Share News

Chief Minister: చెన్నైలో కార్ల్‌ మార్క్స్‌ విగ్రహం

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:50 AM

చెన్న మహానగరంలో కార్ల్‌ మార్క్స్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అంటూ పిలుపునిచ్చి సోషలిస్టు భావాలను వ్యాపింపజేసిన ప్రముఖ సోషలిస్టు విప్లవకారుడు, సామాజిక వేత్త కార్ల్‌మార్క్స్‌ను భావితరాలు గుర్తుంచుకోవాలని సీఎం అన్నారు.

Chief Minister: చెన్నైలో కార్ల్‌ మార్క్స్‌ విగ్రహం

- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం

చెన్నై: ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అంటూ పిలుపునిచ్చి సోషలిస్టు భావాలను వ్యాపింపజేసిన ప్రముఖ సోషలిస్టు విప్లవకారుడు, సామాజిక వేత్త కార్ల్‌మార్క్స్‌(Karl Marx)ను భావితరాలు గుర్తుంచుకునేలా రాజధాని నగరం చెన్నైలో ఆయనకు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister M.K. Stalin) ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో గురువారం ఉదయం 110వ సభానిబంధన కింద ఓ ప్రకటన చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..


చరిత్రలో ఎంతోమంది జన్మిస్తారని, పలువురు తమ వంతు సేవలందించి చరిత్రలో స్థానం సంపాదించుకుంటారని, అయితే చరిత్ర గమనాన్నే మార్పు చేసిన ఘనత కార్ల్‌మార్క్స్‌కే దక్కిందని కొనియాడారు. కార్ల్‌ మార్క్స్‌ సంస్మరణ దినమైన మార్చి 14నే శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వివిధ కులాల వారు,, మతాల వారు నివశించే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు భారతీయులంతా పునర్వికాసం చెందుతారని కార్ల్‌మార్క్స్‌ తన రచనల్లో పేర్కొన్నారని స్టాలిన్‌ గుర్తు చేశారు.


ఆ కారణంగానే మార్క్స్‌ - ఏంజెల్స్‌ రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రకటనను మొదటిసారిగా తమిళంలో అనువదించి 1931లోనే ద్రవిడ ఉద్యమ నేత పెరియార్‌ వెలువరించారని, అంతటి మహామేథావి కార్ల్‌మార్క్స్‌ విగ్రహాన్ని రాజధాని నగరం చెన్నై(Chennai)లో ప్రతిష్టించడం సమంజసంగా ఉంటుందన్నారు. వందేళ్ల క్రితమే కార్మిక సంఘాల ఉద్యమం తీవ్రరూపం దాల్చిన చెన్నై నగరంలో కార్ల్‌మార్క్స్‌ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా సముచితంగా ఉంటుందని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.


మూక్కయ్యదేవర్‌కు స్మారకమండపం..

ఉసిలంపట్టిలో స్వాతంత్య్ర సమరయోధుడు మూక్కయ్యదేవర్‌కు స్మారక మండపం నిర్మించనున్నట్లు కూడా స్టాలిన్‌ ప్రకటించారు. అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ అధ్యక్షుడు ‘ఉరంగాపులి’ (నిద్రించని పులి) బిరుదాంకితుడైన పీకే మూక్కయ్యదేవర్‌ 103 జయంతి వేడుకలు శుక్రవారం జరుగనున్నాయని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ దివంగత నాయకుడికి స్మారక మండపం నిర్మిస్తామని సభ్యుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. మూక్కయ్యదేవర్‌ 1952లో పెరియకుళం నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారని, ఆ తర్వాత 1957, 1962, 1967, 1971, 1977 శాసనసభ ఎన్నికల్లో ఉసిలంపట్టి నియోజకవర్గంలో పోటీ చేసి వరుసగా విజయం సాధించారని గుర్తు చేశారు.


1967లో రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు మూక్కయ్యదేవర్‌ అండగా నిలిచారని చెప్పారు. అప్పట్లో ప్రోటర్మ్‌ స్పీకర్‌గా ఆయన తొలిసారి ఎన్నికైన డీఎంకే శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించారని తెలిపారు. కచ్చాదీవిని శ్రీలంక ప్రభుత్వానికి ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తొలిసారి పార్లమెంట్‌లో నిరసన ప్రకటించిన నాయకుడు మూక్కయ్యదేవర్‌ మాత్రమేనని స్టాలిన్‌ తెలిపారు. దేవర్‌ కులస్థులకు విద్యా సదుపాయాలందించాలని మూక్కయ్యదేవర్‌ కోరిక మేరకు కముది, ఉసిలంపట్టి, మేల్‌నీలిత్తనల్లూరు ప్రాంతాల్లో అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై ప్రభుత్వ కళాశాలలు నెలకొల్పినట్లు చెప్పారు. ‘న్యాయానికి కట్టుబడే మహానాయకుడు మూక్కయ్యదేవర్‌’ అని అన్నాదురై చేత ప్రశంసలందుకున్న ఆ మహనీయుడికి ఉసిలంపట్టిలో స్మారక మండపం ఏర్పాటు చేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు.


పీఎంకే, సీపీఐ హర్షం...

రాజధాని నగరం చెన్నైలో కార్ల్‌మార్క్స్‌ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు సీఎం స్టాలిన్‌ ప్రకటించడంతో పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌, అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి, సీపీఐ నేత ముత్తరసన్‌ హర్షం ప్రకటించారు. ఇదే విధంగా ఉసిలంపట్టిలో స్వాతంత్య్ర సమరయోధుడు మూక్కయ్యదేవర్‌కు స్మారక మండపం నిర్మించనుండటం కూడా హర్షణీయమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 11:50 AM