డిజిటల్ తెరపై తిరుగులేని తార
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:47 AM
నీతూ బిష్త్... ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక సంచలనం. ఆమె పేరిట ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌కు సబ్‌స్ర్కైబర్ల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రతి వీడియోకూ వీక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటోంది...

అభిరుచి
నీతూ బిష్త్... ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక సంచలనం. ఆమె పేరిట ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌కు సబ్‌స్ర్కైబర్ల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రతి వీడియోకూ వీక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. దానికి తగినట్టే ఆదాయం కూడా వచ్చి పడుతోంది. డిజిటల్ తెరపై తిరుగులేని తారగా అభిమానులను సంపాదించుకుంది. ఇంతకీ ఎవరీ అమ్మాయి? ఆమె కంటెంట్‌లో అంత ప్రత్యేకత ఏముంది?
నీతూది మధ్యతరగతి కుటుంబం. తల్లి మోహిని బిష్త్. తండ్రి ప్రతాప్ బిష్త్... రాష్ట్రపతి భవన్‌లో ఉద్యోగి. నీతూకి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పుట్టింది ఉత్తరాఖండ్‌లోని కర్చులి అయినప్పటికీ... తండ్రి ఉద్యోగరీత్యా అంతా కలసి ఢిల్లీలో ఉండేవాళ్లు. పిల్లలంతా ‘డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయ స్కూల్’లో చదువుకొనేవాళ్లు. నీతూకి పదకొండేళ్లప్పుడు సెరిబ్రల్ హెమరేజ్‌తో తండ్రి మరణించారు. దీంతో కుటుంబ బాధ్యతను తలకెత్తుకున్న తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలని డిగ్రీ పూర్తికాగానే చిన్న ఉద్యోగంలో చేరింది నీతూ.
మొదటి అడుగు వేసింది ఇలా...
2016లో షార్ట్ వీడియో ఫ్లాట్‌ఫామ్ ‘టిక్ టాక్’ ఓ ప్రభంజనంలా వచ్చింది. అందులో వచ్చే వీడియోలు చూసి నచ్చడంతో తను కూడా కొత్తగా ప్రయత్నించాలనుకుంది 27 ఏళ్ల నీతూ. టిక్‌టాక్‌లో చిన్న చిన్న వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఇదే ఆమె వేసిన మొదటి అడుగు. తరవాత ఆమె వెనుదిరిగి చూడలేదు. కొన్ని రోజుల్లోనే నీతూకి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. క్రమంగా మోడలింగ్, కమర్షియల్ యాడ్స్ అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని గెలుపు బాటగా మార్చుకుంటూ నీతూ ముందుకు సాగింది.
సోషల్ మీడియానే కెరీర్‌గా...
2018లో ప్రభుత్వం టిక్‌టాక్‌ని నిషేధించింది. అయినా నీతూ నిరాశ పడలేదు. ఆమె 2011లోనే యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. అడపా దడపా వీడియోలు ఆప్‌లోడ్ చేస్తూ ఉండేది. టిక్‌టాక్ బ్యాన్ అయిన తరవాత యూట్యూబ్ మీద దృష్టి నిలిపింది నీతూ. టిక్‌టాక్ తరహాలోనే చిన్న చిన్న వీడియోలు, రీల్స్ చేసి అప్‌లోడ్ చేయడం ప్రారంభించింది. చూస్తుండగానే యూట్యూబ్‌లో కూడా సబ్‌స్క్రయిబర్స్ పెరిగిపోయారు. బయటికి వెళితే చాలు అందరూ గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకునేవాళ్లు. దీంతో సోషల్ మీడియానే కెరీర్‌గా మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది నీతూకి. వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా యాక్టివ్ రోల్ పోషించడం మొదలుపెట్టింది. క్రమంగా వ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా, వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవడంతోపాటు కోట్లు ఆర్జించే స్థాయికి ఎదిగింది.
ప్రేమ... పెళ్లి...
మోడలింగ్‌లో రాణిస్తున్న సమయంలో నీతూకి ప్రొఫెషనల్ క్రికెటర్ లఖన్ అర్జున్ రావత్‌తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.... 2021 జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. రెండేళ్ల తరవాత 2023 ఫిబ్రవరిలో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసింది నీతూ.
ఇవి కూడా...
నీతూ... ఒకవైపు మోడలింగ్, మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీగా మారిపోయింది. బింగో, లివ్‌ప్యూర్, అమెజాన్, కోస్టా, పాంటలూన్స్ ప్రకటనలు ఆమెకు మంచిపేరు తెచ్చాయి. ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్‌కి ప్రమోషన్స్ చేసింది. పంజాబీ సాంగ్ ‘బద్నామి’లో కూడా కనిపించి మురిపించింది.
కంటెంట్‌కీ ఫ్యాన్స్ ఉన్నారు...!
నీతూ పోస్ట్ చేసే వీడియోల్లోని కంటెంట్‌కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హాస్యం మేళవించిన సంభాషణలతో ఈ వీడియోలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటి వ్యవధి కొన్ని సెకన్లు మాత్రమే ఉండడంతో అవి బాగా పాపులర్ అయ్యాయి. నీతూ ఎక్కువగా ట్రావెల్, ఫ్యాషన్, కామెడీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ బ్యూటీ టిప్స్ చెబుతుంది. నీతూ ఇప్పటి వరకు సుమారు 3,000ల షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేసింది. వీటిలో పెద్ద వీడియోలు 8 మాత్రమే ఉన్నాయి. టిక్‌టాక్ అయినా, యూట్యూబ్ అయినా ఆమె అనుసరించిన పంథా షార్ట్ వీడియోలే. ఇవే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
మిలియన్ మార్క్...
నీతూ బిష్త్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్‌ను ఇప్పటి వరకు 3.2 కోట్ల్ల మంది సబ్‌స్ర్కైబ్ చేశారు. ఆమె వీడియోలకు కూడా లక్షల కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. కోటి మంది వీక్షించిన వీడియోలు ఆమె చానెల్‌లో చాలానే ఉన్నాయి. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ షార్ట్ వీడియోను దాదాపు ఆరు కోట్ల మంది చూశారు. నీతూకి ఫేస్‌బుక్‌లో నలభై లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తీసిపోనంతగా క్రేజ్ సంపాదించుకుంది నీతూ.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..