Share News

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:47 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈసారి మరింత సెగలు కక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ సమావేశాల ముంగిట్లోనే జరిగిన మహా కుంభమేళా విషాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపక్షాల నుంచి వచ్చిన ఒక్క సిఫారసునూ పరిగణించకుండానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బిల్లును సిద్ధం చేసేసింది. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు అంశాలపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేయనున్నాయి. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీని తాలూకూ ప్రమాద ఘంటికలు మోగాయి.

Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Parliament Budget Session 2025

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

అఖిలపక్ష భేటీలో రణగొణ ధ్వనులు

కుంభమేళాలో తొక్కిసలాట, వక్ఫ్‌ బిల్లులో దూకుడుపై విపక్షం ఫైర్‌

వైసీపీ పక్కన మాకు సీట్లా?.. టీడీపీ ఆందోళన

విభజన హామీలపై దృష్టి పెట్టాలన్న దేశం,సేన

బడ్జెట్‌ భేటీలోనే పార్లమెంటుకు వక్ఫ్‌ బిల్లు

న్యూఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈసారి మరింత సెగలు కక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ సమావేశాల ముంగిట్లోనే జరిగిన మహా కుంభమేళా విషాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపక్షాల నుంచి వచ్చిన ఒక్క సిఫారసునూ పరిగణించకుండానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బిల్లును సిద్ధం చేసేసింది. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు అంశాలపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేయనున్నాయి. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీని తాలూకూ ప్రమాద ఘంటికలు మోగాయి. వక్ఫ్‌ బిల్లుపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ లేకుండా ముందుకు వెళ్లరాదని ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ స్పష్టం చేసింది. బిహార్‌కు భారీ పారిశ్రామిక ప్యాకేజీ ప్రకటించాలని మరో మిత్రపక్షం లోక్‌ జనశక్తి (పశ్వాన్‌) డిమాండ్‌ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం కింద అపరిష్కృత అంశాలను పరిష్కరించాలని తెలుగుదేశం, జనసేన కోరాయి. తమకు ఎక్కడో చివరన సీట్లు కేటాయించారని, వైసీపీ ఎంపీల పక్కన సీట్లు కేటాయించడం సరైంది కాదని టీడీపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ సహా పలు పార్టీల తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, బీద మస్తాన్‌రావు, జనసేన ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు.

j.jpg


తొందర పడొద్దు : జేడీ (యూ)

జమిలి ఎన్నికల బిల్లును తొందరపాటుతో ప్రవేశపెట్టరాదని, విస్తృత సంప్రదింపులు జరపాలని జేడీయూ ఎంపీ సంజయ్‌ కుమార్‌ సూచించారు. ఈ బిల్లును ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే. డీప్‌ సీక్‌ వల్ల ఏర్పడిన పరిస్థితిపై చర్చించాలని కోరారు.

భారీ సాయం ప్రకటించండి : లోక్‌జనశక్తి

బిహార్‌ తలసరి ఆదాయానికి, జాతీయ సగటుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, ప్రత్యేక ప్యాకేజీని కేటాయించి ఆదుకోవాలని చేయాలని లోక్‌ జనశక్తి (రాంవిలాస్‌ )ఎంపీ అరుణ్‌ భారతి డిమాండ్‌ చేశారు. రిజర్వుడు కేటగిరీలో సరైన వ్యక్తులు దొరకడం లేదనే నెపంతో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయరాదని ఆయన కోరారు.

మాకు వెనుక సీట్లు ఇస్తారా? : టీడీపీ

ఎంపీల సీట్లను ఇష్టం వచ్చినట్లు కేటాయించారని కాంగ్రెస్‌ నేత గొగోయ్‌ అనగా, తెలుగుదేశం కూడా తమకు సీట్ల విషయంపై ఇబ్బందిగా ఉన్నదని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి సీనియర్‌ నేతలను కూడా వెనుక బెంచికి పరిమితం చేశారని దగ్గుమళ్ల చెప్పారు. మహాకుంభమేళాలో వీవీఐపీ సంస్కృతి, నిర్వహణ లోపాల వల్లే తొక్కిసలాట జరిగిందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ అన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులంతా సమర్థించారు. మృతుల కుటుంబాలకు మరింత నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.


