Share News

ట్రంప్‌ : మన కాలం పరాజితుడు

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:11 AM

డోనాల్డ్ ట్రంప్ 2025 ఏప్రిల్‌లో ప్రకటించిన సుంకాల విధానాలు, అమెరికాకు విదేశాల నుంచి వస్తున్న సరుకులపై భారీ పన్నులు విధించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు

ట్రంప్‌ : మన కాలం పరాజితుడు

నిఘంటువుల ప్రకారం ‘టారిఫ్‌’ (సుంకం) అనే పదం ఒక నామవాచకం. ఒక దేశంలోకి ఇతర దేశాల నుంచి వచ్చే సరుకులపై విధించే ఒక పన్ను. కొన్ని సమయాలలో ఎగుమతులపై కూడా ఒక పన్ను విధిస్తారు. చాలా అరుదుగా మాత్రమే ‘టారిఫ్‌’ను ఒక క్రియగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమా అని ఆ పదాన్ని క్రియగా ఉపయోగించడం అధికమయింది. కేవలం పెంగ్విన్‌ పక్షులు మాత్రమే ఉండే హేయర్డ్‌, మెక్‌ డోనాల్డ్‌ అనే దీవులతో సహా ప్రపంచ దేశాలు అన్నిటినీ ట్రంప్‌ మహాశయుడు దిగ్భ్రాంతికరంగా సుం కాలకు గురి చేశారు. పెంగ్విన్‌ పక్షులు అమెరికాకు ఎగుమతి చేసేవి ఏమి ఉంటాయని అవి ఉండే దీవులపై ట్రంప్‌ సుంకాలు విధించాడు? ప్రపంచ ప్రజలు నవ్వుకుంటున్న ట్రంప్‌ చర్య ఇది. అమెరికాకు దిగుమతి అయ్యే సరుకులపై కఠిన, భారీ సుంకాలు అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా రూపొందిస్తాయని (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌) ట్రంప్‌ విశ్వసిస్తున్నారు. ఏప్రిల్‌ 2, 2025న సకల దేశాలపై విధించిన సుంకాల వివరాలను ట్రంప్‌ ప్రకటించారు. సుంకాలను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఒక పెద్ద చార్ట్‌ను చూపించారు. సుంకాల సూక్ష్మాలు వెర్రి బాగులవాళ్లకు కూడా అర్థమయ్యే విధంగా ఒక సరళ సూత్రం ప్రాతిపదికన ఆ సుంకాలను అంచనా కట్టి ఉంటారని స్పష్టమయింది.


సదరు సూత్రం ఏదైనా దేశంతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటును లెక్కించారు. ఆ వాణిజ్య లోటును ఆ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మొత్తం విలువతో భాగించారు. ఆ వచ్చిన సంఖ్యను రెండుతో భాగించగా వచ్చిన ఫలితమే ట్రంప్‌ విధించిన సుంకం. కాగా కొన్ని దేశాల విషయంలో ఈ సరళ సూత్రాన్ని ఉపయోగించలేదు. 2024 అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలలో ఒక ప్రశ్నకు ఎనలేని ప్రాధాన్యం లభించింది: ఏడు స్వింగ్‌ స్టేట్స్‌నూ లేదా వాటిలో ఎక్కువ రాష్ట్రాలను ఎవరు గెలుచుకుంటారు? ఇవీ ఆ ఏడు రాష్ట్రాలు: అరిజోనా, జార్జియా, మిచిగాన్‌, నేవడా, ఉత్తర కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌. ఈ ఏడు రాష్ట్రాలనూ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుచుకున్నారు. తద్వారా 93 ఎలెక్టోరల్‌ ఓట్లను ఆయన స్వాయత్తం చేసుకున్నారు. ఈ ఏడు రాష్ట్రాలలో గెలుపు డోనాల్డ్‌ ట్రంప్ రెండో రాకడకు విశేషంగా దోహదం చేసింది. ఈ ఏడు రాష్ట్రాలకూ కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. అవి పారిశ్రామిక కార్యకలాపాలు చెప్పుకోదగిన స్థాయిలో లేకపోవడం, నిరుద్యోగిత భారీగా ఉండడం, ప్రజా చర్చలు అన్నీ ద్రవ్యోల్బణం వలసలు తదితర అంశాలపైనే జరగడం. ఈ ఏడు రాష్ట్రాలలోనూ తిరుగులేని విజయం సాధించిన ట్రంప్‌, ఆ రాష్ట్రాల ప్రజలను కలవర పెడుతున్న సమస్యలే సమస్త అమెరికా ప్రజలను చికాకు పరుస్తున్నాయని భావించారు. ఈ కారణంగా ఆయన ఆ సమస్యలను తొలగించేందుకు సంకల్పించారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై సంవత్సరాలు గడిచి పోయాయి. ఈ ఎనిమిది దశాబ్దాలలో కార్మిక శ్రేణుల, సరుకుల, సేవల స్వేచ్ఛా గమనం వల్ల ప్రపంచం బాగా లబ్ధి పొందింది.


