టం కాదు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వానికి తన విధేయతను ప్రకటించారు. ప్రస్తుతానికి చంద్రబాబు అవసరం ప్రధాని మోదీకి, మోదీ అవసరం చంద్రబాబుకు ఉంది. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నందున మూడు పార్టీల మధ్య సఖ్యత సజావుగా సాగుతోంది. ఈ సఖ్యత మునుముందు కూడా ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని భావించవచ్చు.
ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా భారీ ఆర్థిక ప్యాకేజీ లభిస్తున్నందున ఇందులో సందేహపడాల్సింది ఏమీ లేదు. అయితే ఈ సఖ్యతను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న శక్తులను విస్మరించకూడదు. పొత్తులో ఉన్న భాగస్వామ్య పార్టీలు సొంతంగా ఎదగాలని ప్రయత్నించడం సహజం. ఈ ప్రయత్నంలో భాగస్వామ్య పక్షాల మధ్య పొరపొచ్చాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. భాగస్వామ్య పక్షాల మధ్యనే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. 2019కి పూర్వం చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం కోసమే డబ్బంతా ఖర్చు చేస్తోందని ప్రచారం చేసి ఇతర ప్రాంతాల ప్రజల్లో అమరావతిపై వ్యతిరేకతను పెంచారు. ఇప్పుడు మళ్లీ అవే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వివిధ రూపాలలో ఉన్న మారీచులు రాజధాని అమరావతిపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం అవసరమా? అని అసంబద్ధ వాదనలు మళ్లీ తెర మీదకు తెస్తున్నారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఏమిటి? అని విష ప్రచారాన్ని మళ్లీ మొదలెట్టారు. ఈ క్రమంలో వాస్తవాలకు పాతర వేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాజధాని కోసం రైతులు స్పచ్ఛందంగా ముందుకు వచ్చి పూలింగ్ కింద ఇచ్చిన భూములే పెట్టుబడిగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు కేంద్రం కూడా పది వేల కోట్లకు పైగా గ్రాంట్‌గా ఇవ్వబోతోంది. తన నిర్మాణానికి అవసరమైన నిధులను తానే సమకూర్చుకోగల శక్తి రాజధాని అమరావతికి ఉంది. ఈ మోడల్‌ను రూపొందించిన చంద్రబాబును అభినందించాల్సిందే. గతంలో ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములను అంతర్జాతీయ కంపెనీలకు కేటాయించడం ద్వారా సైబరాబాద్ నగరానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తదుపరి ముఖ్యమంత్రులు కూడా అదే పని చేశారు. ఫలితంగా ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద నగరాలలో ఒకటిగా నిలబడింది. ఈ నగరం వల్ల వస్తున్న ఆదాయంతోనే తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయగలుగుతోంది. భవిష్యత్తులో అమరావతి కూడా హైదరాబాద్ స్థాయిలో కాకపోయినా గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అప్పుడు ఆ ఫలాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలూ అనుభవిస్తారు. మూడు రాజధానులు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ర్టానికి చేసిన నష్టం ఎంతో అందరికీ తెలిసిందే. కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తానని ప్రకటించి విశాఖపట్టణాన్ని చెరబట్టారు. ప్రైవేట్ కంపెనీలు, సంస్థలను హస్తగతం చేసుకున్నారు. భూములు కొల్లగొట్టారు. ఇప్పుడు రాజధాని అమరావతిలో కబ్జాలకు తావుండదు. ప్రతి సెంటు భూమికీ పక్కాగా లెక్క ఉంటుంది.
భూములు ఇచ్చిన రైతులకు పద్ధతి ప్రకారం ప్లాట్లు కేటాయిస్తున్నారు. మిగిలిన భూమిని గ్యారంటీగా చూపించి నిధులు సమకూర్చుకొని నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నారు. రాజధానిపై విషం చిమ్ముతున్న వారికి ఈ విషయం తెలియదా? తెలిసి కూడా విష ప్రచారం చేస్తున్నారంటే రాష్ర్టానికి ద్రోహం చేస్తున్నారనే భావించాలి. ఆర్థిక భారం లేనప్పుడు రాజధాని ఎలా ఉండాలో చెప్పే అధికారం వారికి ఏముంటుంది? పెద్ద నగరాన్ని నిర్మించడం వల్ల రాష్ట్ర ప్రజలపై భారం పడనప్పుడు ఈ మారీచులకు కడుపుమంట ఎందుకు? రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటింది. ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాల్సి రావడాన్ని మించిన విషాదం ఏమిటి? అమరావతి నిర్మాణానికి అడ్డుపుల్లలు వేస్తున్నవారి అంతరంగాన్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, పేదలకు సంక్షేమం అందాలన్నా మహా నగరాల నుంచి లభించే ఆదాయమే ప్రధానం. అమరావతి నిర్మాణం కోసం ఖర్చు చేసే ప్రతి పైసా నుంచి ప్రభుత్వానికి 20 శాతం వరకు పన్నుల రూపంలో వెనక్కు వస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిర్మితమవుతున్న నగరాన్ని అడ్డుకునేవారు ఎవరైనా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలి. ఈ కుటిల యత్నాలను తిప్పికొట్టని పక్షంలో కేంద్ర సహకారం ఉన్నా రాష్ట్రం బలపడలేదు. ఇదివరకు ఒకసారి మాయలో పడి నష్టపోయారు. మళ్లీ అదే పొరపాటు చేయవద్దు. తస్మాత్ జాగ్రత్త!
ఆర్కే