Vaniya Agrawal: హౌ డేర్ యు.. మైక్రోసాఫ్ట్ అధినేతలకి భారత సంతతి ఉద్యోగిని వార్నింగ్
ABN , Publish Date - Apr 07 , 2025 | 09:12 PM
ఆమె పేరు వానియా అగర్వాల్. మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని. ఈమె భారత సంతతికి చెందినామె. అయితే, ఈమె చేసిన పని మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు సత్య నాదెళ్ల, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ లను ఉలిక్కిపడేలా చేసింది.

"హౌ డేర్ యు" అంటూ సాక్షాత్తూ అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేతల్నే ప్రశ్నించింది ఒక మహిళ. అదీ పబ్లిగ్గా.. కంపెనీకి చెందిన మహామహుల సమక్షంలో. ఈమె ఎవరో కాదు.. భారత సంతతికి చెందిన ఇండో-అమెరికన్. మైక్రోసాఫ్ట్ కంపెనీ 50వ వార్షికోత్సవాల సందర్భంగా జరుగుతున్న మీటింగ్ లోనే పబ్లిక్గా కంపెనీ నిర్ణయాలను, కార్యాచరణను తూర్పారబడుతూ కంపెనీ అధినేతలపై ఫైర్ అయింది. వివరాల్లోకి వెళ్తే, వానియా అగర్వాల్(Vaniya Agrawal) మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగిని. కంపెనీ నిర్ణయాలు నచ్చక తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంతకీ ఆమె కంపెనీ మీద చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే.. గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థ సాంకేతికంగా సహాయ సహకారాలు అందిస్తోందన్నది ఆమె అభియోగం.
మైక్రోసాఫ్ట్ కంపెనీ తన టెక్నాలజీ ద్వారా హింసను ప్రేరేపిస్తోందని వానియా అగర్వాల్ ఆరోపిస్తున్నారు. గాజా(Gaza)పై ఇజ్రాయెల్(Israel) చేస్తున్న యుద్ధానికి టెక్ దిగ్గజం మద్దతు ఇవ్వడంపై CEO సత్య నాదెళ్ల(CEO Satya Nadella), కంపెనీ మాజీ CEOలు బిల్ గేట్స్(Bill Gates), స్టీవ్ బాల్మెర్(Steve Ballmer)లపై వానియా విరుచుకుపడ్డారు. "గాజాలో యాభై వేల మంది పాలస్తీనియన్లను మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో హత్య చేశారు. మీకు ఎంత ధైర్యం. వారి రక్తంపై సంబరాలు చేసుకోవడం మీ అందరికీ సిగ్గుచేటు" అని శ్రీమతి అగర్వాల్.. సత్య నాదెళ్ల, బిల్ గేట్స్, బాల్మెర్ లను ఏకబిగిన ప్రశ్నించారు.
అంతేకాదు, మైక్రోసాఫ్ట్‌ను "డిజిటల్ ఆయుధాల తయారీదారు" అని పిలుస్తూ, కంపెనీ తన టెక్నాలజీ ద్వారా హింసకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. సభకు అంతరాయం కల్గిస్తున్నందుకు మరో మహిళ వానియా అగర్వాల్ ను హాల్ నుండి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగని వానియా అగర్వాల్ వెళ్లే ముందు మరిన్ని కామెంట్లు చేశారు. తక్షణమే మైక్రోసాఫ్ట్ కంపెనీని ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో $133 మిలియన్ల ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ సంస్థ సంతకం చేసి, పాలస్తీనియన్ల(Palestinians)పై సైనిక చర్యలలో మైక్రోసాఫ్ట్ సహకరిస్తోందని వానియా ఆరోపించారు. ఇందుకోసం కంపెనీ AI, అజూర్ టెక్నాలజీలను ఉపయోగించారని విమర్శించారు.
అంతేకాదు, తాను రాజీనామాను ప్రకటించే ముందు మరిన్ని వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రమేయం ఉందని ఆరోపించిన ఆమె, వారి సహోద్యోగులు కూడా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.
ఇక, ఆమె సమర్పించిన తన రాజీనామాలో లేఖలో ఏం పేర్కొన్నారంటే, "ఈ హింసాత్మక దారుణాలలో పాల్గొనే కంపెనీలో నేను నా మంచి మనస్సాక్షితో భాగం కాలేను.. మీరు మైక్రోసాఫ్ట్‌లో పని చేయడం కొనసాగించాల్సి వస్తే, మైక్రోసాఫ్ట్‌ను దాని స్వంత విలువలు, జవాబుదారీగా ఉంచడానికి మీ స్థానం, అధికారం, ఇంకా మీ ప్రత్యేకతను ఉపయోగించండని నేను మిమ్మల్ని కోరుతున్నాను" అని ఆమె అన్నారు.
అయితే, శ్రీమతి అగర్వాల్ వ్యాఖ్యలపై స్టేజ్ మీద ఉన్న ప్యానెల్ మెంబర్లు అస్సలు స్పందించలేదు. వానియా అగర్వాల్‌ను బలవంతంగా బయటకు తీసుకెళ్లిన తర్వాత తమ చర్చను తిరిగి ప్రారంభించారు. ఇలా ఉండగా, అంతకుముందు కూడా ఇబ్తిహల్ అబౌస్సాద్ అనే ఒక ఉద్యోగి ఇదే ఆరోపణలు చేస్తూ కంపెనీకి రాజీనామా సమర్పించి కంపెనీ ఏఐ సీఈవో సులేమాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవీ చదవండి:
సన్‌రైజర్స్‌ను ఓడిస్తున్న కమిన్స్
పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి