Share News

Sunita Williams: సునీత విలియమ్స్ తొలి పత్రికా సమావేశం.. భారత్‌పై ఆసక్తికర కామెంట్స్

ABN , Publish Date - Apr 01 , 2025 | 09:38 AM

అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఓ అద్భుతంలా కనిపిస్తుందని నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అన్నారు. ఇటీవలే భూమికి తిరిగొచ్చినా ఆమె తన తోటి వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.

Sunita Williams: సునీత విలియమ్స్ తొలి పత్రికా సమావేశం.. భారత్‌పై ఆసక్తికర కామెంట్స్
Sunita Williams

చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నాసా ఆస్ట్రొనాట్ సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి వచ్చారు. కొన్ని రోజుల క్రితమే భూమికి తిరిగొచ్చిన సునీత, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌ ఇప్పటివరకూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాస్త స్వస్థత చిక్కాక తొలిసారిగా పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. అంతరిక్షంలో తమకు ఎదురైన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

అంతరిక్ష నుంచి భారత్‌ను చూస్తే ఎలా అనిపించిందని మీడియా సునీతను ప్రశ్నించగా అద్భుతం అని ఒక్కముక్కలో సమాధానం ఇచ్చారు. ‘‘ఇండియా నిజంగానే అద్భుతం.. భారత్ మీదుగా చెక్కర్లు కొట్టిన ప్రతిసారీ బుచ్ ఫొటోలు తీసుకున్నారు’’ అని సునీత తెలిపారు. తన భారతీయ మూలాలను తరచూ గుర్తు చేసుకునే సునీత విలియమ్స్.. అంతరిక్షం నుంచి చూస్తే భారత్ అందాలు అద్భుతంగా ఉంటాయని పలుమార్లు అన్నారు. పశ్చిమతీరంలోని ఫిష్ నెట్స్, ఉత్తరాన ఉన్న హిమాలయాలు..అన్నీ అద్భుతమని చెప్పారు.


Also Read: సునీత విలియమ్స్ శాలరీ.. అంతరిక్షంలో ఓవర్ టైం.. పరిహారం ఎంతంటే..

‘‘అంతరిక్షం నుంచి పగటి పూట చూస్తే కనిపించే హిమాలయాల అందాలు, రాత్రిళ్లు నగరాల్లో విద్యుత్ కాంతులు అద్భుతంగా కనిపిస్తాయి. ఇదో రంగుల ప్రపంచం. విద్యుత్ కాంతుల వలయం’’ అని వివరించారు.

నాసా త్వరలో చేపట్టబోతున్న ఆక్సియమ్ మిషన్‌ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సునీత చెప్పుకొచ్చారు. ఈ మిషన్‌లో భాగంగా అంతరిక్ష యాత్ర చేసే నలుగురు వ్యోమగాముల్లో భారతీయ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ శుభాంశు శుక్లా కూడా ఉన్నారు. ‘‘ ఓ భారతీయుడిగా ఆయన తన అనుభవాన్ని తోటి భారతీయులతో పంచుకుంటారు’’ అని సునీత అన్నారు.


Also Read: త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్.. పర్యటన ఖరారు

భారత అంతరిక్ష కార్యక్రమాలకు సహకరించడంపై కూడా సునీత ఆసక్తి ప్రదర్శించారు. ఇండియా అద్బుతమైన ప్రజాస్వామిక దేశమని అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్‌ ప్రయాణంలో భాగం కావడం తనకు ఎంతో ఇష్టమని అన్నారు.

గతేడాది ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు సునీత, బుచ్ విల్‌మోర్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వారు ప్రయాణించిన వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాల కారణంగా తిరుగు ప్రయాణం పలుమార్లు వాయిదా పడింది.దీంతో, వారు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది.

Read Latest and Viral News

Updated Date - Apr 01 , 2025 | 10:04 AM