Share News

USA News: న్యూఓర్లీన్స్‌లో దారుణం.. న్యూ ఇయర్ జరుపుకుంటున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. 10 మంది మృతి..

ABN , Publish Date - Jan 01 , 2025 | 07:55 PM

అమెరికాలోని న్యూఓర్లీన్స్‌లోని బోర్బన్ స్ట్రీట్‌లో, ఐబర్ విల్లే కూడలి దగ్గర బుధవారం తెల్లవారుఝామున 3:15 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ కారు సంబరాల్లో మునిగి ఉన్న వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏకంగా పది మందికి పైగా చనిపోయారు.

USA News: న్యూఓర్లీన్స్‌లో దారుణం.. న్యూ ఇయర్ జరుపుకుంటున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. 10 మంది మృతి..
New Orleans terror attack

కొత్త సంవత్సర వేడుకలను ఎంతో సంతోషంగా, సంబరంగా జరుపుకుంటున్న ప్రజల పైకి దూసుకెళ్లిన ఓ కారు (Car) దారుణ మారణహోమానికి కారణమైంది. అమెరికా (America)లోని న్యూఓర్లీన్స్‌లోని బోర్బన్ స్ట్రీట్‌లో, ఐబర్ విల్లే కూడలి దగ్గర బుధవారం తెల్లవారుఝామున 3:15 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ కారు సంబరాల్లో మునిగి ఉన్న వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏకంగా పది మందికి పైగా చనిపోయారు. షాకింగ్ విషయం ఏంటంటే.. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటన కాదు (New Orleans terror attack).


ఓ వ్యక్తి కావాలనే న్యూఇయర్ వేడుకల్లో (New Year) మునిగి ఉన్న ప్రజల మీదకు కారును వేగంగా తీసుకెళ్లాడు. అనంతరం డ్రైవర్ కారు కిందకు దిగి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పది మందికి పైగా చనిపోయినట్టు, 30 మంది గాయపడినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది తీవ్రవాద ఘటన అని పోలీసులు భావిస్తున్నారు. సమీపంలోని ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభించినట్టు సమాచారం. కాగా, న్యూ ఓర్లీన్స్ మేయర్ ఈ ఘటనను తీవ్రవాద చర్యగా అభివర్ణించారు.


న్యూ ఓర్లీన్స్‌లోని బోర్బన్ స్ట్రీట్ బార్లు, క్లబ్‌లతో నిండి ఉంటుంది. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకునేందుకు వందల మంది డిసెంబర్ 31వ తేదీ రాత్రి అక్కడకు చేరుకున్నారు. ఇటీవల జర్మనీలో కూడా ఇదే తరహా దుర్ఘటన జరిగింది. జర్మనీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ప్రజల మీదకు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి పైగా మరణించారు. 200 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 01 , 2025 | 07:57 PM