ఇతోధికంగా ప్రయోజనం పొందిన దేశం నిస్సందేహంగా అమెరికాయే. అమెరికా మహా సంపన్న దేశం. మహాశక్తిమంతమైన దేశం. వైజ్ఞానిక, సాంకేతిక నవకల్పనలు అన్నీ ఆ దేశ ప్రతిభా ఫలాలే. ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, ఉత్కృష్ట కంపెనీలు అమెరికా లోనే ఉన్నాయి. అమెరికా డాలర్‌ రిజర్వ్‌ కరెన్సీగా ప్రపంచ దేశాల ఆమోదం పొందింది. అమెరికా గ్రీన్‌ కార్డ్‌, అమెరికా పాస్‌పోర్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆకాంక్షిస్తున్న డాక్యుమెంట్లు. చైనా, ఇండియాతో సహా అనేక దేశాలు తమ విదేశ మారక ద్రవ్య నిల్వలలో అత్యధిక భాగాన్ని అమెరికా బాండ్ల రూపంలో భద్రపరచుకుంటున్నాయి. ప్రపంచంలో ద్రవ్యలోటు లేని ఏకైక దేశం అమెరికాయే గనుక ఆ దేశ బాండ్లు తమకు ఆర్థిక భద్రత సమకూరుస్తాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. దురదృష్ట వశాత్తు ఈ ఉత్కృష్ట ఘనతలు ఏవీ తమ జీవితాలకు ఎలాంటి లబ్ధిని సమకూర్చడం లేదని ట్రంప్‌ను గెలిపించిన ఏడు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్‌ మహాశయుడు వాస్తవాలను ఉపేక్షించి ఆతన విజయానికి దోహదం చేసిన ఆ ఏడు రాష్ట్రాల ఓటర్లను విశ్వసించారు. అమెరికా అధ్యక్షుడుగా రెండో సారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డోనాల్డ్‌ ట్రంప్ నిర్ణయాలు, చర్యలు సంచలనం కలిగిస్తున్నాయి. వాటి పర్యవసానాలు సుదీర్ఘకాలం అమెరికా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్నాయి. దేశదేశాల నుంచి ప్రతిభావంతుల వలసలు అమెరికాకు నిలిచిపోనప్పటికీ తగ్గుముఖం పడతాయి. సరుకుల వాణిజ్యానికి గణనీయమైన విఘాతం కలుగుతుంది. సరఫరా గొలుసుల అంతరాయాలు పెరుగుతాయి. సేవల వాణిజ్యానికి సైతం కనీసం తాత్కాలికంగా నష్టం వాటిల్లుతుంది పెట్టుబడుల ప్రవాహాలు కొత్త సుంకాలు, ప్రతి సుంకాలకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు కొంత కాలం పడుతుంది. ట్రంప్‌ విధానాల పర్యవసానాలను ఎదుర్కోవడంలో చాలా సంపన్న దేశాలు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. ట్రంప్‌ ఏవో భ్రమలతో దబాయిస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. అమెరికాలోకి దిగుమతి అవుతున్న సరుకులపై భారీ సుంకాలతో సంభవించే ధరల పెరుగుదలను అమెరికా ప్రజలు భరించలేరు. ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుంది. లక్షలాది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమున్నది.


ఇటువంటి పరిస్థితులను అమెరికా ప్రజలు సహించరు. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ను విశ్వసిస్తున్న అమెరికన్లు కూడా ద్రవ్యోల్బణం తాకిడికి తీవ్రంగా గురవుతారు. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా అన్ని పెద్ద నగరాలలోను వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగినప్పుడు (ఇది ఖాయం) మరింత మంది ప్రజలు వీధుల్లోకి వెల్లువెత్తుతారు. అమెరికా ప్రజల ఆగ్రహావేశాలకు ట్రంప్‌ ఎలా ప్రతిస్పందించనున్నారు? తన విధానాల కొనసాగింపుపై వెనకడుగు వేస్తారు, సందేహం లేదు. ఏప్రిల్‌ 9న సుంకాల అమలును నిలిపివేసినట్టే ఇదీ జరుగుతుంది. కొన్ని అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకునే అవకాశమున్నది మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్న వారు సుంకాల పర్యవసానాలకు ఎలా ప్రతిస్పందిస్తారు, అమెరికా బాండ్లపై వడ్డీ రేట్ల తీరుతెన్నులను ఆయన తప్పక పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. సరే, ట్రంప్‌ సుంకాల దెబ్బను ముఖ్యమైన దేశాలు కొన్ని ఎలా ప్రతి స్పందిస్తున్నాయో చూద్దాం. కెనడా, యూరోప్‌ గట్టిగా నిలబడ్డాయి, దృఢంగా ప్రతిఘటిస్తున్నాయి. అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయి. అమెరికాపై భారీ సుంకాలు విధించేందుకు చైనా గట్టి పట్టుదలతో ఉన్నది. సుంకాల సమరాన్ని అమెరికా అనివార్యం చేస్తే, చైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. రాజీ లేని పోరుకు బీజింగ్‌ సమాయత్తమై ఉన్నది. ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంపై భారత్‌ ఇంతవరకూ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మంచిదే.


అయితే ట్రంప్‌ ధాటికి ఇండియా హడలి పోతున్నదనే భావన ప్రపంచానికి కలిగించ కూడదు. మోదీ ప్రభుత్వం ఈ విషయమై జాగరూకతతో వ్యవహరించాలి. ట్రంప్‌ సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏమి సంభవించినా తాము కలత చెందమనే భావంతో ఉండి పోకూడదు. ట్రంప్‌ నిర్ణయాలు, చర్యలపై న్యూఢిల్లీ కచ్చితంగా ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. యూరోపియన్‌ నాయకులు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌, కెయిర్‌ స్టార్మెర్‌, కెనడా ప్రధానమంత్రి కార్నే తదితర నాయకులు అనుసరిస్తున్న విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. వారితో కలిసి నడవడం శ్రేయస్కరం. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించడంతో అందరూ సంతోషిస్తున్నారు. ఈ యుద్ధ విరామంతో, ఆయనను ఆర్థిక వివేకం ప్రభావితం చేయగలదనే ఆశాభావం ఎంతైనా కలుగుతోంది. అయితే ఈ ‘నిలిపివేత’ను ఉపసంహరించి, ఏప్రిల్‌ 2న ప్రకటించిన సుంకాలను ట్రంప్‌ మళ్లీ విధిస్తే జరిగేదేమిటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులు అవుతుంది, సందేహం లేదు. ట్రంప్‌ విధానాలతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెడుతోందని ఆర్థికవేత్తలు చాలా మంది గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మాంద్యం ముంచుకు వస్తోందని కూడా పలువురు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇండియా పరిస్థితి ఏమిటి? మాంద్యం, ద్రవ్యోల్బణం, ఎగుమతుల తగ్గుదల, తక్కువ ఎన్‌పిఐ (విదేశీ ప్రైవేట్‌ పెట్టుబడులు), తక్కువ ఎఫ్‌డిఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) ఒకేసారి సంభవిస్తే వాటిల్లే హాని కంటే కూడా మన ఆర్థిక వ్యవస్థ అధ్వానమవుతుంది. భారత్‌ తన మిత్ర దేశాలను ఎంపిక చేసుకోవాలి. వాటితో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలి అంతిమంగా అర్థ శాస్త్ర సూత్రాలు ట్రంప్‌ విధానాలను ఓడిస్తాయి. ఆ విజయోత్సవ వేళ, భారత్‌ పరాజితుడి పక్షాన నిలిచిందనే భావన ఎవరికీ కలగ కూడదు.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Apr 12 , 2025 | 02:16 AM