Delhi Assembly Election Result 2025 Live: ఎస్సీ, ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్.. అసలు కారణం ఇదే..
ABN, Publish Date - Feb 08 , 2025 | 11:39 AM
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుపు ఖాయం చేసుకుంది బీజేపీ. అయితే, ఆప్ ఘోర పరాజయానికి అసలు కారణం ఇదే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హవా చూపిస్తోంది భారతీయ జనతా పార్టీ. 'వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర' మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేసింది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకునే దిశగా దూసుకెళుతోంది. ఆప్ పార్టీ మాత్రం 30 స్థానాల్లోపే ఆధిక్యం ఊగిసలాడుతూ ఉంది. గతంలో భారీ మెజారిటీతో గెలిచిపించిన ఎస్సీ, ముస్లిం నియోజకవర్గాల్లోనూ 'కేజ్రీవాల్ కీ గ్యారెంటీ ' పనిచేయలేదు. 70 స్థానాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని నిలబెట్టుకపోయినా బీజేపీ ముస్లిం ఓటర్లను ఎలా ఆకర్షించిందని తలలు పట్టుకుంటున్నారు ఆప్ పార్టీ నేతలు. అందుకు కారణమిదే అని తెలుస్తోంది.
ముస్లిం, ఎస్సీ స్థానాల్లో బీజేపీదే హవా..
కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు తర్వాత ఆప్ పార్టీకి అండదండగా ఉన్నారు. ఈ సారి మాత్రం ఆ రెండు పార్టీలను కాదని కమలం పార్టీ వైపు నిలబడ్డారు. మొత్తం ముస్లిం ఓటర్ల కీలకంగా ఉన్న 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది బీజేపీ. ఇప్పటికే ముస్తఫాబాద్ స్థానంలో మోహన్ సింగ్ బిష్త్ దాదాపుగా విజయం ఖాయం చేసుకున్నారు. 70 స్థానాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకుండానే ముస్లిం ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకోవడం విశేషం. బవానా, గోక్లాపుర్, మాదీపుర్, మంగోల్ పురి వంటి ఎస్సీ నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీతో దూసుకుపోతోంది.
ఈ ఓటర్లపై పనిచేయని 'కేజ్రీవాల్ కీ గ్యారెంటీ '
ఇప్పటివరకూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో ముఖ్యపాత్ర పోషించింది మహిళలు, ముస్లింలు, సిక్కుల ఓట్లే. 70 అసెంబ్లీ స్థానాల్లో 19 సీట్లలో స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టిన ఈ ఓటర్లు ఈ సారి 'కేజ్రీవాల్ కీ గ్యారెంటీ 'ని విశ్వసించకపోవడానికి ప్రధాన కారణం యమునా నది స్వచ్ఛతే అని టాక్. 2020లో స్వచ్ఛ యమునా నినాదంతో ఓటర్లను ఆకట్టుకుని గద్దెనెక్కిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కూడా. ఎన్నికల ప్రచారంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య నడిచిన వార్ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవటమూ ఓటర్లను ప్రభావితం చేసింది. క్రితం సారి ఈ 19 నియోజకవర్గాల్లో 30-35 ఉన్న ఓటు బ్యాంకునూ పెంచుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా కృషి చేసింది.
'వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర'తో ఓటర్ల మనసు గెల్చుకుంది..
ఇండియా కూటమి నుంచి వేర్వేగా కాంగ్రెస్, ఆప్ పోటీపడితే బీజేపీ గెలుపుకు బాటలు వేసినట్లే అని ముందు నుంచే అంతా ఊహిస్తున్నారు. ఈ రోజు వెలువడిన ఫలితాలు అందుకు భిన్నంగా ఏం లేవు. 'వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర'లో మహిళా సమృద్ధి యోజన, పేదలకు, 60 ఏళ్లు పైబడిన వారికి రూ.10లక్షల ఆరోగ్య బీమా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎల్ పీజీ సిలిండర్లపై రూ.500లపై సబ్సిడీ వంటి హామీలు గుప్పించి ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకుంది బీజేపీ. ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌లో రూ.12లక్షల వరకూ ఆదాయం వరకూ ఉన్నవారికి నో ట్యాక్స్ అంటూ ప్రకటించడం మధ్యతరగతి ఓటర్లపై బాగానే పనిచేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
Updated Date - Feb 08 , 2025 | 12:58 PM