Share News

Marriage: పెళ్లితో మగవాళ్లు లావెక్కుతారు!

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:08 AM

వివాహం కాని వారితో పోలిస్తే.. పెళ్లయిన పురుషుల్లో అధిక బరువు ప్రమాదం 62 శాతం ఎక్కువగా ఉంటుందని పాలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ పరిశోధకులు వెల్లడించారు. మహిళల్లో 39 శాతం మాత్రమే ఉంటుందని అధ్యయనంలో పేర్కొన్నారు.

Marriage: పెళ్లితో మగవాళ్లు లావెక్కుతారు!

‘సింగిల్స్‌’తో పోలిస్తే వివాహమైన వాళ్లలో 62 శాతం అధిక బరువు ప్రమాదం

ఇది మహిళల్లో 39 శాతం మాత్రమే

వార్సా పరిశోధకుల అధ్యయనం వెల్లడి

పెరిగే ఆహార పరిమాణం, శారీరక శ్రమ లేకపోవడమే కారణమంటున్న నిపుణులు

వార్సా, మార్చి 14: ‘అరే ఏంట్రా.. పెళ్లికి ముందు సన్నగా ఉండే వాడివి.. ఇంత లావు అయ్యావు..?’ ఇలాంటి మాటలను తరచుగా వింటుంటాం. మనలోనే చాలా మందికి ఈ ప్రశ్న ఎదురై ఉంటుంది. ఇది వాస్తవమేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. వివాహం కాని వారితో పోలిస్తే.. పెళ్లయిన పురుషుల్లో అధిక బరువు ప్రమాదం 62 శాతం ఎక్కువగా ఉంటుందని పాలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ పరిశోధకులు వెల్లడించారు. మహిళల్లో 39 శాతం మాత్రమే ఉంటుందని అధ్యయనంలో పేర్కొన్నారు. పెళ్లి పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనం వెల్లడించింది. అధిక బరువు అనేది వయస్సుతో ప్రభావితమవుతుందని గుర్తించారు.


వివాహంతో 3 రెట్ల ఊబకాయం రిస్క్‌!

పరిశోధకులు మల్లీ-సెంటర్‌ నేషనల్‌ పాపులేషన్‌ హెల్త్‌ ఎగ్జామినేషన్‌ సర్వే నుంచి 2,405 మంది డేటాను పరిశీలించారు. వారి 50 ఏళ్ల వయస్సులో 35.3 శాతం మంది సాధారణ బరువు కలిగి ఉన్నారు. 38.3 శాతం మంది అధిక బరువు, 26.4 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. అధిక బరువు, వయస్సు, వైవాహిక స్థితి, మానసిక ఆరోగ్యం ఇతర అంశాల మఽధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వివాహమైన మగవాళ్లు సింగిల్‌గా ఉన్న పురుషుల కంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని, వివాహిత మహిళలకు ఊబకాయం వచ్చే సమస్య ఎక్కువగా లేదని వెల్లడించారు. ‘ఒబెసిటీ హెల్త్‌ అలయెన్స్‌’ డైరెక్టర్‌ కాథరిన్‌ జెన్నెర్‌ మాట్లాడుతూ పురుషులు పెళ్లయిన తర్వాత తినే ఆహార పరిమాణం పెరగడం, బయట తినడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో బరువు పెరుగుతారని పేర్కొన్నారు. అయితే సామాజికంగా ఉన్న కొన్ని ఒత్తిళ్లకు కారణంగా మహిళలు శరీర బరువు విషయంలో జాగ్రత్తగా ఉంటారని అభిప్రాయపడ్డారు.


250 కోట్ల మంది

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందిపైగా పెద్దలు, పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారని, 1990 నుంచి ఊబకాయం రేటు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటోందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. 2050 నాటికి, పిల్లల్లో మూడో వంతు మంది, వయోజనుల్లో సగానికి పైగా అధిక బరువు లేదా ఊబకాయం బారిన పడతారని లాన్సెట్‌ అఽధ్యయనం అంచనా వేసింది. వివాహం తర్వాత పురుషుల్లో అధికంగా కెలోరీలు తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం ఫలితంగా మొదటి ఐదేళ్లలో శరీర ద్రవ్యరాశి సూచిక (బీఎంఐ) పెరుగుతుందని గత ఏడాది ఒక చైనా అధ్యయనం వెల్లడించింది. పెళ్లయిన పురుషులు సాఽధారంగా ఒంటరి వాళ్ల కంటే 1.4 కేజీల బరువు ఎక్కువగా ఉంటారని యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ అధ్యయనం పేర్కొంది. పురుషులు గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి కారణాలతో అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఈ పరిస్థితుల్లో బరువు అనేది ఒక కీలక అంశమని మెన్స్‌ హెల్త్‌ ఫోరం కన్సల్టెంట్‌ జొమ్‌ పోలార్డ్‌ అన్నారు. ఊబకాయం సమస్యను ఎదుర్కొనేందుకు మరింత లక్ష్యంతో కూడిన విధానం అవసరమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 05:08 AM