Share News

మహత్తర విజయం

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:32 AM

ఎనిమిదిరోజుల అంతరిక్ష యాత్రకని వెళ్ళిన సునీతా విలియమ్స్‌ బుచ్‌ విల్మోర్‌లు తొమ్మిదినెలల తరువాత తిరిగివచ్చారు. అంతరిక్ష కేంద్రం నుంచి పదిహేడు గంటల ప్రయాణం తరువాత...

మహత్తర విజయం

ఎనిమిదిరోజుల అంతరిక్ష యాత్రకని వెళ్ళిన సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు తొమ్మిదినెలల తరువాత తిరిగివచ్చారు. అంతరిక్ష కేంద్రం నుంచి పదిహేడు గంటల ప్రయాణం తరువాత, వాళ్ళను భద్రంగా దాచుకున్న స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ కాప్సుల్‌ ఫ్లోరిడా సముద్రజలాలను తాకి, కెరటాలమీద తేలుతున్న దృశ్యం చూసిన ప్రపంచజనం మనసులు ఆనందంతో పులకించిపోయాయి. వారి రాకను డాల్ఫిన్లు సైతం స్వాగతించాయంటూ సామాజిక మాధ్యమాలు మనసు పారేసుకున్నాయి. వారిద్దరూ చిక్కుకున్నారనో, తిరిగితేలేకపోయామనో అంటే నాసాకు మాచెడ్డ కోపం వస్తుంది కనుక, అనువైన కాలం కోసం ఇంతకాలం వేచివున్నట్టుగా దాని పరిభాషలోనే చెప్పుకోవాలి. మొన్నటివరకూ బైడెన్‌ అధ్యక్షుడుగా ఉండబట్టే వీరిద్దరూ అక్కడే ఉండిపోయారని, తాను రావడంతోనే వీరికీ కాలం కలిసొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. శాస్త్రవేత్తలిద్దరినీ కిందకు దించుతానని ప్రపంచానికి హామీ ఇచ్చి, స్పేస్‌ ఎక్స్‌ మస్క్‌కు బాధ్యత అప్పగించి, చెప్పింది చేసి చూపించానని ట్రంప్‌ చెప్పుకున్నారు. అధ్యక్షులవారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మస్క్‌ మందహాసం చేశారు. మాకు శాస్త్రమే తెలుసు తప్ప ఈ రాజకీయాలు పట్టవని నాసా ప్రతినిధి ఓ మాటన్నారు. యాభైతొమ్మిదేళ్ళ వయసులో సునీతావిలియమ్స్‌ చేసిన సాహసాన్ని మనసారా మెచ్చిన ఆమె తల్లి కూడా అదే అంటున్నది. ఎవరు ఏమైనా అనవచ్చు కానీ, ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సైన్స్‌ సాధించిన అద్భుత విజయం. యావత్‌ శాస్త్ర ప్రపంచం సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు మరింత శక్తినీ, యుక్తినీ, సమధికోత్సాహాన్ని అందించిన ఘట్టం.


తిరుగు ప్రయాణమవుతున్న తరుణంలో సునీత ఒక మాటన్నారు. అంతరిక్షం నుంచి చూస్తే భూగోళం మాత్రమే కనిపిస్తుంది, దేశాల మధ్య సరిహద్దులు కనబడవని. అంతరిక్ష కేంద్రంలో ఉంటూ, రోజుకు పదహారుసార్లు సూర్యోదయసూర్యాస్తమయాలను చూస్తున్నప్పుడు ఆమెకు ఇటువంటి భావనలనేకం కలిగివుంటాయి. హద్దులన్నీ మనిషి సృష్టించుకున్నవేనని అనిపించివుంటుంది. బోయింగ్‌ క్రూకాప్సుల్‌ పనితీరు అంచనావేయడానికి వెళ్ళి, ఎనిమిది రోజుల్లో వెనక్కురావాల్సిన వాళ్ళు, 286రోజులు చిక్కుబడిపోయి కూడా చెదరకుండా ఉండటం సామాన్యమైన విషయం కాదు. పదినిముషాలు నిరీక్షించాల్సివచ్చినా, ఎవరికోసమో ఎదురుచూడాల్సివచ్చినా, రోడ్డుమీద చిక్కుబడిపోయినా మనిషి విసిగెత్తిపోతాడు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు, ఆశించినది వెంటనే దక్కనప్పుడు నీరుగారిపోతాడు, లేదంటే వీరంగం వేస్తాడు. అటువంటిది భారరహిత స్థితిలో, కాళ్ళు గట్టిగా సాగదీసుకోవడానికి వీల్లేని ఒక అగ్గిపెట్టెలాంటి గదిలో, నాలుగడుగులు వేసిరావడానికి కుదరని నిర్బంధంలో అంతకాలం మనుగడసాగించాలంటే దేహదారుఢ్యం ఒక్కటే చాలదు. మనోనిబ్బరంతో సమస్యను ఎదుర్కోవడానికి, ఊహలో కూడా లేని ఇబ్బందిని అధిగమించడానికి, ఆ నిర్బంధస్థితిని సదవకాశంగా మలుచుకోవడానికి, సమయాన్ని సద్వినియోగపరచడానికి ఎంతో కర్తవ్యనిష్ఠకావాలి.


మనసు గాడితప్పకుండా, బుద్ధి తిరిగిపోకుండా నియంత్రణ, నిగ్రహం కావాలి. తమకు అప్పగించిన పనినేకాదు, అవాంతరాన్ని సైతం అవకాశంగా ఉపయోగించుకొని శాస్త్రవేత్తలు ఇద్దరూ మానవాళి శ్రేయస్సుకు ఉపకరించే పరిశోధనలు అనేకం చేశారు. నింగినుంచి నేలమీదకు దిగుతామన్న నమ్మకం ఒకదశలో పూర్తిగా నశించిపోయిన దశలో కూడా వారు చెదరలేదు. ఇరువురి ఆరోగ్యం బాగా పాడైందంటూ కొంతకాలంగా వచ్చిన వరుస విశ్లేషణల్లో ఎంత నిజం ఉన్నదో లేదో తెలియదు కానీ, ఇంతకాలం ఆకాశాన ఉండిపోయినందుకు సమస్త అవయవాలూ దుష్ప్రభావాన్ని చవిచూడటం సహజం. అయినా, నీటిమీదవాలిన అనంతరం కాప్సుల్‌ తలుపులు తెరుచుకోగానే ఆ శాస్త్రవేత్తల్లో వీసమెత్తు విచారం కానీ, బాధలూ భావోద్వేగాలు కానీ కనబడలేదు. చెరగని ఆ చిరునవ్వులు, విజయ చిహ్నాలు, కళ్ళలో కాంతులు, చక్కని పలకరింపులు చరిత్రలో నిలిచిపోతాయి. సురక్షితంగా భువికి దిగివచ్చిన శాస్త్రవేత్తలు సంపూర్ణ ఆరోగ్యంతో, పరిపూర్ణమైన ఆయుష్షుతో ఆనందంగా ఉండాలని కోరుకుందాం.

Updated Date - Mar 21 , 2025 | 03:49 AM