ఆయన ఇల్లే ఒక చిత్రకళా నిలయం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:28 PM
ఆయనొక డ్రాయింగ్ మాస్టర్. చూడచక్కని బొమ్మలు ఎన్నో వేశాడు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. బి.నర్సింగరావు తీసిన ‘దాసి’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఆ విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుని ‘దాసి సుదర్శన్’గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన ఇల్లే ఒక చిత్రకళా నిలయంగా మారింది. ఆ విశేషాలే ఇవి

పిట్టంపల్లి సుదర్శన్ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ ‘దాసి సుదర్శన్’ అంటే అందరికీ తెలుసు. నాగార్జునసాగర్ ఆయన స్వస్థలం. అక్కడే జూనియర్ కాలేజీలో డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేసేవారు. 72 ఏళ్ల వయసులో గత ఏడాది (ఏప్రిల్ 1న) ఆయన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
అయితే.. ఏడాది తిరగకముందే సుదర్శన్ స్నేహబృందం, అభిమానులు నాగార్జునసాగర్‌లో ఆయన నివసించిన ఇంటినే చిత్రకళా నిలయంగా మార్చారు. పాడుబడ్డ ఇంటిని కళాత్మకమైన బొమ్మలతో అందంగా రూపుదిద్ది ‘దాసి సుదర్శన్ స్మారక చిత్రకళా నిలయం’గా కళాభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
మిత్ర బృందంతో కలిసి...
సుదర్శన్ చిత్రకారుడు మాత్రమే కాదు... ఫొటోగ్రాఫర్, జర్నలిస్ట్, నటుడు, గాయకుడిగా బహుముఖప్రజ్ఞాశాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన తోటి మిత్రబృందంతో కలిసి అనేక సాహితీ, సాంస్కృతిక, సినిమా కార్యక్రమాలు నిర్వహించేవారు. నాటకం, చిత్రకళ, ఫొటోగ్రఫీ, సినిమా, సాహితీ రంగాలలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రోగ్రెసివ్, శాస్త్రీయ దృక్పథం కలిగిన వీరంతా కలిసి ‘చైతన్య సమాఖ్య’ అనే లైబ్రరీని స్థాపించారు. అనేక పుస్తకాల్ని యువతరానికి అందుబాటులో ఉంచి సమాజ చైతన్యానికి బాటలు వేశారు. 70 దశకాల్లోనే ఫిలిమ్ సొసైటీని కూడా ఏర్పాటుచేసి, సమాంతర సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్యామ్‌బెనగళ్ ‘అంకుర్’, మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’, బీవీ కారంత్ ‘చోముని డప్పు’తో పాటు ‘ఊరుమ్మడి బతుకులు’, ‘చలిచీమలు’, ‘ఆల్బర్ట్ ప్రింటో కో గుస్సా క్యోం ఆతాహై’, ‘రజనీగంధ’లాంటి సినిమాలను మిర్యాలగూడ ప్రాంతంలోని ఆయా థియేటర్ల యజమానుల్ని ఒప్పించి ప్రదర్శించేవారు.
వాటిలోని సామాజిక నేపథ్యాన్ని, వివక్షతను అందరూ సులువుగా అర్థం చేసుకోవడానికి... సినిమా ప్రదర్శన అనంతరం రివ్యూ సమావేశాల్ని ఏర్పాటు చేసి చర్చించేవారు. దీనివల్ల అందరికీ సినిమాలపై అవగాహన పెరిగేలా కృషి చేశారు. 1970లలో సాహిత్యం, సినిమా, కళారంగాల్లో ఒక ఊపులా వచ్చిన మార్పుని అలాగే ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి సుదర్శన్ మిత్ర బృందం గొప్ప ప్రయత్నమే చేసింది. ఆయన నాగార్జునసాగర్ జూనియర్ కళాశాలలో డ్రాయింగ్ మాస్టర్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత అదే ఒరవడిలో నాగార్జునసాగర్‌ను ఆయా కళారంగాల్లో కళకళలాడేట్టు చేశారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటి ఎంతోమంది సాహితీవేత్తలను నాగార్జున సాగర్‌కు పిలిపించి సాహిత్య సౌరభాలు వెదజల్లారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు తీసిన సినిమాలన్నింటికీ పనిచేశారు. బహుముఖంగా తన ప్రతిభను ప్రదర్శిస్తూనే వందలాది పెయింటింగులు వేశారాయన. వృద్ధాప్య సమస్యలతో ఆయన వాటిని సంరక్షించలేకపోవడంతో చాలా పెయింటింగ్స్ దెబ్బతిన్నాయి.
‘కళా’ ప్రదర్శన...
గత ఏడాది సుదర్శన్ కన్నుమూయడంతో... నాగార్జునసాగర్‌లో ఆయన కుటుంబం నలభై ఏండ్లుగా నివసించిన ఇంటినే కళానిలయంగా మార్చాలని సుదర్శన్ స్నేహితులు, అభిమానులు భావించారు. సుదర్శన్ సతీమణి స్వతంత్రమ్మ సహకారంతో ఇంటినే ఆర్ట్‌గ్యాలరీగా మార్చారు. ఆయన వేసిన వందలాది పెయింటింగులను ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రాంగణంలోనే లైబ్రరీతో పాటు, ఏడాదిపొడవునా ప్రముఖ ఆర్టిస్టులతో ఆర్ట్ క్యాంపులు, మిగతా కళల పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమాలు, సాహితీ సదస్సులను నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. గ్యాలరీ నిర్వహణ కోసం ఒక ట్రస్టును కూడా ఏర్పాటుచేయనున్నారు. నాగార్జునసాగర్ దర్శనీయ స్థలాలైన నందికొండ, బుద్ధవనం, సాగర్ డ్యామ్ లిస్టులో ఇప్పుడు ‘దాసి సుదర్శన్ స్మారక చిత్రకళా నిలయం’ కూడా చేరడం కళాభిమానులకు గుడ్‌న్యూసే కదా!
-నర్సిం, 94442 10957
ఈ వార్తలు కూడా చదవండి:
Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్ కారు
ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు
Read Latest Telangana News and National News