వీవీఐపీల వల్లే కుంభమేళా విషాదం : ఎస్పీ

వక్ఫ్‌ బిల్లు జేపీసీలో నిబంధనలు పాటించలేదని, చైర్మన్‌ జగదంబికా పాల్‌ అప్రజాస్వామికంగా వ్యవహరించారని డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, టీఎంసీ ఎంపీ బందోపాధ్యాయ విమర్శించారు. స్థాయూ సంఘాల్లో అధికార పార్టీ సభ్యులకే ఎక్కువ స్థానం కల్పించారని వామపక్ష నేత బ్రిటాస్‌ ఆరోపించారు. ఒక ఎంపీకి ఒక స్టాండింగ్‌ కమిటీ కేటాయించాలన్న నిబంధనను తుంగలో తొక్కి ఒక్కో అధికార పార్టీ ఎంపీకి పలు స్టాండింగ్‌ కమిటీలు కేటాయిస్తున్నారని, 29 మంది బీజేపీ ఎంపీలు వివిధ కమిటీల్లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. వీరు ప్రతిపక్ష సభ్యులను చర్చించకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. కాగా సభ సజావుగా జరిగేందుకు సహకరించాల్సిందిగా కోరినట్లు కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజూ తెలిపారు. శుక్రవారం రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. సోమవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చ పూర్తయిన తర్వాత బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది.

బడ్జెట్‌ సమావేశాల్లో 16 బిల్లులు

బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక బిల్లు-2025, వక్ఫ్‌ సవరణ బిల్లు సహా 16 బిల్లులను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. వీటిలో బ్యాంకుల నియంత్రణ చట్టం సవరణ బిల్లు, భారతీయ రైల్వేలు, భారతీయ రైల్వేల బోర్డు విలీన చట్టం, విపత్తు నిర్వహణ, చమురు క్షేత్రాల(నియంత్రణ, అభివృద్ధి), విమానయాన రంగం ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ, పరిశ్రమల్లో బాయిలర్ల సురక్షిత నిబంధనలు, నౌకాయాన తదితర బిల్లులు ఉన్నాయి.


నకిలీ వార్తలు, పెయిడ్‌ న్యూస్‌పై నేడు చర్చ!

పెయిడ్‌ న్యూస్‌, నకిలీ వార్తలు ఎక్కువగా వస్తుండటం, అనేక టీవీ న్యూస్‌ చానళ్లు సంచలనాలపై దృష్టి కేంద్రీకరించడం, సాంప్రదాయ వార్తా పత్రికలు రీడర్‌షిప్‌ తగ్గిపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్న అంశాలు శుక్రవారం పార్లమెంటరీ కమిటీలో చర్చకు రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే నేతృత్వంలోని కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ అన్ని రకాల మీడియాలకు సంబంధించిన చట్టాల అమలును సమీక్షించనుంది. కొన్ని చానళ్లు టీఆర్పీ రేటింగ్‌ కోసం సన్సేషన్లు సృష్టించే ఆలోచనతో ముఖ్యమైన వార్తలను పణంగా పెట్టి క్రైమ్‌, సెలబ్రిటీ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని సమావేశంలో చర్చించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సంచలన కేసుల్లో మీడియా విచారణ, లీగల్‌ ప్రక్రియపై దాని ప్రభావం తదితరాలపైనా కమిటీ చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. జర్నలిస్టులు, మీడియా సంస్థలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న న్యాయపోరాటాలు పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఏ విధంగా నిరుత్సాహపరుస్తున్నాయి, ప్రాంతీయ, స్థానిక మీడియా ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ప్రత్యేకించి ఎన్నికల సమయాల్లో నకిలీ వార్తలు సృష్టిస్తున్న గందరగోళం తదితరాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమాచార ప్రసారమాధ్యమాలశాఖ కార్యదర్శి, ప్రసారభారతి సీఈవో, ప్రెస్‌ రిజిస్ర్టార్‌ జనరల్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ తదితర కీలక వ్యక్తులు కమిటీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కార్యకలాపాలు కూడా కమిటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ’

విభజన హామీలపై చర్చించాలని కోరాం: టీడీపీ ఎంపీలు

విభజన హామీలను నెరవేర్చాలని, బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. పోలవరం, అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం అందించాలని విన్నవించామని టీడీపీ తరపున రాజ్యసభలో ఫ్లోర్‌ లీడర్‌ బీద మస్తాన్‌రావు, లోక్‌సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. టీడీపీ ఎంపీలకు సీట్లను ఒకే చోట కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, సీనియర్‌ ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరామని దగ్గుమళ్ల తెలిపారు. టీడీపీ యువ ఎంపీలకు చర్చలలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరామన్నారు. తమ పార్టీకి కేటాయించిన సమయాన్ని పూర్తిగా తాము వినియోగించుకునేందుకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ప్రభావం చూపే అంశాలపై పార్లమెంటులో చర్చ చేయాలని కోరినట్లు ఎంపీ దగ్గుమళ్ల తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 09:11 AM